గుంటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ దోపిడీకి తెరలేపారని గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. గతంలో పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకున్న చంద్రబాబు, ఇప్పుడు అమరావతిని ‘ట్రిపుల్ ఏటీఎం’గా మార్చి భారీ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పెనుమాకలో నిర్బంధ భూసేకరణను వ్యతిరేకిస్తున్న బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైయస్ఆర్‌సీపీ కమిటీపై పోలీసుల సమక్షంలోనే, టీడీపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో అమానుషంగా దాడి చేశారని మండిపడ్డారు. ఈ దాడిలో కానిస్టేబుల్ తల పగిలితే.. ఆ దాడికి పాల్పడిన నిందితుడిని వదిలేసి, బాధితులైన తమపైనే తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. మరోవైపు విజయవాడలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారాన్ని ప్రభుత్వం పూర్తిగా పక్కదారి పట్టిస్తోందని, నిందితుడైన సీఐ నాగరాజును మాత్రమే రిమాండ్‌కు పంపి ఉన్నతాధికారులను, టాస్క్ ఫోర్స్ పోలీసులను కాపాడాలని చూస్తోందని విమర్శించారు. అత్యాధునిక సాంకేతికత గురించి మాట్లాడే చంద్రబాబు.. పోలీస్ స్టేషన్‌తో పాటు విజయవాడ నగరం మొత్తంలో సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ లోపభూయిష్టంగా సాగుతున్నందున, దీనిపై సీబీఐ లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సిట్ చీఫ్ రవిప్రకాష్‌కు తాము విజ్ఞప్తి పత్రాన్ని పంపినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని, ప్రతిపక్షంగా అమరావతి బాధిత రైతుల పక్షాన వైయస్ఆర్‌సీపీ నిలబడి చట్టబద్ధంగా పోరాడుతుందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... 1. వైయస్ఆర్‌సీపీ కమిటీపై టీడీపీ రౌడీ మూకల దాడి.. పెనుమాక గ్రామంలోని ఇష్టం లేని రైతాంగంపై కూటమి ప్రభుత్వం కంపల్సరీ ఎక్విజేషన్ (నిర్బంధ భూసేకరణ) విధానంతో తీవ్ర ఒత్తిడి తెస్తోంది. తమ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తూ, చట్టబద్ధంగా పోరాటం చేస్తున్న రైతులంతా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి సహాయం కోరారు. వారి విజ్ఞప్తి మేరకు వైయస్ఆర్‌సీపీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రైతుల ఆహ్వానం మేరకే వైయస్ఆర్‌సీపీ కమిటీ పెనుమాక వెళ్తుంటే.. చంద్రబాబు, లోకేష్‌ల ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులు చూస్తుండగానే రాళ్లు, కోడిగుడ్లతో దౌర్జన్యానికి దిగారు. అమరావతి ఏమైనా పాకిస్థానా? అక్కడికి వెళ్లడానికి వీసా కావాలా?. 2. అమరావతి పేరుతో భారీ దోపిడీ – ట్రిపుల్ ఏటీఎం అమరావతి ఇవాళ ఒక అంతులేని కథలా మిగిలిపోయింది. గతంలో 2014-19 మధ్య ఐదేళ్లు, ఇప్పుడు రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగుస్తున్నా చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేదు. అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు రూ.47 వేల కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెడుతున్నారు. చెన్నై, ముంబైలలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.5-6 వేలు ఉంటే, ఇక్కడ రూ.12 వేల నుండి రూ.20 వేలు ఇస్తూ భారీగా కమిషన్లు నొక్కుతున్నారు. మొన్నటి వరకు పోలవరం ఏటీఎం అయితే.. ఇవాళ మట్టి, వంతెన కాంట్రాక్టులలో 20 శాతం కమిషన్లు తీసుకుంటూ అమరావతిని 'ట్రిపుల్ ఏటీఎం'గా మార్చేశారు. 3. రైతులపై నిర్బంధాలు.. దారుణ అరాచకాలు. భూములివ్వని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎవరైనా భూమి ఇవ్వకపోతే కొండవీటి వాగుకు గండి కొట్టి పంట పొలాలను నీట ముంచుతున్నారు. చుట్టుపక్కల భూముల్లో కందకాలు తవ్వి, రైతులు తమ సొంత పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. పొలాలు ఇవ్వకపోయినా బలవంతంగా రోడ్లు వేసి.. "మీ పొలం అయిపోయింది" అని బెదిరిస్తున్నారు. కరకట్ట రోడ్డు విస్తరణలో అనేక అవకతవకలకు పాల్పడుతూ, దేవాదాయ భూములను తమకు నచ్చిన వారికి ప్లాట్ల రూపంలో పంచుకుంటున్నారు. 4. బాధితులనే నిందితులుగా మార్చే కుట్ర.. తప్పుడు కేసులు! టీడీపీ శ్రేణుల దాడిలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ తల పగిలి ఆసుపత్రి పాలయ్యాడు. ఆ కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేసిన వ్యక్తి నారా లోకేష్ పక్కన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో, టీవీల్లో స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు అతడిని అరెస్ట్ చేయలేదు. పైగా, కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఆ వ్యక్తినే బాధితుడిగా చూపిస్తూ, వైయస్ఆర్‌సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. చిన్న కేసులు పెడితే రిమాండ్ దొరకదనే కుట్రతోనే ఈ తప్పుడు కేసులు పెట్టారు. బాధితులైన మాపైనే కేసులు పెట్టడం, ఇళ్లపై దాడులు చేయడం దారుణం. ఏలూరులో శ్రీనివాస్ అనే వ్యక్తిపై దాడి చేసి, తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. ఇదెక్కడి న్యాయం? 5. సాయికృష్ణ లాకప్ డెత్ – సిట్ విచారణపై సందేహాలు. విజయవాడలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై సిట్ నియమించినా, కేవలం సీఐ నాగరాజును మాత్రమే రిమాండ్‌కు పంపి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. రిమాండ్ రిపోర్టులో ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయి. విజయవాడ కమిషనరేట్ పరిధిలో సూది పోయినా కనిపిస్తుందని హోంమంత్రి చెబుతారు.. కానీ ఒక నిండు ప్రాణాన్ని తీసి, శవాన్ని మాయం చేస్తే సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా లేదనడం హాస్యాస్పదం. పోలీస్ స్టేషన్‌లో ఫుటేజ్ మాయమైతే.. కమాండ్ కంట్రోల్ రూమ్, డీజీపీ కార్యాలయం, సెక్యూరిటీ విభాగానికి చెందిన ఫుటేజ్ ఏమైంది? శవాన్ని పూడ్చి పెట్టారా? లేదా భస్మం చేశారా? అనే విషయాలను సిట్ తేల్చలేకపోయింది. సాయికృష్ణ తల్లి మే 28న అడ్వకేట్ ద్వారా ఆన్‌లైన్‌లో కస్టోడియల్ డెత్ అని ఫిర్యాదు చేసినా సిట్ దానిని సైడ్‌లైన్ చేశారు. 6. సిట్ చీఫ్ రవిప్రకాష్‌కు వైయస్ఆర్‌సీపీ విజ్ఞప్తి. ఈ కేసు విచారణ లోపభూయిష్టంగా సాగుతోందన్న అనుమానంతో తాము సిట్ చీఫ్ రవిప్రకాష్ ని సంప్రదించామని అంబటి రాంబాబు తెలిపారు. హైకోర్టు విచారణ కారణంగా రెండు రోజులు సమయం లేదని ఆయన తెలపడంతో, తమ సందేహాలతో కూడిన విజ్ఞప్తి పత్రాన్ని వాట్సప్ మరియు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాను. టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను తీసుకువస్తే వారిని ఎందుకు ముద్దాయిలుగా చేర్చలేదు? అసలు సాయికృష్ణను లాకప్ డెత్ చేయడానికి ఉన్న కారణాలు ఏంటన్న అనుమానాలు చాలా ఉన్నాయి. అంటే ఏదో అదృశ్య శక్తి ఈ ఘటన వెనుక ఉండి నడిపింది అన్న ప్శశ్నలు తలెత్తుతున్న దశలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి, అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారుల మీద ఉంది. ఈవిషయాన్ని అధికారులకు గుర్తు చేయదల్చుకున్నాను. ఈ నేపధ్యంలో కనీసం కొడుకు మృతదేహాన్ని కూడా చూడని ఆ తల్లి ముళ్లపూడి విజయలక్ష్మి ఉసురు చంద్రబాబు, లోకేష్‌లకు తగలక మానదని అంబటి రాంబాబు హెచ్చరించారు. చనిపోయిన యువకుడిని క్రిమినల్ అని ముద్ర వేయడం వారి అమానవీయతకు అద్దం పడుతోందన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదని.. ప్రతిపక్షంగా చేతులు కట్టుకుని కూర్చోబోమన్నారు. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి, ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచుతుందని అంబటి రాంబాబు హెచ్చరించారు.