ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. గూండాల రాజ్యం నడుపుతున్నారా?

సీఎం చంద్రబాబుపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌ మండిపాటు

రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్‌డీఏ రైతుల పరిరక్షణ కమిటీ పర్యటించకూడదా?

కమిటీతో కలిసి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ  మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేస్తారా?

పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా?

అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకు ఇలాంటి దారుణాలు చేస్తారా?

మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పా?

అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు.. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి

భూములివ్వని రైతులను నరకయాతనకు గురి చేస్తారా?

దాడులకువైయ‌స్ఆర్‌సీపీ  తలవంచదు.. మీ దారుణాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం

రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్లు కాదు.. వారికి వైయ‌స్ఆర్‌సీపీ  తోడుగా నిలుస్తుంది

తాడేప‌ల్లి: రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్‌డీఏ రైతుల పరిరక్షణ కమిటీతో కలిసి రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ  మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై ఉండవల్లి సెంటర్‌లో టీడీపీ గూండాలు దాడులు చేయడం దుర్మార్గమని వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా.. లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా.. అంటూ సీఎం చంద్ర­బాబును నిలదీశారు. పట్టపగలే ప్రజాస్వా­మ్యాన్ని ఖూనీ చేస్తారా అంటూ మండిపడ్డారు. అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారా.. అంటూ సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. 

‘ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా.. లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసులు దగ్గరుండి ఈ దాడిని సమన్వయం చేయడం అత్యంత దారుణం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసే దాడులకు వైయ‌స్ఆర్‌సీపీ  తలవంచదని, మీ అవినీతి, దోపిడీ దౌర్జన్యాలను ఎప్పటికప్పడు ఎండగడతామని తేల్చి చెప్పారు. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్లు కాదని.. వారి పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ  నిలబడి, తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

రైతులకు తోడుగా నిలవడం తప్పా?
‘చంద్రబాబు గారూ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్‌డీఏ రైతుల పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ  మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకు ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడి కాదా? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో–ఆర్డినేట్‌ చేయడం అత్యంత దారుణం. 

అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూ సేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగు నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరం లేని పరిస్థితులను వారికి కల్పిస్తున్నారు. భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్‌ ప్లాట్ల కింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఇన్ని రకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్ల చేత రౌడీయిజం చేయిస్తారా?

ఇంకా ఎందుకు? ఎవరి కోసం కావాలి? 
అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి మమ్మల్ని నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా చంద్రబాబూ? ఇవాళ మీ అవినీతి, దోపిడీ కోసం రాష్ట్రంలో జంగిల్‌ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చ ముఠాలతో స్వైర విహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచి వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. 

అయినా మీలో మార్పు రాలేదు సరికదా.. రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలు పెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ  ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయ‌స్ఆర్‌సీపీ  తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయ‌స్ఆర్‌సీపీ వారికి తోడుగా నిలుస్తుంది’ అని స్పష్టం చేశారు.

Back to Top