తాడిపత్రి వెళ్లాలంటే వీసా కావాలా?

వైయ‌స్ఆర్‌సీపీ అనంత‌పురం జిల్లా అధ్య‌క్షుడు అనంత వెంకటరామిరెడ్డి

అనంత‌పురం: తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక నియోజకవర్గానికి వెళ్లాలంటే వీసా కావాలా అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. పోలీసులు చట్టం ప్రకారం కాకుండా టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురం పోలీసులకు హైకోర్టు ఆదేశాల కంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలే ముఖ్యమా అని ప్రశ్నించారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులకు పోలీసులు బాధ్యత వహించాలని పేర్కొన్న ఆయన, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసా రాజకీయాలను ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.

Back to Top