పార్వతీపురం మన్యం జిల్లా: వైయస్ఆర్‌సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్‌బాబు ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం పార్టీ శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న శరత్‌బాబు మృతి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా కుంగదీసింది. ఈ విషాద సమయంలో వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా శరత్‌బాబు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శరత్‌బాబు కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంపించిన రూ.3 లక్షల చెక్కును పార్వతీపురం మన్యం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి శరత్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టసమయంలో కార్యకర్త కుటుంబాన్ని మరువకుండా ఆదుకోవడం వైయస్ జగన్ నాయకత్వానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తుందనే సందేశాన్ని ఈ సహాయం మరోసారి చాటిచెప్పిందన్నారు.