లాకప్‌డెత్‌ కేసులో సీపీ, డీజీపీ అసలు ముద్దాయిలు

పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టీకరణ

వారిద్దరితో పాటు ఏసీపీ పైనా విచారణ జరిపించాలి

పొన్నవోలు సుధాకర్‌రెడ్డి డిమాండ్‌

కృష్ణలంక పీఎస్‌లో లాకప్‌డెత్‌కు గురైన సాయికృష్ణ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ 
వేసిన పార్టీ జనరల్‌ సెక్రటరీ (లీగల్‌ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, కోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు.

బిఎన్‌ఎస్‌ఎస్‌–233 కింద కోర్టులో ప్రైవేట్‌ క్రిమినల్‌ పిటిషన్‌

నిందితులకు మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష ఖాయం

ఈ కేసులో ఉన్నతాధికారులను కాపాడేందుకే డ్రామాలు

డీజీపీ, సీపీ, ఏసీపీ పాత్రపై విచారణ జరపాలి

ఈ ముగ్గురినీ ఏ1, ఏ2, ఏ3 గా చేర్చాలి 

పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి డిమాండ్‌

లాకప్‌ డెత్‌ కేసులో అడుగడుగునా అధికార దుర్వినియోగం 

హైకోర్టును బురిడీ కొట్టించేందుకు యత్నించిన సీనియర్‌ ఐపీఎస్‌లు

సాయికృష్ణ కుటుంబాన్ని జగన్‌గారి పరామర్శించాకే పోలీసుల్లో కదలిక

గుర్తు చేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ వ్యవహారంలో అసలు నేరస్థులు క్రింది స్థాయి పోలీసులు మాత్రమే కాదని, ఉన్నతాధికారులైన అప్పటి డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, సీపీ రాజశేఖర్‌ బాబు, ఏసీపీ మానసలే ప్రధాన కుట్రదారులని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ (లీగల్‌ వ్యవహారాలు), మాజీ అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకరరెడ్డి స్పష్టం చేశారు. గౌరవ హైకోర్టును సైతం అబద్ధాలతో బురిడీ కొట్టించేందుకు యత్నించిన ఈ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను కేసులో ఏ1, ఏ2, ఏ3లుగా చేర్చాలని డిమాండ్‌ చేస్తూ బిఎన్‌ఎస్‌ఎస్‌ (ఆN ) సెక్షన్‌ 233 కింద విజయవాడ కోర్టులో ఆయన ప్రైవేట్‌ క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.
    అనంతరం కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టారని.. కూటమి పాలనలో జంగిల్‌ రాజ్‌ నడుస్తోందని మండిపడ్డారు. జగన్‌గారు సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే పోలీసు వ్యవస్థలో కదలిక వచ్చిందన్న ఆయన, ఉన్నతాధికారులను కాపాడేందుకు ప్రభుత్వం వేసిన ’సిట్‌’ ఒక కంటితుడుపు చర్య అని కొట్టి పారేశారు. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టి.. బాధ్యులైన ఐపీఎస్‌లకు మూడేళ్ల నుండి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే వరకు వైఎస్సార్‌సీపీ న్యాయపోరాటం ఆపదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే

- మే 6న సాయికృష్ణ నిర్భంధం:
    
మే 5వ తేదీ రాత్రి/6వ తేదీ ఉదయం మార్కాపురంలో సాయికృష్ణను నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ పేరుతో సీపీ రాజశేఖర్‌బాబు పంపిన టాస్క్‌ ఫోర్స్‌ బృందం కస్టడీలోకి తీసుకుని, మే 6 ఉదయం 7 గం.కు విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చింది. మే 28న సాయికృష్ణ తల్లి కనకదుర్గ, తన కొడుకును కృష్ణలంక సీఐ నాగరాజు ఆధ్వర్యంలో చిత్రహింసలు పెడుతున్నారని, అతని ప్రాణాలకు ప్రమాదం ఉందని డీజీపీ, సీపీలకు ఇ–మెయిల్స్‌ పంపారు. అయినా ఆ అధికారులు ఏమాత్రం స్పందించలేదు.

    ‘నా కొడుకును చంపేస్తే చంపేశారు. కనీసం అతని బూడిదైనా ఇవ్వండి‘ అని ఆ తల్లి ఆవేదనతో అడిగినా కనీసం స్పందించ లేదు సరి కదా... సీఐ నాగరాజు ‘నీ కొడుకుని చంపేస్తున్నాం. పూలమాల వేసుకోవడానికి రెడీగా ఉండు‘ అని బెదిరించారు. 

- హైకోర్టుకు అబద్ధాలు చెప్పి బురిడీ కొట్టించే ప్రయత్నం:
    
జూన్‌ 15న గౌరవ హైకోర్టు విచారణలో డీజీపీ, సీపీల తరఫున ప్రభుత్వ అడ్వకేట్‌ వాదిస్తూ ‘సాయికృష్ణ ఎవరో మాకు తెలియదు, అతడు మా కస్టడీలో లేడు, అతని కోసం ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాం‘ అని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు. కానీ, జూన్‌ 29న సీఐ నాగరాజును రిమాండ్‌ చేస్తూ రాసిన నివేదికలో మాత్రం.. ‘మే 6న సాయికృష్ణను తామే పట్టుకొచ్చి స్టేషన్‌లో అప్పగించాం‘ అని పోలీసులే అధికారికంగా నమోదు చేశారు. అలా తమ సొంత రికార్డులే ఉన్నతాధికారుల అబద్ధాలను, క్రిమినల్‌ కుట్రను బయటపెట్టాయి. 

- బిఎన్‌ఎస్‌ఎస్‌–233 కింద కేసు:
    
పోలీస్‌ అధికారులు ఎంతటి బలవంతులైనా చట్టం అంత కంటే బలంగా ఉంటుంది. చట్టం అందరి కంటే ఉన్నతమైనది అనే సూత్రం ప్రకారం ఎవరూ తప్పించుకోలేరు. ఈ ఘటనలో డీజీపీ, సీపీ, ఏసీపీలు తమ డైలీ స్టేటస్‌ రిపోర్ట్‌  ద్వారా అన్నీ తెలుసుకుంటూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా సీఐ నాగరాజుకు సహకరించారు. అందుకే వారిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 61 (కుట్ర), 49 (అబెట్‌మెంట్‌), 127 (అక్రమ నిర్బంధం), 198, 238, 335 ల కింద ప్రైవేట్‌ కంప్లైంట్‌ దాఖలు చేశాం. తప్పు చేసిన పోలీసులే విచారణ జరిపి క్లీన్‌ షీట్‌ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే సీబీఐ విచారణే శరణ్యం. 

- విచారణ జరుగుతున్నా ప్రైవేట్‌ కంప్లైంట్‌ ఇవ్వొచ్చు:

    ఒకవైపు పోలీసుల విచారణ ప్రాగ్రెస్‌ లో ఉన్నప్పుడు కూడా ప్రైవేట్‌ కంప్లైంట్‌ ఇవ్వొచ్చు. బిఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 233 ప్రకారం ఇన్వెస్టిగేషన్‌ జరుగుతున్నప్పుడు కూడా ప్రైవేట్‌ కంప్లైంట్‌ వేసే పూర్తి అర్హత ఉంది. ఈ కంప్లైంట్‌ను కోర్టు స్టే చేసి, విచారణ జరుపుతున్న ’సిట్‌’ కు నోటీసు పంపుతుంది. డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, సీపీ రాజశేఖర్‌బాబు, ఏసీపీ మానసను.. ఛార్జ్‌షీట్‌లో ముద్దాయిలుగా చేర్చారా? లేదా? అని కోర్టు ప్రశ్నిస్తుంది. వాళ్లు చేయలేదు అని రిపోర్ట్‌ ఇస్తే, కోర్టు ఈ ప్రైవేట్‌ కంప్లైంట్‌ను తీసుకుని, రెండు కేసులను జాయిన్‌ చేసి విచారిస్తుంది. ఎంతటి ఉన్నతాధికారులైనా చట్టం ముందు తప్పించుకునే ప్రసక్తే లేదు.
 
- 197 సెక్షన్‌ కింద ముద్దాయిలు దాక్కోలేరు:

    పోలీస్‌ అధికారులకు సెక్షన్‌ 197 రక్షణగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. హత్యలు, అక్రమ నిర్బంధాలు, క్రిమినల్‌ కుట్రలు చేయడం లాంటి ఘోర నేరాలు చేసినప్పుడు ఆ సెక్షన్‌ అధికారులకు షీల్డ్‌లా ఉపయోగపడదు. మొదటి నుంచీ సాయికృష్ణను చంపాలనే కుట్రతోనే తీసుకొచ్చారు. అతనిపై కేవలం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ మాత్రమే పెండింగ్‌లో ఉంది. విచారించడానికి కొత్త అఫెన్స్‌ ఏమీ లేదు. మే 6న ఉదయం కృష్ణలంక పీఎస్‌కు తీసుకొచ్చిన పోలీసులు, ఆ మర్నాడు 7వ తేదీన కోర్టులో ప్రొడ్యూస్‌ చేయకుండా స్టేషన్‌లోనే ఉంచి ఎందుకు చిత్రహింసలు పెట్టారో సమాధానం చెప్పాలి.

- ఇది సమాజంపై జరిగిన నేరం:
    
ఇది కేవలం ఒక తల్లి, లేదా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత నేరం కాదు. ఇది ఈ సమాజంపై జరిగిన ఘోరమైన దాడి. ఆక్రందనతో వెళ్ళిపోయిన ఆ వ్యక్తి ఆత్మ శాంతించాలంటే ఈ ’బిగ్‌ ఫిష్‌’లను, అసలు కుట్రదారులను శిక్షించాల్సిందే. ’లుకార్డ్‌’ అనే క్రిమినాలజిస్ట్‌ చెప్పినట్లు ఎంత పర్‌ఫెక్ట్‌గా నేరం చేసినా ఆనవాళ్లు మిగిలే ఉంటాయి. ఆ ఆధారాలనే మేము పట్టుకున్నాం. మ్యారథాన్‌ రన్‌లో మేము వేసిన ఈ మొదటి అడుగు చాలా పెద్దది. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.

- జగన్‌గారు కదిలాకే పోలీసుల్లో చలనం:

    జూలై 18న మా పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్, సాయికృష్ణ ఇంటికి వెళ్లి, న్యాయం చేస్తామని భరోసా ఇచ్చేంత వరకు ఈ కేసులో పోలీసుల వద్ద ఒక్క  అంగుళం కూడా కదలిక లేదు. జగన్‌గారు కనుక అండగా నిలబడకపోయి ఉంటే ఈ కేసును 10 అడుగుల లోతున పాతిపెట్టేవారు. ఆయన మాట ఇచ్చిన తర్వాతే 19వ తేదీన పోలీసు వ్యవస్థలో చలనం వచ్చింది. అధికారులను కాపాడేందుకు ప్రభుత్వం వేసిన ’సిట్‌’ ఒక కంటితుడుపు చర్య మాత్రమే. మొత్తం నిజాలు బయటపడాలంటే సీబీఐ విచారణే ఏకైక మార్గం.

- బాధితులపై ఒత్తిడి. ప్రలోభాలకు గురి చేస్తున్నారు:

    హైకోర్టులో దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్, అడిషనల్‌ అఫిడవిట్లను బాధితులను వివిధ మార్గాల ద్వారా విత్‌ డ్రా చేయించారు. అందుకే మా పార్టీ ఎంపీ ఎం.గురుమూర్తి చొరవతో సామాజిక బాధ్యతగా ఈరోజు ప్రైవేట్‌ కంప్లైంట్‌ దాఖలు చేశాం. కోర్టులో గంటన్నర పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. హైకోర్టులో కూడా ఇన్వెస్టిగేషన్‌ ట్రాన్స్‌ఫర్‌ పై విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఎంతటి ఉన్నతాధికారులు ఉన్నా వదిలి పెట్టేది లేదని, చివరి వరకు పోరాడతామని పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top