గ్రామీణ ప్రాంత విద్యార్థుల బస్సు కష్టాలు పట్టవా మంత్రి లోకేష్?

 విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యం కల్పించాలి

ఆర్టీసీ అధికారులకు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వినతి

అనంతపురం  :  జిల్లాలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సరైన బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ విమర్శించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ఇన్‌చార్జ్ ప్రాంతీయ మేనేజర్ కె.శ్రీలక్ష్మికి వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా బస్సు సౌకర్యం లేని గ్రామాలను గుర్తించి కొత్త సర్వీసులు ప్రారంభించాలని కోరారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రయాణించే మార్గాల్లో అదనపు ట్రిప్పులు నడపడంతో పాటు, పాఠశాలలు మరియు కళాశాలల సమయాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు తమ పాఠశాలలు, కళాశాలల వరకు బస్ పాస్ సౌకర్యాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సుల కొరత కారణంగా విద్యార్థులు ప్రతిరోజూ కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సంక్షేమం కంటే ప్రచార కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఒకవైపు విద్యార్థులపై ఆర్థిక భారం పెంచుతూ, మరోవైపు కనీస రవాణా సౌకర్యాలు కూడా కల్పించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చంద్రశేఖర్ యాదవ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, నగర అధ్యక్షుడు కైలాష్, ఉపాధ్యక్షుడు అంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు పులి కార్తికేయ, హరీష్, చరణ్, ప్రశాంత్, బబ్లు, బాబా ఇమ్రాన్, రియాజ్, మనోజ్, ప్రదీప్, నివాస్, షారీక్, ఫయాజ్, సోహెబ్, రఫీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top