దస్తావేజు లేఖర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కర్నూలులో వైయ‌స్ఆర్‌సీపీ సంఘీభావం

దస్తావేజు లేఖర్ల జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి: ఎస్వీ మోహన్ రెడ్డి

కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు చేపట్టిన ఆందోళనకు వైయ‌స్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. కర్నూలులో ధర్నా చేస్తున్న దస్తావేజు లేఖర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, న్యాయమైన డిమాండ్ల సాధనకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న దస్తావేజు లేఖర్ల ఉపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చిన్న వృత్తిదారుల జీవనోపాధిని కాపాడాల్సిన ప్రభుత్వం వారి ఉపాధినే ప్రశ్నార్థకం చేసే విధానాలను అమలు చేయడం సరికాదన్నారు.

దస్తావేజు లేఖర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులు, ఉద్యోగులు, చిన్న వృత్తిదారుల జీవనోపాధి విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఎస్వీ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని కోరారు.
 

Back to Top