అరకులోయ: గిరిజన ప్రాంత యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా అరుకు క్రీడా మైదానం ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు అరుకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ తనూజ రాణి తెలిపారు. అరుకులోయ నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక క్రీడా మైదానం అభివృద్ధి కోసం రూ.30 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.30 లక్షలు మంజూరు కావడంతో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, క్రీడా ప్రాంగణం ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీకి అధికారులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ గుమ్మ తనూజ రాణి మాట్లాడుతూ, క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి, వ్యక్తిత్వ వికాసానికి కూడా దోహదపడతాయని అన్నారు. క్రీడాకారులు శారీరక, మానసిక, వ్యూహాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యం అంటే కేవలం ఆట ఆడటం మాత్రమే కాదని, క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నైతిక విలువలు, పరస్పర గౌరవం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. అరుకు ప్రాంతంలో ఇంతటి విశాలమైన క్రీడా మైదానం ఉండటం స్థానిక యువత అదృష్టమని, ఆధునిక సదుపాయాలతో దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు పెరుగుతాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ క్రీడాకారులకు స్పోర్ట్స్ యూనిఫామ్ టీ-షర్టులను ఎంపీ తనూజ రాణి అందజేశారు. అలాగే స్థానిక వైయస్ఆర్‌సీపీ నాయకుడు ఎల్.బి. కిరణ్ కుమార్ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, సీనియర్ క్రీడాకారులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భర్త చెట్టి వినయ్, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, సీనియర్ క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.