తాడేపల్లి : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తోందని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతు సంక్షేమం పేరుతో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోందని ఆరోపించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచనను మొదటిసారిగా అమలు చేసిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని గుర్తుచేశారు. రైతు భరోసా పథకం ద్వారా 53.58 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో రూ.34,288 కోట్ల సాయం అందించారని తెలిపారు. కౌలు రైతులకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అందించిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేంద్ర పథకాలతో సంబంధం లేకుండా రైతుకు సంవత్సరానికి రూ.20 వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చి, ఆచరణలో మాత్రం రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. మొదటి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, రెండో ఏడాదిలోనూ లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించారని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ పథకంలో కూడా గందరగోళం సృష్టిస్తూ, ప్రకటనల్లో ఒక లెక్కలు చెబుతూ, వాస్తవంగా తక్కువ మంది రైతులకు మాత్రమే ప్రయోజనం అందిస్తున్నారని ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ముఖ్యంగా కౌలు రైతులను పూర్తిగా విస్మరించడం అత్యంత బాధాకరమన్నారు. పంటల బీమా, పంట రుణాలపై సున్నా వడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి రైతులకు ఉపయోగపడే కీలక పథకాలు అమలులో లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు సకాలంలో సహాయం అందడం లేదని పేర్కొన్నారు. మొక్కజొన్న, శనగ, పొగాకు, మామిడి, అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనల తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మెరుగుపడలేదని, నో-బిడ్, లో-బిడ్ సమస్యలు మరింత పెరిగాయని తెలిపారు. తోతాపురి మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని, జ్యూస్ కంపెనీల ఇష్టారాజ్యానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అరటి రైతులు కూడా గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని చెప్పారు. ఆక్వా రంగంలోనూ మేత ధరల పెంపుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఒకలా ఉండగా, వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటనలు, ప్రచారాలకే పరిమితం కాకుండా రైతుల వాస్తవ సమస్యలపై దృష్టి సారించాలని, లేకపోతే రాష్ట్ర రైతాంగం మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతుందని ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు.