నెల్లూరు: రాష్ట్ర అభివృద్ధికి పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అత్యంత కీలకమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అనేక ప్రజాపోరాటాల ఫలితంగా రామయ్యపట్నం పోర్టు ఏర్పాటైందని, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో పోర్టుల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో రామయ్యపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. రామయ్యపట్నం పోర్టు నిర్మాణంలో దాదాపు 60 శాతం పనులు వైయస్ జగన్ ప్రభుత్వమే పూర్తి చేసిందని తెలిపారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం రామయ్యపట్నం పోర్టును ప్రైవేటుపరం చేయడానికి కుట్ర పన్నుతోందని కాకాణి ఆరోపించారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మత్స్యకారుల భవిష్యత్తుకు కీలకమైన జువ్వలదిన్నె హార్బర్‌ను ఇప్పటికే నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు రామయ్యపట్నం పోర్టుపై కూడా అదే విధమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేవలం వైయస్ జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు. స్వలాభం కోసం ఆలోచిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శించిన కాకాణి, ప్రజలు ఈ విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మెడికల్ కాలేజీల నుంచి పోర్టుల వరకు రాష్ట్ర ఆస్తులన్నింటినీ ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లడం దారుణమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన ప్రైవేటీకరణ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.