రాష్ట్రంలో మద్యం దొరికినంత సులభంగా ఎరువులు దొరకడం లేదు 

కూటమి ప్రభుత్వంపై ఎంవీయస్ నాగిరెడ్డి తీవ్ర ఆగ్రహం.

తాడేపల్లి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ జనరల్ సెక్రటరీ( అగ్రికల్చర్ అంట్ ఫార్మర్స్ వెల్ఫేర్) ఎంవీయస్ నాగిరెడ్డి.

యాప్‌లు, ఓటీపీల పేరుతో రైతులకు వేధింపులు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వం

ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్న పొగాకు కొనుగోలు కంపెనీలు

నోరెత్తని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, కొరవడిన ప్రభుత్వ ఆజమాయిషీ 

మామిడి మద్ధతు ధర కల్పనలోనూ విఫలమైన ప్రభుత్వం

ప్రభుత్వ తీరుపై ఎంవీయస్ నాగిరెడ్డి ఆక్షేపణ 

ఎరువుల విషయంలో తక్షణమే ఆంక్షలు తొలగించాలి

సాగు సంక్షోభాన్ని నివారించాలి

లేనిపక్షంలో అన్నదాతలు రోడ్డెక్కడం ఖాయం

రైతుల కడుపు మంట ప్రభుత్వానికి మంచిది కాదు

కూటమి ప్రభుత్వాన్ని హెచ్చిరించిన ఎంవీయస్ నాగిరెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతోందని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్) ఎంవీయస్ నాగిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది కానీ, పంటలకు కావలసిన ఎరువులు మాత్రం లభించడం లేదని మండిపడ్డారు. సాంకేతికత పేరుతో తెచ్చిన యాప్‌లు, ఓటీపీల నిబంధనలతో కౌలు రైతులను, సామాన్య రైతాంగాన్ని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను సైతం పొగాకు, ఆక్వా ఫీడ్, జ్యూస్ ఫ్యాక్టరీల కంపెనీలు బేఖాతరు చేస్తుంటే.. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని.. తక్షణమే  రైతులకు ఎరువుల సరఫరాలో ఆంక్షలు తొలగించడంతో పాటు, తోతాపురి మామిడి, పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కడుపు మండిన అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. 

1. ఎరువుల కొరత – సాంకేతిక ఆంక్షలతో రైతుల బలి:
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన తరుణంలో ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది కానీ, పంటలకు కావలసిన ఎరువులు మాత్రం లభించడం లేదు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన యాప్ నిబంధనలు, డిజిటల్ పేమెంట్లు క్షేత్రస్థాయిలో విఫలమయ్యాయి. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలలో నెట్‌వర్క్ సమస్యల వల్ల రైతులు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. రైతులు అధికంగా తీసుకుని ఎరువులేమైనా హార్లిక్స్ లా తాగుతారా? పిండివంటలు చేసుకుంటారా?. ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 

2. కౌలు రైతుల దయనీయ స్థితి – ఓటీపీల విధానంతో తిప్పలు:

డెల్టా ప్రాంతాలలో 80 శాతానికి పైగా ఉన్న కౌలు రైతులకు కౌలు కార్డులు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు.ఎరువుల కొనుగోలుకు భూమి యజమాని ఫోన్‌కు ఓటీపీ వెళ్లే విధానాన్ని తీసుకురావడం వల్ల తీవ్ర గందరగోళం నెలకొంది.  ఒకవైపు సైబర్ నేరాల దృష్ట్యా ఓటీపీలు చెప్పవద్దని ప్రచారం చేస్తూ, మరోవైపు ఈ విధానం పెట్టడం వల్ల యజమానులు కౌలుకు ఇవ్వడమే మానేస్తున్నారు. కొన్ని చోట్ల భూ యజమానులు రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఈ ఓటీపీల గోలతో అసలు భూమే కౌలుకివ్వడం మానేస్తున్నారు. దీంతో కౌలుదారులు భూములను సాగు చేయకుండా వదిలేసే దయనీయ పరిస్థితి ఏర్పడింది. 

3. సబ్సిడీలపై తప్పుడు ప్రచారం – శ్రీలంక పరిస్థితులు వద్దు:

రాష్ట్రంలో రసాయనిక ఎరువులపై ఇస్తున్న సబ్సిడీ రైతులకు ఇస్తున్నది కాదు,  అది వినియోగదారులకు (Consumer Price Index) ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు ఇస్తున్న సబ్సిడీ. సేంద్రీయ సాగు పేరిట రసాయనిక ఎరువులను తగ్గిస్తే దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది, గతంలో శ్రీలంకలో వచ్చిన సంక్షోభమే ఇందుకు ఉదాహరణ. రసాయనిక ఎరువులు వాడకపోతే బస్తాకు రూ. 800 నేరుగా ఖాతాల్లో వేస్తామన్న చంద్రబాబు ప్రతిపాదన ప్రాక్టికల్ గా సాధ్యం కాదు, గతంలో సీఎం చంద్రబాబు ఈ మాట చెప్పినప్పుడు ఆయనను అమితంగా ప్రేమించే వారి పార్టీకి చెందిన ఏ రైతైనా ఈ ప్రతిపాదనకు మందుకు వచ్చాడా? 

4. పొగాకు రైతుల సంక్షోభం – సీఎం ఆదేశాలూ బేఖాతరు:

పొగాకు సగటు ధర కిలోకు రూ. 200 ల కంటే తగ్గకూడదని జూన్ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు కంపెనీలతో సమీక్ష నిర్వహించి ఆదేశించారు. అయినా క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. జూన్   24వరకు తీసుకుంటే రాష్ట్రంలో ఇప్పటివరకు సరాసరి రేటు రూ.223.74 పైసలు ఉంది. ఈ ధర 2023-24 ఏడాది మార్కెటింగ్ సీజన్ లో మొత్తం ఏడాది పొడవునా సరాసరి సేల్ రూ.288.65 కంటే కూడా రూ.64.91 తగ్గింది. మరోవైపు  2023 నుంచి ఇప్పటి వరకు పొగాకు కిలో పై రూ.10 -20 వరకు ఉత్పత్తి వ్యయం పెరిగింది. అంటే జూన్ నెల 24 వరకు అమ్మకం జరిగిన రైతులందరూ కిలోకి   రూ.84.91 నష్టపోతున్నారు. 24 జూన్ నాటికి 73 రోజులు ఆక్షన్ డేస్ పూర్తయ్యాయి. 23.34 మిలియన్ కేజీల వేలం జరిగింది. గతేడాది ఇదే 73 రోజుల ఆక్షన్ డేస్ లో 59 మిలియన్ కేజీల అమ్మకం జరిగింది. ఈ ఏడాది పొగాకు కొనుగోలు తగ్గిపోయింది.  
వ్యవసాయ శాఖ ముందస్తు అంచనా ప్రకారం  రబీ సీజన్ లో రూ.250 మిలియన్ కేజీలు ఉత్పత్తి జరగ్గా, రబీ, ఖరీఫ్ కలిపి రూ.266 మిలియన్ కేజీలు ఉత్పత్తి జరుగుతుంది. కానీ టొబాకో బోర్డు మాత్రం 240 మిలియన్ కేజీల ఉత్పత్తి మాత్రమే అని చెబుతుంది. వారి లెక్కల ప్రకారం చూసినా.. ఇంతవరకు కేవలం 23.34 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు జరిగింది. ఇప్పటికీ కేజీ ధర అత్యల్ప ధర రూ.160, అత్యధికంగా రూ.250 మాత్రమే ఉంది. సరాసరి రూ.200 కంటే తక్కువ అమ్మకం జరక్కూడదని సీఎం చంద్రబాబు చెప్పినా అది ఎక్కడా కూడా అమలు కాలేదు. 
రైతులు ఇప్పటికే రెలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ కిసాన్ మోర్చా పేరుతో అతిపెద్ద ట్రాక్టర్ ర్యాలీ చేశారు. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇప్పటికైనా పొగాకు సరాసరి అమ్మకం ధర పెరగాలి. దీనిపై సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 
  
5. మామిడి రైతుల ఆందోళన – మద్దతు ధర కరవు:

చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ప్రధాన పంట అయిన తోతాపురి మామిడి రైతులను జ్యూస్ ఫ్యాక్టరీలు కావాలనే సిండికేట్‌గా మారి ఇబ్బంది పెడుతున్నాయి. గతేడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ధరల స్థిరీకరణ పథకాల ద్వారా రూ. 12 మద్దతు ధర కల్పిస్తే, ఈ ఏడాది కనీస ధర ప్రకటించకుండానే కిలోకు రూ.4 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వల్ల కంపెనీలు కేవలం రూ.5 కే కొంటున్నాయి. ఈ ఏడాది రైతులను ఆదుకోవాలంటే రవాణా, డీజిల్ ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో కిలోకు రూ.16 ధర నిర్ణయించి, జ్యూస్ ఫ్యాక్టరీలు రూ. 10 చెల్లించేలా ప్రభుత్వం తక్షణమే జీవో జారీ చేయాలి. పీడీపీఎస్ స్కీం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. జ్యూస్ ఫ్యాక్టరీలు రూ.10 చెల్లించేలా ధర నిర్ణయించి.. వాటిని చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలి. మామిడి రైతులు ఇంతలా నష్టపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.360 కోట్లు కూడా రైతులకు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాయా? ఈ ధర నిర్ణయిస్తే రైతులకు ఎంతో మద్ధతుగా ఉంటుంది. 

ఈ నేపధ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా రైతుల సమస్యలను లేవనెత్తుతుంటే, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేక వ్యక్తిగత దాడులకు దిగుతోందని ఎం వీ యస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలనే పొగాకు, ఆక్వా ఫీడ్, జ్యూస్ ఫ్యాక్టరీల కంపెనీలు బేఖాతరు చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందో సమాధానం చెప్పాలన్నారు.  ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వైయస్సార్సీపీపై వ్యక్తిగత దాడులు మానేసి, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్ష నిర్వహించి, తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధర కల్పించి.. సంక్షోభంలో ఉన్న అన్నదాతలను తక్షణమే ఆదుకోవడంతో పాటు, రానున్న రోజుల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వరి నాట్లు పెరిగి ఎరువుల డిమాండ్ ఇంకా ఎక్కువవుతుందని, ఇప్పటికైనా ఎరువుల కొరతపై సమీక్ష జరిపి ఆంక్షలు తొలగించకపోతే.. రైతులు కడుపు మండి రోడ్లపైకి రావడం ఖాయమని  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Back to Top