కృష్ణా జిల్లా: మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నేత కైలే అనిల్ కుమార్ పై కక్షసాధింపు చర్యల్లో భాగంగా పామర్రు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో తనపై చేసిన పోస్టులపై ఫిర్యాదు చేసేందుకు పామర్రు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కైలే అనిల్ కుమార్‌తో ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు. పోలీసుల వైఖరిని ప్రశ్నించినందుకే ఆయనతో పాటు మరో 40 మందిపై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే పేరుతో క్రైమ్ నం. 142/2026 కింద BNS సెక్షన్లు 126(2), 221 చదవవలసిన 190 ప్రకారం కేసు నమోదు చేయడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో విభేదించే స్వరాలను అక్రమ కేసులతో అణచివేయాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌పై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.