వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలోనే జొన్నగిరి గోల్డ్ మైనింగ్ అభివృద్ధి 

మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి స్ప‌ష్టం

కర్నూలు జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆమె స్పష్టం చేశారు.  2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును వెలుగులోకి తీసుకువచ్చారని, నోటిఫికేషన్ ద్వారా జియో మైనింగ్ కార్యకలాపాలకు మార్గం సుగమం చేశారని తెలిపారు. అయితే అనంతర కాలంలో ప్రాజెక్టు పురోగతి ఆశించిన స్థాయిలో జరగలేదని పేర్కొన్నారు.

2019 నుంచి 2024 వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో అవసరమైన అనుమతులు మంజూరై, ప్రాజెక్టుకు వేగం పెరిగిందని అన్నారు. అదే సమయంలో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభించాయని తెలిపారు.  జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ కాలంలో ముందుకు సాగిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యాంబాబు చేస్తున్న అభివృద్ధి వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు.

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పత్తికొండ నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని శ్రీదేవి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు ఇప్పటికీ అమలుకాలేదని, ప్రజలకు వాటి ప్రయోజనాలు అందలేదని విమర్శించారు. వైయ‌స్ జగన్ పాలనలో సుపరిపాలన అందించబడిందని పేర్కొన్న ఆమె, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన విధంగా స్పందిస్తారని హెచ్చరించారు.  

Back to Top