ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుంది

మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య

క‌ళ్యాణదుర్గం:  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య స్ప‌ష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తాడిపత్రిలో జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర, జిల్లా పార్టీ పిలుపు మేరకు తాడిపత్రికి వెళ్లేందుకు కళ్యాణదుర్గంలో పార్టీ శ్రేణులను భారీగా సమీకరించినట్లు తలారి రంగయ్య తెలిపారు. తాడిపత్రికి బయలుదేరేందుకు సిద్ధమైన సమయంలో తెల్లవారుజాము నుంచే పోలీసులు మఫ్టీలో వచ్చి పార్టీ కార్యాలయాన్ని చుట్టుముట్టారని ఆయన ఆరోపించారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భావించి ముందుకు వెళ్లలేకపోయామని చెప్పారు. పోలీసుల ఆంక్షల కారణంగా తాడిపత్రికి చేరుకునే పరిస్థితి లేకపోవడంతో పార్టీ కార్యాలయం నుంచే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కూడా హరించడం బాధాకరమని అన్నారు.

తాడిపత్రిలో పోలీసుల సమక్షంలోనే కత్తులతో దాడులు జరుగుతున్నాయని, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై వరుస దాడులు జరిగినప్పటికీ సమర్థవంతమైన పోలీసింగ్ కనిపించడం లేదని విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.  ఇటువంటి దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఆయన, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్టీ ఎప్పుడు పిలుపునిచ్చినా కార్యకర్తలను సిద్ధం చేసి ప్రజా సమస్యలపై ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని డాక్టర్ తలారి రంగయ్య పేర్కొన్నారు.

 

Back to Top