ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసనలు 

మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు.. అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు

మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపాటు

తాడేప‌ల్లి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలతో పాటు గుంటూరులో మహిళను వివస్త్రను చేసి వేధించిన ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కేంద్రాల్లో మహిళా నేతలు, కార్యకర్తలు ర్యాలీలు, ధర్నాలు చేపట్టి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పలు ప్రాంతాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి వినతిపత్రాలు సమర్పించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసనల్లో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- విజయవాడలో.. 

ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన నిర్వహించారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్‌రావు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

- గుంటూరులో.. 

గుంటూరు లాడ్జి సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, నియోజకవర్గ సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్‌కుమార్, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- పల్నాడులో.. 

నరసరావుపేటలో పల్నాడు జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కార్యాలయం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి, గీతా హసంతి, సుజాత పాల్, బొబ్బిలి శ్రీలక్ష్మి, మంగమ్మ, హెల్డా ఫ్లోరెన్స్, ద్వారక, పి.లక్ష్మి, తర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

- మచిలీపట్నంలో..

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించి అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించారు. మహిళా విభాగం నేత ఉప్పాల హారిక మాట్లాడుతూ మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, మహిళలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. గుంటూరు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

- తిరుపతిలో.. 

తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. మహిళా నాయకురాళ్లు సాయిలక్ష్మి, విజయలక్ష్మి, కుమారి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మహిళలకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

- అనంతపురంలో.. 

అనంతపురం నగరంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట మహిళలు భారీ ధర్నా నిర్వహించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

- కర్నూలులో.. 

కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు రేణుక, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీ‌దేవి, త‌దిత‌ర మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

- నంద్యాలలో.. 

నంద్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ ఈసాక్ బాషా, మహిళా జోనల్ అధ్యక్షురాలు గాజుల శ్వేతారెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి శశికళరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సుమంత్‌రెడ్డితో పాటు ఏడు నియోజకవర్గాల మహిళా అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు.

- వైఎస్సార్ కడప జిల్లాలో..

గుంటూరులో లంచం డిమాండ్ చేసిన అధికారిపై ఫిర్యాదు చేసిన మహిళపై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు తెలుగుపులి వెంకటసుబ్బమ్మ, కడప నగర మహిళా అధ్యక్షురాలు దీప్తిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యుడు కె.సురేష్‌బాబు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్ బాషా, రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ తదితరులు పాల్గొన్నారు.

- విజయనగరంలో.. 

ప్రభుత్వ సంగీత కళాశాల నుంచి బాలాజీ జంక్షన్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. బొత్స అనుష, మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, మాజీ మేయర్ విజయలక్ష్మి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గదుల సత్యాలత, తూముల అచ్చుతవల్లి, చంద్రవదన, కృష్ణవేణి, బెవరా ఉమాకుమారి, జెడ్పీటీసీలు వలిరెడ్డి శిరీష, రౌతు రాజేశ్వరి, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

- శ్రీకాకుళంలో.. 

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉల్లాల దివ్యభారతి, ముకుళ్ల సుగుణ, గురుగుబెల్లి వెంకట రమణి తదితరులు పాల్గొన్నారు. మహిళలపై దాడులను అరికట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- రాజమహేంద్రవరంలో..

తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండ్ నుంచి శ్యామల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కందుకూరి వీరేశలింగం విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- కాకినాడలో.. 

కాకినాడ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మహిళలపై జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

- భీమవరంలో..

పశ్చిమగోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కోడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ సెంటర్‌లో నిరసన నిర్వహించారు. రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, నరసాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె వెంకటరమణ, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత, పాలవెల్లి మంగ, ఐనుకొండ ధనలక్ష్మి, విజయ శ్యామల, లీలా నాగవల్లి, మండ పద్మావతి, జూపిల్లి సత్యవతి, గొర్రెల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

- ఏలూరులో..

జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్‌ఆర్), ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), దెందులూరు ఇన్‌చార్జ్ కొఠారు అబ్బయ్య చౌదరి, చింతలపూడి ఇన్‌చార్జ్ కంభం విజయరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డితో పాటు ఏడు నియోజకవర్గాలకు చెందిన మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- పార్వతీపురం మన్యంలో..

జిల్లా కేంద్రంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి, జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, ఎంపీపీ బలగ రమణమ్మ, గండి భాగ్యవతి, దాసరి నాగరత్నం, రంగుముద్రి రమాదేవి, కొండపల్లి బాలకృష్ణ, దండి శ్రీనివాసరావు, పాచిపెంట ఎంపీపీ ప్రమీలతో పాటు నాలుగు నియోజకవర్గాలకు చెందిన మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో..

అమలాపురం ఈదరపల్లి వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, హోంమంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడిపూడి సూర్యనారాయణ, మాజీ ఎంపీ చింత అనురాధ, రాజోలు కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరి, పి.గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీను, జున్నూరి రామారావు, పితాని బాలకృష్ణ, కాశి మునికుమారి, వంగా గిరిజ, కొనుకు గౌతమి, మట్టా శైలజ తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top