నెల్లూరు జిల్లా: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన "చలో సోమశిల" కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, రైతులు, ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆయన సోమశిల ప్రాజెక్టను పరిశీలించారు. చలో సోమశిల సందర్శనకు పోలీసులు అడుగడుగునా ఆటంకం కలిగించారు. సోమశిల ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో గేట్లు ఎక్కి మరీ లోపలికి ప్రవేశించారు. నెల్లూరు నుండి సోమశిలకు సుమారు 200 కార్లతో, కలువాయి జాతీయ రహదారి నుండి 300 బైకులతో పార్టీ నాయకులు భారీ ర్యాలీగా నిర్వహించారు. పోలీసుల తీరుపై, కూటమి ప్రభుత్వం ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం భారీ తరలిరావడంతో, పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా, రైతులతో కలిసి సోమశిల ప్రాజెక్టును సందర్శించారు. సోమశిల ప్రాజెక్టు సందర్శన అనంతరం బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి వైయస్సార్సీపీ నాయకులు మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరే జిల్లా పొందనంత లబ్ధి నెల్లూరు జిల్లా రైతాంగం పొందుతారని జిల్లా వైయస్ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. ఎగువన రాయలసీమ అవసరాలు తీరిన తర్వాత మిగిలే వరద నీరు, శ్రీశైలం నుండి ఎస్కేప్ వెంట్ ద్వారా వచ్చే 11 వేల క్యూసెక్కుల నీరే సోమశిల జలాశయానికి జీవనాడి అని పేర్కొన్నారు. అలాంటి జీవనాడి లాంటి ప్రాజెక్టును చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి తాకట్టుపెట్టాడని దుయ్యబట్టారు. 'చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిలిపివేయించాను' అని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతుంటే చంద్రబాబు నోరు మెదపకపోవడం ముమ్మాటికీ రైతాంగానికి చేసిన ద్రోహమేనని మండిపడ్డారు. భవిష్యత్తులో సోమశిలలో నీటి నిల్వలు అట్టడుగుకు పడిపోయినప్పుడు, ఈ ఎత్తిపోతల పథకం అందుబాటులో ఉంటేనే ఆఖరి తడి కింద చిట్టచివరి ఎకరా భూమిని కూడా తడిపి పంటను కాపాడుకోవచ్చని వివరించారు. అందుకే పోలీసులు లాఠీలు వాడినా, అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధించే వరకు రైతుల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే.. సోమశిలకు నీరు వచ్చిందంటే వైయస్సార్ పుణ్యమే - కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లా పొందనంత అత్యధిక లబ్ధి పొందేది కేవలం నెల్లూరు జిల్లా రైతాంగం మాత్రమే. గతంలో భవనం వెంకట్రామ్, అంజయ్య గారి హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పనులకు నాంది పలికితే, ఆ తర్వాత తెలుగుదేశం హయాంలో కేవలం 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మాత్రమే నీటిని తీసుకురాగలిగారు. ఆ నీరు తెలుగుగంగ మరియు శ్రీశైలం రైట్ మెయిన్ కాలువకే సరిపోయేది. కానీ మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడు వరద నీటి కాలువ సామర్థ్యాన్ని ఏకంగా 44,000 క్యూసెక్కులకు పెంచి, నేరుగా నిప్పుల వాగు ద్వారా సోమశిలకు వరద నీరు వేగంగా వచ్చేలా చేశారు. సోమశిల, కండలేరు వైయస్సార్ ఘనత నెల్లూరు జిల్లాకు పెన్నా నది ఉన్నప్పటికీ, ఎక్కడికక్కడ ఎగువన ప్రాజెక్టులు నిర్మించడంతో సహజంగా నీరు వచ్చే అవకాశం తగ్గింది. శ్రీశైలం జలాశయం నుండి వచ్చే వరద నీరే మన జిల్లాకు ప్రధాన వనరు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలుగుగంగ ద్వారా వచ్చే నీటిలో 15 టీఎంసీలను చెన్నై తాగునీటి అవసరాలకు కండలేరు, పూండి రిజర్వాయర్ల ద్వారా తరలించాల్సి ఉంది. ఎగువన ఉన్న రాయలసీమ ప్రాంత ఆయకట్టు అవసరాలు తీరిన తర్వాత మిగిలిన నీరు నెల్లూరుకి వస్తుంది. కుందు నదికి పెద్ద పరివాహక ప్రాంతం లేనందున, శ్రీశైలం నుండి ఎస్కేప్ వెంట్ ద్వారా వచ్చే 11 వేల క్యూసెక్కుల వరద నీరే సోమశిల జలాశయానికి ముఖ్యం. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వరకు సోమశిల జలాశయంలో ఏనాడూ 36 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని నిల్వ చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు తామేదో సాగునీటి రంగాన్ని ఉద్ధరించామని మైకులు విరగ్గొట్టి మాట్లాడుతుంటాడు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లాలోని ముంపు గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి, ఇళ్లు కట్టించి, నష్టపరిహారం చెల్లించి, సోమశిల చరిత్రలోనే మొదటిసారిగా 72 టీఎంసీల నీటిని నిల్వ చేసి నెల్లూరు జిల్లా ఆయకట్టుకు శాశ్వత సాగునీటి భద్రత కల్పించారు. అలాగే కండలేరు కాలువ ద్వారా నీటిని తరలించి, దాని పూర్తి సామర్థ్యం 68 టీఎంసీలు కాగా, అందులో 63 టీఎంసీల నీటిని నిల్వ చేసిన ఘనత దివంగత వైఎస్సార్ గారిదే. కర్నాటక, తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా... ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి బడ్జెట్లో నిధులు కేటాయించి భూసేకరణ కూడా ప్రారంభించింది. రేపు ఆల్మట్టి ఎత్తు పెంచితే శ్రీశైలం జలాశయ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అదే జరిగితే సోమశిల, కండలేరు నమ్ముకున్న నెల్లూరు జిల్లా రైతాంగం వ్యవసాయాన్ని పూర్తిగా మర్చిపోవాల్సి వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే పొరుగు రాష్ట్రాలు ఏపీ ప్రయోజనాలను అస్సలు లెక్కచేయవు. ఎందుకంటే చంద్రబాబుకు రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఆయనకు కేవలం ఓట్లు దండుకోవడం, అధికారంలోకి రావడంపైనే శ్రద్ధ. తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి, దిండి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రోజుకు 8 టీఎంసీల నీటిని తోడేస్తూ, 841 అడుగుల అట్టడుగు స్థాయికి నీటి మట్టాన్ని పడిపోయేలా చేస్తోంది. ఆ స్థాయికి నీరు పడిపోతే పోతిరెడ్డిపాడు ద్వారా మనకు ఒక్క చుక్క నీరు కూడా రాదు. ఇటువంటి భయంకరమైన పరిస్థితి నుండి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులను కాపాడటానికి వైయస్ జగన్ గారు రూ. 3,500 కోట్లతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించి 90% పనులు పూర్తి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా 'నేను చంద్రబాబుతో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని, ఒప్పించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయించాను' అని ప్రగల్భాలు పలుకుతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతుల సాకుతో ప్రాజెక్టును ఆపేశామని కూటమి నాయకులు అబద్ధాలు చెప్తున్నారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు ఏ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులిచ్చిందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. చేతనైతే మమ్మల్ని ఎన్‌కౌంటర్ చేసుకోండి 'చలో సోమశిల' కార్యక్రమానికి వస్తున్న మమ్మల్ని, రైతు సోదరులను నిర్బంధించడానికి జిల్లాలోని పోలీసులందరినీ ఇక్కడ మోహరించారు. జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించినా, లాకప్ డెత్‌లు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు, వైయస్సార్సీపీ కార్యక్రమాలపై డ్రోన్లు వేసి నిఘా పెడుతున్నారు. మేము పోలీసుల అక్రమ కేసులకు, అరెస్టులకు, జైళ్లకు భయపడటం లేదు. కూటమి ప్రభుత్వానికి చేతనైతే మమ్మల్ని ఎన్‌కౌంటర్ చేయమనండి, దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గతంలో కండలేరు ప్రాజెక్ట్ వద్ద కూడా మమ్మల్ని పోలీసులు వర్షంలో గంటల తరబడి కూర్చోబెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం నేతలు వచ్చి మమ్మల్ని తిట్టిపోశారు. హామీలను అమలు చేయలేక సిగ్గుతో కూటమి నాయకులు ప్రాజెక్టుల్లో దూకాలి కానీ, గర్వంగా ప్రజల్లోకి వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ నేతలు కాదు. గతంలో వైయస్సార్, జగన్ గారు నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజీలను రికార్డు సమయంలో పూర్తి చేసి జిల్లా సాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బ్యారేజీలకు ఉన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి పేర్లను తొలగించడం తప్ప ఒక్కటంటే ఒక్క చిన్న పని కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో సోమశిలకు వచ్చి ఒకే సీజన్ లో మరమ్మతు పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికి నాలుగు సీజన్లు గడిచినా ఉన్న బ్రేకర్లను కూడా తొలగించి పనులను పూర్తిగా గాలికొదిలేశారు. రైతులకు సాగునీటి భద్రత లభించాలన్నా, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు సకాలంలో అందాలన్నా మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఏ రోజు ఎన్నికలు వచ్చినా నెల్లూరు జిల్లా రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. సోమశిల పరిరక్షణ మరియు రైతుల హక్కుల కోసం వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై మోసం - మేకపాటి విక్రమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా, రాయలసీమ, ముఖ్యంగా ఆత్మకూరు, మరిపాడు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాల ప్రజలందరికీ రాబోయే రోజుల్లో సాగునీరు, తాగునీరు దక్కే అవకాశం కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్లే సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతను గుర్తించి వైఎస్ జగన్ గారు పనులను ప్రారంభించి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రూ. 3వేల కోట్లు ఖర్చు పెట్టి పనులను ఒక కొలిక్కి తీసుకొచ్చారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టేశాడు. చంద్రబాబు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ముందుకు సాగనివ్వకుండా నిలిపివేస్తామని తనకు మాట ఇచ్చారని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దీనితో కూటమి ప్రభుత్వం నెల్లూరు, రాయలసీమ రైతాంగానికి చేసిన ద్రోహం స్పష్టమైంది. రాబోయే రోజుల్లో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన నెల్లూరు జిల్లాకు గుండెకాయ లాంటి పెన్నా నదిని, దానిని నియంత్రించే సోమశిల డ్యామ్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. శ్రీశైలం జలాశయం నుండి వరద నీటిని ఎత్తిపోసే ఇటువంటి ముందస్తు ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్ట్‌ను కూటమి ప్రభుత్వం గాలికొదిలేయడం ఈ ప్రాంత రైతాంగానికి చేస్తున్న తీవ్ర అన్యాయం. నెల్లూరు జిల్లా ప్రజలు ఈ ఎన్నికల్లో కూటమికి పదికి పది సీట్లు కట్టబెడితే, వారు జిల్లాకు చేస్తున్న న్యాయం ఇదేనా? ఈ ద్రోహంపై మనం ప్రశ్నిస్తే మీడియాని బ్యాన్ చేయడం, సోషల్ మీడియా ప్రతినిధులను అక్రమంగా అరెస్ట్ చేయడం, సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. గత రెండు నెలలుగా వైఎస్సార్‌సీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని అక్రమంగా నిలిపివేస్తే మేము కోర్టును ఆశ్రయించాం. ప్రజల గొంతు నొక్కాలని, లోపల జరుగుతున్న అవినీతి మరియు అక్రమాలు బయటకు రాకూడదని ఈ ప్రభుత్వం పనికట్టుకొని ప్రయత్నిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతలతో నెల్లూరు సస్యశ్యామలం - రాంరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మద్దతుగా సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు, రైతు సోదరులు విజయవంతం చేశారు. సోమశిల జలాశయానికి నీరు సమృద్ధిగా రావాలంటే ఈ ఎత్తిపోతల పథకం పూర్తి కావడం ఎంతో ముఖ్యం. సోమశిల ప్రాజెక్టు ద్వారా నెల్లూరు జిల్లాలో లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఇటువంటి ప్రాజెక్టుకు నీరు రాకుండా అడ్డుకుంటే రాబోయే రోజుల్లో పంటలు పండక రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. సోమశిల డ్యామ్ నిండితే కావలి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం సంగం బ్యారేజ్ ద్వారా 12 టీఎంసీల సాగునీరు అందుతుంది. కాలువల ద్వారా ఈ నీరు కావలి నియోజకవర్గం చిట్టచివరి భూముల వరకు వెళుతుంది. గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలి, ఉదయగిరి ప్రాంతాల రైతు ప్రయోజనాల కోసం 'సంగం బైపాస్ కెనాల్' ప్రాధాన్యతను మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఈ బైపాస్ కెనాల్ పనులు పూర్తయితే కావలి ప్రాంతంతో పాటు ఉదయగిరిలోని జలదంకి మండలం కూడా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది. ఇదంతా సాధ్యం కావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కావడం అత్యంత ఆవశ్యకం. మన నీటి వాటాను మనం సాధించుకునే వరకు రైతులందరినీ ఏకం చేసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. స్వార్థ రాజకీయాల కోసం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు - ఆనం విజయ్‌కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ సమన్వయకర్త సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జిల్లా రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున రైతు సోదరులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ ఎత్తిపోతల పథకంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చట్టబద్ధమైన భాగస్వామ్యం ఉంది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో రహస్య మంతనాలు జరిపి, ఈ ప్రాజెక్ట్ పనులను ముందుకు సాగనివ్వకుండా నిలిపివేశారు. మన నీటి హక్కులను, కూటమి ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనల వల్ల కోల్పోయే పరిస్థితి వచ్చింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమశిల జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కంటే దిగువకు పడిపోయిన దుస్థితిని జిల్లా రైతులు కళ్లారా చూశారు. ప్రకృతిని ఎవరూ శాసించలేరు. కూటమి ప్రభుత్వ మంత్రులు ఇప్పుడు రెండు పంటలకు నీళ్లిస్తున్నామని, నీటి కొరత లేదని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో వర్షాలు లేక సోమశిలలో నీటి మట్టం అట్టడుగుకు పడిపోయినప్పుడు, ఈ ఎత్తిపోతల పథకం అందుబాటులో ఉంటేనే ఆఖరి తడి కింద చిట్టచివరి ఎకరా భూమికి కూడా నీరందించి పంటలను కాపాడుకోవచ్చు. ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం నిర్వీర్యం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలను రైతులందరూ పార్టీలకతీతంగా ముక్తకంఠంతో నిరసించాలి. మనకు రావాల్సిన సాగునీటి వాటాను, భాగస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదు. పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు - కిలివేటి సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో కావాలనే జాప్యం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రితో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని ప్రాజెక్టును నిలిపివేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా మేము నిరంతర పోరాటాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. నెల్లూరు జిల్లాలోని సాగునీటి వ్యవస్థ అంతా సోమశిల జలాశయంపైనే ఆధారపడి ఉంది. సోమశిల సమృద్ధిగా నిండితేనే కండలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు విడుదల చేయడానికి వీలవుతుంది. సోమశిల నిండనిదే సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల పరిధిలోని మెట్ట ప్రాంతాలకు, అలాగే శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడం సాధ్యం కాదు. కూటమి ప్రభుత్వం తెలుగుగంగ ప్రాజెక్ట్ ద్వారా తమిళనాడుకు నీళ్లు ఇవ్వడానికి చూపిస్తున్న ఉత్సాహం, మన జిల్లా రైతులకు నీరివ్వడంలో చూపించడం లేదు. ఈ జిల్లాలో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో సాగునీటి హక్కుల సాధనకై మేము అన్ని రకాల పోరాటాలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, అక్రమ కేసులు పెట్టినా వైయస్సార్సీపీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి ఈ ప్రాజెక్ట్ సాధన కోసం పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే కూలదోయడం ఖాయం - నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గ్రేటర్ రాయలసీమ పరిధితో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగానికి సాగునీటి విషయంలో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంటే చూడలేక వైయస్ జగన్ గారి ఆదేశాలతో 'చలో సోమశిల' కార్యక్రమానికి సిద్ధమయ్యాం. గతంలో మేము సోమశిల సందర్శనకు ప్రయత్నిస్తే పోలీసులు మమ్మల్ని ఇళ్లలోనే అక్రమంగా గృహనిర్బంధం చేశారు. ఆ తర్వాత కండలేరు ప్రాజెక్ట్ వద్దకు వెళితే కేవలం గేట్ వరకే అనుమతించి ఆంక్షలు విధించారు. చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయి. వారికి వ్యతిరేకంగా రైతన్నలకు అండగా నిలబడటానికే వైయస్సార్సీపీ ఈ పోరాట బాట పట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2027లోనే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు రావడం ఖాయం. ప్రజలు కూడా ఆ ఎన్నికల కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలే కూలదోయడం ఖాయం. కొడుకు భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టాడు - పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీలను ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వాటిని రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత దక్కించుకున్నారు. వైయస్సార్ తెచ్చిన జలయజ్ఞం, జగన్ గారు పూర్తి చేసిన ప్రాజెక్టుల వల్లే ఈరోజు రైతు ధైర్యంగా సమాజంలో ఒక విలువ, గౌరవంతో బ్రతకగలుగుతున్నాడు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సోమశిల ప్రాజెక్టుకు వచ్చి రకరకాల హామీలు ఇచ్చి అటు వెళ్లగానే మర్చిపోయారు. ఈ రోజుటికి అక్కడ ఒక్క చిన్న పని కూడా చేయలేదు. పైగా జగన్ గారు పూర్తి చేసిన సంగం బ్యారేజ్‌కు 'మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్' అని పేరు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి పేరు మీద జగన్ గారు పూర్తి చేసి ప్రారంభించిన బ్యారేజ్ పేరును కూడా ఎత్తేసిన దుర్మార్గపు పరిస్థితి. రాయలసీమ ఎత్తిపోతల పథకం గనుక పూర్తయితే, దాని ద్వారా వచ్చే అదనపు జలాలను, నికర జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కడప, కర్నూలు, అనంతపురంతో పాటు మన నెల్లూరు జిల్లాకు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అటువంటి అద్భుతమైన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే.. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న రహస్య ఒప్పందం వల్ల ఆ ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం, తన మనుగడ కోసం, తన బిడ్డ భవిష్యత్తు కోసం దేన్నైనా, ఎవరినైనా తాకట్టు పెడతారనే విషయం స్పష్టమైంది. భవిష్యత్తులో సోమశిలలో నీటి నిల్వలు అట్టడుగుకు పడిపోయినప్పుడు, ఈ ఎత్తిపోతల పథకం అందుబాటులో ఉంటే ఆఖరి తడి కింద చిట్టచివరి ఎకరా భూమిని కూడా తడిపి పంటను కాపాడుకోవచ్చు. అటువంటి ప్రాజెక్టును స్వార్థ రాజకీయాల కోసం ఆపించి, మన కడుపు కొట్టిన చంద్రబాబు నాయుడు గారికి రైతులే సరైన బుద్ధి చెప్పాలి.