ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు, లోపాలు జరుగుతున్నాయి

ప్రధాన ఎన్నికల అధికారికి వైయ‌స్ఆర్‌సీపీ వినతి

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం అమలులో పలు అక్రమాలు, లోపాలు, ఆచరణాత్మక ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.

ఎస్‌ఐఆర్‌ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన సమయంలో క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఎస్‌ఐఆర్‌ విధులతో పాటు ఇతర శాఖాపరమైన పనులు కూడా నిర్వహించాల్సి రావడం వల్ల కార్యక్రమం ప్రభావితమవుతోందన్నారు.

ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినప్పటికీ, వాటి సేకరణ, ధృవీకరణ ప్రక్రియలో ఏకరీతి లేకపోవడం వల్ల గందరగోళం నెలకొంటోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రెండు ఫారాలు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఒక్క ఫారం మాత్రమే అందజేస్తున్నారని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ఎన్నికల యంత్రాంగం విఫలమైందని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలను కూడా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు పెద్ద ఎత్తున ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, అలాగే రాజకీయ నాయకులు బీఎల్‌వోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుతోందని తెలిపారు. ఇటువంటి పరిణామాలు ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

బీఎల్‌వోలు నిర్దేశిత మొబైల్ యాప్ ద్వారా ఓటర్ల ఫోటోలు సేకరించాల్సి ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు.

అలాగే 2026 తాజా ఓటరు జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, వారి బీఎల్‌ఏలకు అందించకపోవడం వల్ల ఓటరు జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ సదుపాయాలు సరిగా లేకపోవడంతో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమం నిర్వహణలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్ది, ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. అలాగే తాజా ఓటరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top