మహిళను వివస్త్రను చేసిన ఘటనకు ఎమ్మెల్యే గల్లా మాధవే కారణం

అంబ‌టి రాంబాబు ఆరోప‌ణ‌

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, అరాచకాలకు నిరసనగా గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.  

గుంటూరులో మహిళను వివస్త్రను చేసి వేధించిన ఘటన బాధాక‌రం

ఈ ఘ‌ట‌న‌లో తొలి ఫిర్యాదుపై కేసు నమోదు కాకుండా ఎమ్మెల్యే మాధ‌వి అడ్డుకున్నారు

రాజీ ప్రయత్నాల వల్లే రెండో దారుణ ఘటన జరిగింది

నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నా.. పరువునష్టం దావాను ఎదుర్కొనేందుకు సిద్ధం

పోలీసులను బలిపశువులను చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది

పోలీసు వ్యవస్థ, హోంమంత్రి పూర్తిగా విఫలం

వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపాటు

గుంటూరు: గుంటూరులో మహిళను వివస్త్రను చేసి వేధించిన దారుణ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి జోక్యమే కారణమని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తొలి ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే రెండోసారి ఇంతటి దారుణం జరిగేది కాదన్నారు. ఎమ్మెల్యే జోక్యంతో తొలి ఫిర్యాదుపై కేసు నమోదు కాకుండా అడ్డుకోవడంతో పాటు రాజీ ప్రయత్నాలు చేయడం వల్లే రెండో ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, తనపై పరువునష్టం దావా వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, అరాచకాలకు నిరసనగా వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు మేరకు గుంటూరు లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
మీడియాతో అంబ‌టి రాంబాబు ఏమ‌న్నారంటే.. 

- ఎమ్మెల్యే జోక్యంతోనే కేసు నమోదు కాలేదు
తొలి ఘటనపై బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని ఉంటే రెండో దారుణం జరిగేది కాదు. తొలి ఫిర్యాదుపై కేసు నమోదు కాకపోవడానికి స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి జోక్యమే కారణం. అప్పటి సీఐ సత్యనారాయణ కేసు నమోదు చేయకుండా ఆమె అడ్డుకున్నారు. నిందితులు టీడీపీకి చెందినవారు కావడంతో వారిని కాపాడేందుకు పోలీస్‌స్టేషన్ స్థాయిలోనే రాజీ చేయడానికి ప్రయత్నించారు. తొలి ఘటనపై చర్యలు తీసుకోకపోవడంతోనే నిందితులు మరింత రెచ్చిపోయి రెండోసారి బాధితురాలిపై దాడి చేసి వివస్త్రను చేసే స్థాయికి వెళ్లారు. మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరులోనే ఒక మహిళకు ఇంతటి అన్యాయం జరగడం అత్యంత దారుణం. గల్లా మాధవి నా మీద పరువునష్టం దావా వేస్తానంటున్నారు.. వేసుకోవచ్చు. నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. పరువునష్టం దావా అయినా, మరే దావా అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను.

- వీడియోలు బయటకు రాకపోతే కేసు పెట్టేవారా?

మహిళపై జరిగిన దారుణానికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కాబట్టే ప్రభుత్వం, పోలీసులు స్పందించారు. ఆ వీడియోలు బయటకు రాకపోయి ఉంటే అసలు కేసు నమోదు చేసేవారా? ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, నిందితులను అరెస్టు చేస్తే ప్రభుత్వ బాధ్యత తీరిపోతుందా? ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను బయటకు తీసుకొచ్చిన మహిళనే ఇప్పుడు పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. వీడియోలు ఎలా వచ్చాయి? ఎందుకు పంపించావు? అంటూ ఆమెను ప్రశ్నించి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించడం అన్యాయం. ఆ వీడియోలు బయటకు రాకపోతే ఈ దారుణం వెలుగులోకి వచ్చేది కాదు.. పోలీసులు కూడా చర్యలు తీసుకునేవారు కాదు. నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, ఘటనను వెలుగులోకి తీసుకొచ్చిన వారిని ఇబ్బంది పెట్టడం ఏమిటి?

- రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే పోలీసులే బలిపశువులు

రాష్ట్రంలో పోలీస్‌స్టేషన్‌లలోనే ఫిర్యాదులను తొక్కిపెట్టే పరిస్థితి ఏర్పడింది. బాధితులు ఫిర్యాదు చేస్తే వెంటనే చట్టప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల ఆదేశాల కోసం ఎదురుచూస్తే చివరకు పోలీసు అధికారులే బలిపశువులు అవుతారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసులు నమోదు చేయకుండా ఉంటే, ఆ తర్వాత ఘటన తీవ్ర రూపం దాల్చినప్పుడు ప్రభుత్వం సంబంధిత పోలీసు అధికారులను సస్పెండ్ చేయడమో, వీఆర్‌కు పంపించడమో చేసి చేతులు దులుపుకుంటోంది. గుంటూరు ఘటనలోనూ అదే జరుగుతోంది. రాజకీయ నాయకుల ఆదేశాలకు కాకుండా పోలీసులు చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలి. స్పష్టమైన ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. లేదంటే చివరకు రాజకీయ నాయకులు తప్పించుకుని పోలీసు అధికారులే ఇబ్బందుల్లో పడతారు.

- సీఎం చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

మహిళలకు అన్యాయం జరిగితే సొంత పార్టీ వారినైనా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనలో ఎమ్మెల్యే గల్లా మాధవిపై చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన వెంటనే స్పందించకుండా రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రి సీరియస్‌ అయ్యారని ప్రచారం చేసుకుంటే సరిపోతుందా? తొలి ఘటన జరిగినప్పుడే పోలీసులు కేసు నమోదు చేయకుండా ఎందుకు ఆపారు? దానికి బాధ్యులెవరో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చివరకు ఒక పోలీసు అధికారిపై చర్య తీసుకుని బాధ్యత తీరిపోయిందని చేతులు దులుపుకోవడం సరికాదు. ఘటన ఇంతటి తీవ్ర రూపం దాల్చడానికి కారణమైన వారిపైనా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మహిళల భద్రత విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది.

- పోలీసు వ్యవస్థ, హోంమంత్రి పూర్తిగా విఫలం

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలీసులు స్వతంత్రంగా, చట్టప్రకారం వ్యవహరించే పరిస్థితి లేకుండా పోయింది. కేసు నమోదు చేయాలన్నా రాజకీయ నాయకుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది.. మహిళల రక్షణలో హోంమంత్రి కూడా పూర్తిగా విఫలమయ్యారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం వల్ల జరిగిన తప్పులకు చివరకు పోలీసు అధికారులను బాధ్యులను చేసి, వారిని సస్పెండ్ చేయడమో, వీఆర్‌కు పంపించడమో చేసి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. గుంటూరులో రెండో దారుణ ఘటన జరగడానికి తొలి ఫిర్యాదుపై పోలీసుల అలసత్వమే కారణం. పోలీసులు అలా వ్యవహరించడానికి ఎమ్మెల్యే గల్లా మాధవి జోక్యమే కారణం. తొలి ఫిర్యాదుపైనే చట్టప్రకారం చర్యలు తీసుకుని ఉంటే రెండో ఘటన జరిగేది కాదు. ఈ ఘటనలో వాస్తవాలు బయటకు వచ్చే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది. 

Back to Top