నెల్లూరు జిల్లా: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మాత్రమే నెల్లూరు జిల్లాలో వ్యవసాయ రంగానికి స్థిరమైన అభివృద్ధి సాధ్యమని వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో సోమశిల ప్రాజెక్ట్‌ను పార్టీ నేతలు, రైతులు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..సోమశిల, కండలేరు జలాశయాల అభివృద్ధి ఘనతను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికు చెందుతుందని ఆయన పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టుల రూపకల్పన, విస్తరణలో ఆయన నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయని వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా నెల్లూరు జిల్లాలోని జల ప్రాజెక్టుల పనులను కొనసాగించి పూర్తిచేసిన ఘనత ఆయన ప్రభుత్వానిదేనని తెలిపారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి: నారా చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని, రాష్ట్ర వ్యవసాయ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని కాకాణి ఆరోపించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా రాజకీయ వ్యాఖ్యలు చేశారు. సోమశిల ప్రాజెక్టు పరిధిలో ఆప్రాన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పురోగతి కనిపించలేదని కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జలాశయానికి ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు వచ్చినప్పటికీ పనుల్లో ఎటువంటి మార్పు లేదని ఆయన అన్నారు. “పోలీసులకు భయపడము, వెనకడుగు వేయము” అని వ్యాఖ్యానించిన ఆయన, రైతుల హక్కుల కోసం వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.