తాడేపల్లి: గాదె విజయలక్ష్మి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, పోలీసుల వేధింపులు, అనుమానాస్పద ఘటనలకు గురైన ఇతర బాధిత కుటుంబాలందరికీ అదే స్థాయిలో న్యాయం, భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కృష్ణా జిల్లా వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) స్పష్టం చేశారు. సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘటనలు రెండూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే చోటుచేసుకున్న నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ బాధ్యత నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. 40 రోజులుగా సాయికృష్ణ కుటుంబం న్యాయం కోసం తిరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం, ఎఫ్‌ఐఆర్ నమోదై 48 గంటలు గడిచినా కీలక ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం ప్రజల్లో మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘటనలపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని, అవసరమైతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు నిర్వహించాలని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన గాదె సాయికృష్ణ అదృశ్య ఘటన, దళిత యువకుడు క్రాంతికుమార్ మరణం వంటి సంఘటనలు ప్రజల్లో తీవ్ర అనుమానాలు, భయాందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ప్రెస్‌మీట్‌లో పేర్నినాని ఏమన్నారంటే.. - గాదె విజయలక్ష్మికి భరోసా ఇచ్చారు..మిగతా బాధితుల సంగతేంటి? గాదె విజయలక్ష్మి కుటుంబాన్ని పిలిపించి భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తున్నాం. కానీ అదే భరోసా పోలీసుల వేధింపులు, దాష్టీకాలకు బలైన ప్రతి బాధిత కుటుంబానికీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనదే. సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘటనలు రెండూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే జరిగాయి. అందువల్ల ఈ రెండు కేసుల్లోనూ విజయవాడ పోలీస్ కమిషనర్ బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ఇంత పెద్ద వివాదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నా ఇప్పటివరకు సీపీ ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. - 40 రోజులు ఎందుకు మౌనం పాటించారు? సాయికృష్ణ అదృశ్యమైన తర్వాత అతని తల్లి గాదె విజయలక్ష్మి దాదాపు 40 రోజుల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. తన కుమారుడు బతికున్నాడా? చనిపోయాడా? అని కన్నీరు మున్నీరయ్యారు. కానీ ఆ సమయంలో ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఒక్కసారి అయినా కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడలేదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రశ్నించిన తర్వాత, ప్రజల్లో ఆగ్రహం పెరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. - సాయికృష్ణ బతికే ఉన్నాడా? చనిపోయాడా? సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 48 గంటలు దాటిపోయింది. అయినా రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. సాయికృష్ణ బతికే ఉన్నాడా? లేక చనిపోయాడా? మృతదేహం ఎక్కడ ఉంది? అస్తికలు ఎక్కడ ఉన్నాయి? కనీసం బూడిద ఎక్కడ ఉందో ప్రభుత్వం చెప్పగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది విజయవాడ సీపీ కాదా? - టాస్క్‌ఫోర్స్ చర్యలకు సీపీ బాధ్యత వహించాలి మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చింది టాస్క్‌ఫోర్స్ పోలీసులు. టాస్క్‌ఫోర్స్ నేరుగా కమిషనర్ ఆధీనంలో పనిచేస్తుంది. మరి టాస్క్‌ఫోర్స్ చేసిన చర్యలకు కమిషనర్‌కు బాధ్యత లేదని ఎలా చెబుతారు? సీపీకి తెలియకుండా ఈ వ్యవహారం జరిగిందని ఎవరైనా నమ్మగలరా? - క్రాంతికుమార్ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయరు? పోలీసుల వేధింపులు తట్టుకోలేక దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశాడు. అయినా ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదు. చంద్రబాబు ఇప్పటివరకు ఆ కుటుంబాన్ని పిలిచి భరోసా ఇవ్వలేదు. గాదె విజయలక్ష్మి కుటుంబానికి ఇచ్చిన భరోసానే క్రాంతికుమార్ కుటుంబానికి కూడా ఇవ్వాలి. - విచారణపై ప్రజలకు నమ్మకం లేదు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగాల్సిన కేసులో అదే వ్యవస్థలోని అధికారులు విచారణ చేస్తే ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది?. కింది స్థాయి అధికారి తనకంటే ఉన్నత స్థాయి అధికారులపై ఎలా నిష్పక్షపాతంగా విచారణ జరుపగలడు? ప్రభుత్వం నిజంగా వాస్తవాలు బయటకు తీయాలనుకుంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి. - కేవలం కింది స్థాయి అధికారులను బలి చేయొద్దు సాయికృష్ణ, క్రాంతికుమార్ ఘటనల్లో కేవలం సీఐ, కానిస్టేబుళ్లను మాత్రమే బలి చేయడం సరిపోదు. పైస్థాయి అధికారుల పాత్రపై కూడా విచారణ జరగాలి. అవసరమైతే విజయవాడ పోలీస్ కమిషనర్‌పై కూడా దర్యాప్తు జరపాలి. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది డ్రామాలు కాదు.. వాస్తవాలు. బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుంది. ఈ రెండు ఘటనలపై సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించి నిజాలు వెలికితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం" అని పేర్ని నాని స్పష్టం చేశారు.