పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రచారానికి కేంద్రం లెక్కల చెక్‌

రెండేళ్లలో గ్రౌండ్‌ అయినవి పది ప్రాజెక్టులే

రూ.6,962 కోట్ల పెట్టుబడి కూడా అంచనా మాత్రమే

పూర్తయినవి రెండు పరిశ్రమల నిర్మాణాలే

22,167 ఉద్యోగాలు వస్తాయని అంచనా.. ఇప్పటికే ఇచ్చినవి కావు

అమరావతి: రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు భిన్నంగా ఉన్నాయి. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో డీపీఐఐటీ, ఇన్వెస్ట్‌ ఇండియా పర్యవేక్షించిన పెట్టుబడి ప్రతిపాదనల్లో కేవలం పది ప్రాజెక్టులు మాత్రమే గ్రౌండ్‌ అయినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ లోక్‌సభకు తెలిపింది.
వైయస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గ్రౌండ్‌ అయిన పది ప్రాజెక్టుల్లో కేవలం రెండు ప్రాజెక్టుల తయారీ యూనిట్ల నిర్మాణం మాత్రమే పూర్తయిందని, మిగిలిన ఎనిమిది ప్రాజెక్టులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి రూ.6,962 కోట్లుగా అంచనా వేసినట్లు వెల్లడించింది.
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు. ప్రాజెక్టులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఏర్పడవచ్చని అంచనా వేసిన ఉద్యోగాలు మాత్రమే. వాస్తవంగా ఇప్పటివరకు ఎంత పెట్టుబడి వచ్చింది, ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారన్న వివరాలను కేంద్ర సమాధానంలో వెల్లడించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి ప్రతిపాదనలను వాస్తవ పెట్టుబడులుగా, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను ప్రారంభమైన పరిశ్రమలుగా, భవిష్యత్తులో రావచ్చని అంచనా వేసిన ఉద్యోగాలను ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలుగా ప్రచారం చేస్తోందన్న విమర్శలకు కేంద్రం లెక్కలు బలం చేకూరుస్తున్నాయి.

శిక్షణ పొందిన వారే.. పారిశ్రామికవేత్తలు కాదు
ఎంఎస్‌ఎంఈలు, స్థానిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర పథకాల ద్వారా కలిగిన ప్రయోజనాలపై అడిగిన ప్రశ్నకు కేంద్రం నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శిక్షణ కార్యక్రమాల వివరాలను ఇచ్చింది. 2024–25లో 201 కార్యక్రమాల ద్వారా 10,093 మంది, 2025–26లో 625 కార్యక్రమాల ద్వారా 32,428 మంది లబ్ధిపొందినట్లు తెలిపింది.
అయితే వీరిలో ఎంతమంది కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేశారు, ఎంతమందికి ఆర్థిక సహాయం అందింది, ఎన్ని ఎంఎస్‌ఎంఈలు ఉత్పత్తి ప్రారంభించాయి, వాటి ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయన్న వివరాలు మాత్రం సమాధానంలో లేవు. శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరినీ పారిశ్రామికవేత్తలు లేదా ఉద్యోగాలు పొందిన వారిగా చూపించలేమన్న విషయం స్పష్టమవుతోంది.

మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల ప్రచారానికి.. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వాస్తవ లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమవుతోంది. రెండేళ్లలో పూర్తయినవి రెండు పరిశ్రమల నిర్మాణాలు మాత్రమే కాగా, మిగిలిన పెట్టుబడులు, ఉద్యోగాలన్నీ ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే ఉన్నాయని కేంద్ర సమాధానం తేల్చిచెప్పింది.

Back to Top