ఇది కోతల ప్రభుత్వం

ఈ ప్రభుత్వానికి వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

బీవై రామయ్య   

పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బీవై రామయ్య

రైతులను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

రైతు భరోసా అమలులో వైయస్ జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా సాయం అందించారు

చంద్రబాబు ఆ హామీలను నిలబెట్టుకోలేకపోయారు.

సుమారు 7 లక్షల మంది రైతులను అన్నదాత సుఖీభవ పథకం పరిధి నుంచి తప్పించి అన్యాయం చేశారు.

మొక్కజొన్న, శనగ, పొగాకు, మామిడి, అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా 
విఫ‌లమైంది.

ప్రకృతి వైపరీత్యాల సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ పథకాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం.

ఆక్వా రైతుల సమస్యలపై ఉద్యమాలు ప్రారంభమైన తర్వాతే ప్రభుత్వం స్పందించడం దాని వైఫల్యానికి 
నిదర్శనం.

ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి సహా ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.

ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు

ప్రెస్‌మీట్‌లో కూట‌మి ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టిన‌ బీవై రామయ్య  

తాడేప‌ల్లి:  రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలు సహా ప్రతి వర్గానికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కోతల పాలన సాగిస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బీవై రామయ్య విమర్శించారు. వైయస్ జగన్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను కుదిస్తూ, రైతులకు అందాల్సిన సాయాన్ని తగ్గిస్తూ, ఎన్నికల హామీలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా నుంచి అన్నదాత సుఖీభవ వరకు, మద్దతు ధరల నుంచి సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, రైతులు, మహిళలు, యువత, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను నిరాశపరిచిన ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ఈ ప్రభుత్వానికి తగిన సమయంలో ప్రజలే రాజకీయంగా వాతలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీవై రామయ్య పేర్కొన్నారు.
ప్రెస్‌మీట్‌లో బీవై రామ‌య్య ఏమ‌న్నారంటే..

- కోతలు పెట్టడం చంద్రబాబు నైజం
వెన్నుపోటు రాజకీయాలకు పేరుగాంచిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరినీ మోసం చేసింది.  మోసం చేయాలనే ఆలోచన రైతుల‌కు ఉండదు. అలాంటి అన్నదాతలను సైతం మోసం చేసిన ప్రభుత్వం ఇదే. 2014లో రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కూడా అదే తీరును కొనసాగిస్తున్నారు. రైతుల కోసం వైయస్ జగన్ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధర వంటి అంశాల్లో అండగా నిలిచారు. చెప్పిన దానికంటే ఎక్కువ చేయడం జగన్ నైజమైతే, కోతలు పెట్టడం చంద్రబాబు నైజం.  

- జ‌గ‌న్‌, చంద్ర‌బాబుకు మ‌ధ్య తేడాను గ‌మ‌నించాలి
 "వ్యవసాయమే దండగ" అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తి రైతులకు ఎలా మేలు చేస్తాడు? వైయస్ జగన్ రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తే, దానిని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రూ.20 వేలిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంతకంటే పెద్ద మోసం మరొకటి ఉండదు. వైయస్ జగన్ 53.58 లక్షల మంది రైతులను గుర్తించి, కైలు రైతులతో సహా ప్రతి రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు సాయం అందించారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం రైతుల సంఖ్యను 46.85 లక్షలకు కుదించగా, కేంద్రం గుర్తించిన వారు కేవలం 39.12 లక్షల మంది మాత్రమే. దాదాపు 7 లక్షల మంది రైతులను పథకం నుంచి తప్పించి కూడా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రచారం చేసుకోవడం రైతులను మోసం చేయడానికే నిదర్శనం. రైతుల విషయంలోనే కాదు, పింఛన్ల విషయంలో కూడా కోతలు పెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న జగన్‌కు, హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబుకు ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలి.

- రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు
మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రకృతి వైపరీత్యాల సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలను కూడా ఎగ్గొట్టింది. రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. తోతాపురి మామిడి, అరటి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఆక్వా రైతుల సమస్యలపై ఉద్యమాలు ప్రారంభమైన తర్వాతే స్పందించింది. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కరోనా సమయంలో కూడా రైతులకు అండగా నిలిచింది వైయస్ జగన్ ప్రభుత్వం. కానీ చంద్రబాబు ఎన్నికల హామీలను అమలు చేయకుండా రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాలను మోసం చేశారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి హామీలు కూడా నెరవేర్చలేదు.
 
- కారుమూరి సునీల్ అరెస్టు అక్ర‌మం
వైయస్ జగన్ 'నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ' అంటూ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుని డీబీటీ ద్వారా నేరుగా సంక్షేమ ఫలాలు అందించారు. కానీ నేడు అదే వర్గాలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోంది. ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేయడం అందుకు నిదర్శనం. జోగి రమేష్, విడదల రజిని, అంబటి రాంబాబు వంటి నేతలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

బీసీలు రాష్ట్రానికి బ్యాక్‌బోన్ అని నమ్మి వైయస్ జగన్ రూ.2.75 లక్షల కోట్లను డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కక్షసాధింపులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని తిరిగి తీసుకురావాలంటే వైయస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని" బీవై రామయ్య పేర్కొన్నారు.
 

Back to Top