హంద్రీనీవా పనుల్లో వందల కోట్ల దోపిడీ

మంత్రి పయ్యావుల కేశవ్ కావాలనే నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు

మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

అనంతపురం: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తూ తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించినా, ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవడం వెనుక కారణమేంటని వైయ‌స్ఆర్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. రాయలసీమకు ద్రోహం చేయడమే చంద్రబాబు నైజమా అని నిలదీశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం నిధులన్నింటినీ అమరావతికే మళ్లిస్తూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమ కార్యాచరణ చేపట్టిందని తెలిపారు.

నెల్లూరు సభలో తాను మాట్లాడిన మాటలను టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ సమర్థించలేదని స్పష్టం చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ కావాలనే తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు నాసిరకంగా చేపట్టి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు కేవలం రూ.15 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, 2004 నుంచి 2009 మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.9 వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో కనీస తాగునీటి సమస్యలను కూడా పరిష్కరించలేని అసమర్థత మంత్రి పయ్యావుల కేశవ్‌దని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలోనే పార్టీ మారేందుకు పయ్యావుల కేశవ్ ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. హంద్రీనీవా కాలువలకు లైనింగ్ ఏర్పాటు చేయాలని వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఉత్తర్వులు వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి హక్కులు, పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
 

Back to Top