అనంతపురం: తాడిపత్రిలో వైయస్ఆర్‌సీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 26న తాడిపత్రి గాంధీ విగ్రహం వద్ద సామూహిక దీక్ష చేపట్టాలని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా నాయకత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు, ప్రజలు పెద్దఎత్తున హాజరై ప్రజాస్వామ్య పరిరక్షణకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగులకుంట కేశవరెడ్డిని వైయస్ఆర్‌సీపీ జిల్లా నాయకులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో జిల్లా నేతలు ఏమన్నారంటే..వారి మాటల్లోనే - మితిమీరిన అధికార పార్టీ నేతల అరాచకం: అనంత వెంకట్రామిరెడ్డి, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు తాడిపత్రిలో అధికార టీడీపీ నాయకుల అరాచకం మితిమీరిపోయింది. వైఎస్సార్‌సీపీ నాయకుడు గంగులకుంట కేశవరెడ్డి పోలీస్ స్టేషన్ సమీపంలో టీ తాగుతుండగా జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే అక్కడ కూడా మరోసారి దాడికి ప్రయత్నించారు. ఏకంగా ఆస్పత్రిపైనే రాళ్లతో దాడి చేయడం అత్యంత దారుణం. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థమవుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులకు రక్షణ కరువైంది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమయ్యాయి. విపక్ష నాయకులపై దాడులు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసం రోజువారీగా మారిపోయాయి. పోలీసులు ఇకనైనా హింసాకాండను నిరోధించకపోతే రాష్ట్రంలో కొత్త దుష్ట సంప్రదాయానికి బీజం వేసిన వారవుతారు. కేశవరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వారందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి. - ఖాకీ చొక్కా తీసేసి టీడీపీ కండువాలు వేసుకోండి : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది. జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్‌లోనే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి, చైన్ స్నాచింగ్ ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. జేసీ ఇచ్చే లంచాలకు అధికారులు అలవాటు పడ్డారు కాబట్టే శాంతి భద్రతలు గాలికొదిలేశారు. నేరాలకు పాల్పడటం, కౌంటర్ కేసులు పెట్టడం ఆయనకు అలవాటుగా మారింది. పోలీసులు ఇకనైనా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. జేసీ దౌర్జన్యాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఈ నెల 26వ తేదీన జరిగే సామూహిక దీక్షను విజయవంతం చేయండి. - కేశవరెడ్డిపై దాడి చేయడం దుర్మార్గం: విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డి పై హత్యాయత్నం దారుణం. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి పై దాడి చేయడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. తాడిపత్రిలో హింసపై ఐపీఎస్ అధికారి జగదీష్ మౌనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆయన చేతగాని తనం, అసమర్థత వల్లే టీడీపీ నేతలు దాష్టికానికి పాల్పడుతున్నారు. - దాడులు చేస్తే సహించేది లేదు: తలారి రంగయ్య, మాజీ ఎంపీ లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల రక్తపాతం సాక్షిగా చెబుతున్నాం. నేరమైన రాజకీయాలను ముక్కుమ్మడిగా, ఐక్యంగా ఎదుర్కొంటాం. జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నాం. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తల రక్తం పారకుండా పోరాటం చేస్తాం. పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? రక్తం శరీరంలో మాత్రమే ప్రవహించాలి, నీళ్లు పొలాల్లోనే పారాలి. ఇకనైనా కార్యకర్తలపై దాడులు ఆపాలి. చట్టబద్ధంగా వ్యవహరించాలి కానీ విచ్చలవిడిగా రోడ్లపైకి వచ్చి దాడులు చేస్తే సహించేది లేదు. ఈ ప్రభుత్వం ఏదైతే విత్తనం విత్తుతుందో అదే పంట పండుతుంది అన్నది గమనించాలి.