రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి మాయం?.. 

అవిలాల భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే నానిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సంచలన ఆరోపణలు

 తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అవిలాల గ్రామంలో రూ.100 కోట్లకు పైగా విలువైన 3.17 ఎకరాల భూమిని ఎమ్మెల్యే నాని తన అనుచరుల పేరిట కబ్జా చేయించారని వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. వివాదాస్పద భూమిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, 1954 నుంచి ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలాన్ని పట్టా భూమిగా మార్చేశారని ఆరోపించారు. ఈ భూమికి జీపీఏలు, అనుమతులు ఎలా మంజూరయ్యాయో సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపిస్తే అన్ని నిజాలు బయటపడతాయని అన్నారు. వృద్ధ దంపతులకు చెందిన భూమి వ్యవహారాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరును చూస్తే ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. అవిలాల భూమి ఆర్చి కాలువ పొరంబోకు పరిధిలో ఉన్నప్పటికీ టుడా అనుమతులు ఎలా ఇచ్చిందనే ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి
చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ భూముల రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సూచించారు. వివాదాస్పద భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రజాపోరాటం కొనసాగిస్తామని, భూకబ్జాలపై రాజీలేని పోరాటం చేస్తామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top