ఆనందపురం : భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండల వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం మండల బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏ) సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు బంక సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), ఆయన కుమార్తె సిరమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ఓటర్ల జాబితా పరిశీలన, కొత్త ఓట్ల నమోదు, మార్పులు-చేర్పుల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సిరమ్మ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి ఏజెంట్లు చేస్తున్న కృషిని అభినందించిన ఆమె, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని బూత్ స్థాయి ఏజెంట్లందరికీ గుర్తింపు కార్డులను మజ్జి శ్రీనివాసరావు, సిరమ్మ అందజేశారు. ఈ సమావేశంలో ఆనందపురం మండలం జెడ్పీటీసీ కోరాడ వెంకట్రావు, ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, సామాజిక మాధ్యమ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.