ఎరువులు దొరకవు.. రైతు గోడు వినరు.. 

కూటమి పాలనలో  సంక్షోభంలోకి వ్యవసాయం 

 వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీయస్ నాగిరెడ్డి ధ్వ‌జం

తాడేపల్లి : రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్) ఎంవీయస్ నాగిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం సులభంగా దొరుకుతోందని, కానీ రైతులకు అత్యవసరమైన ఎరువులు మాత్రం అందుబాటులో లేవని విమర్శించారు.  రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, రైతులు అవసరమైన సమయంలో ఎరువుల కోసం అల్లాడుతున్నారని ఆయన తెలిపారు. యాప్‌లు, డిజిటల్ చెల్లింపుల పేరుతో కొత్త నిబంధనలు తీసుకువచ్చి రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ విధానాలు రైతులకు శాపంగా మారాయని అన్నారు.
సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఫాస్పేట్, రసాయనిక ఎరువుల లభ్యతను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల్లో సేంద్రీయ సాగు జరుగుతోందని ప్రభుత్వం చెబుతుంటే, రసాయనిక ఎరువుల డిమాండ్ ఎందుకు తగ్గలేదని ప్రశ్నించారు. సేంద్రీయ సాగు రైతులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని, అలాంటి పంటలను అన్నా క్యాంటీన్లు, మధ్యాహ్న భోజన పథకాలలో వినియోగించేందుకు కూడా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పొగాకు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ధరలు కూడా అమలు కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ పొగాకు కొనుగోలు సంస్థలు, ఆక్వా ఫీడ్ కంపెనీలు పట్టించుకోవడం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని నాగిరెడ్డి ఆరోపించారు. గత ఏడాది కేంద్రం ప్రకటించిన ధరకు కూడా కొనుగోళ్లు జరగలేదని, ఈ ఏడాది కనీస మద్దతు ధర ప్రకటించకుండానే కిలోకు రూ.4 మాత్రమే ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. రైతులకు గిట్టుబాటు కావాలంటే కనీసం కిలోకు రూ.12 చెల్లించాలని డిమాండ్ చేశారు.

మామిడి రైతులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.360 కోట్లు కేటాయించాలని కోరారు. జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయాన్ని రైతులు మానేయాలనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన నాగిరెడ్డి, వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్ హయాంలో రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా యాప్‌ల నిబంధనలు తొలగించి, ఎరువుల కొరతను వెంటనే తీర్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 

Back to Top