తాడేపల్లి: నారా లోకేష్ కి ఉన్న అహంకారానికి అధికారం కూడా తోడవడంతో ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో సోయ లేకుండా రెచ్చిపోతున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి, కార్మిక సంఘాల నాయకులు చెప్పే మాటలు వినకుండా వారిపై రెచ్చిపోయాడు. దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున పరామర్శకు వెళ్లిన వ్యక్తులు బాధితుల కష్టాలను సంయమనంతో ఆలకించి మానవత్వంతో ఆలోచించి తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలి. కానీ మంత్రి లోకేష్ మాత్రం కార్మిక సంఘాల నాయకులు చెప్పే సమస్యలు వినకుండా మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అంటూ అహంకారంతో కూడిన రెట్టించిన స్వరంతో వారి నోళ్లు మూయించాలని చూశాడు. ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఉద్యోగుల తొలగింపులపై ప్రశ్నిస్తారమేనన్న భయంతో ఉద్దేశపూరితంగా కార్మిక సంఘాల నాయకులను గద్దించబోయాడు. దుర్ఘటన జరిగి 18 గంటలు గడిచిన తర్వాత పరామర్శకు వచ్చింది కాకుండా బాధను వ్యక్త పరచడానికి వచ్చిన నాయకులతో రాజకీయం చేస్తున్నారంటూ లోకేషే క్షుద్ర రాజకీయాలు చేశాడు. బాధ్యత లేకుండా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు, కూటమి రెండేళ్ల విధ్వంస పాలనకు మూల్యం చెల్లించక తప్పదు. బాధిత కుటుంబాలకు, కార్మిక సంఘాలకు నారా లోకేష్ క్షమాపణలు చెప్పాలి. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు హుటాహుటిన 3 గంటల్లోనే ప్రమాద స్థలికి చేరుకుని బాధితులను పరామర్శించడంతో పాటు మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించి చెక్కులు కూడా అందజేశారు. కానీ నేడు స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన తర్వాత మీనమేషాలు లెక్కిస్తూ ఆలస్యంగా వచ్చింది కాకుండా ఇంతవరకు బాధితుల కుటుంబాలకు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పడం లేదు. విశాఖలో వందల కోట్ల విలువైన భూములు 99 పైసలకే ఇస్తానని చెప్పిన లోకేష్, ఇప్పుడు బాధితులను ఆదుకుంటానని అంతే స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? తన శాఖ కాకపోయినా పబ్లిసిటీ కోసం ప్రతిదానికీ లోకేష్ ముందుకొస్తున్నాడు. ఇంత భారీ ప్రమాదం జరిగితే పరిశ్రమలశాఖ మంత్రి ఇంతవరకు కనిపించలేదు.