సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు  సీబీఐకి అప్ప‌గించాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్‌

వైయ‌స్ఆర్ జిల్లా:  విజ‌య‌వాడ‌కు చెందిన కాపు యువ‌కుడు సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ ప్రభావంలో “ప్రైవేటు సైన్యం”లా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. సాయి కృష్ణపై ఉన్న రెండు నాన్ బెయిలబుల్ వారెంట్ల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని, అనంతరం కృష్ణ లంక పోలీసులతో కలిసి అతడిని హింసించి చంపారని ఆయన వ్యాఖ్యానించారు.  ఏ ప్రాంతంలోనూ సీసీటీవీ ఫుటేజ్ లేకుండా ఆధారాలు మాయం చేయడం ద్వారా ఘటనను దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. జగ్గయ్యపేటలోని ఒక ల్యాండ్ డీల్ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితో ఈ లాకప్ డెత్ జరిగిందని కూడా ఆయన ఆరోపించారు.

సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు సహా మరికొందరు పోలీసులు కలిసి సాయి కృష్ణను హింసించి చంపారని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంఘాలు, వైఎస్సార్‌సీపీ కలిసి బాధిత కుటుంబానికి మద్దతు ఇవ్వడంతో సీఐ నాగరాజుపై కేసు నమోదు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో సూత్రధారులు, పాత్రధారులపై కూడా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రిమాండ్ రిపోర్టులో మరణ సమయం, వివరాలు స్పష్టంగా లేకపోవడం అనుమానాలకు దారితీస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ జరిపితేనే నిజాలు వెలుగులోకి వస్తాయని, దోషులకు కఠిన శిక్షలు పడాలని రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కోరారు.
 

Back to Top