సీఐవా.. టీడీపీ నేత‌వా?

హత్యాయత్నం ఫిర్యాదుపై పోలీసుల వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ 

ఈ నెల 27న తనపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలతో తాడేపల్లి సీఐకి ఫిర్యాదు చేసిన 
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు.

రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ బృందంపై టీడీపీ నేతల దాడి

కారుపై రాళ్లు విసిరి హత్యాయత్నానికి పాల్పడ్డారు

వీడియో ఆధారాలతో తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు

ఫిర్యాదు స్వీకరణలో సీఐ నిర్లక్ష్య ధోరణి

పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారు

దాడి ఘటనపై ప్రివిలేజ్ కమిటీ, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్‌లను ఆశ్రయిస్తాం

తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌

తాడేపల్లి: తనపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడినప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు బాధితులనే ప్రశ్నిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 27న ఉండవల్లి వద్ద తనపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు, ఫొటోలు, ఇతర సాక్ష్యాలతో తాడేపల్లి సీఐకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, సీఐ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తూ బాధితులపైనే నిందలు వేయడం విచారకరమన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- రాజధాని రైతుల ఆహ్వానం మేరకే వెళ్లాం
రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మా బృందంపై దాడి చేశారు. నా కారును ధ్వంసం చేయడమే కాకుండా బండరాళ్లు విసిరి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలతో సీఐకి ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోవాల్సింది పోయి మాపైనే నిందలు వేయడం బాధాకరం. ఒక ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే న్యాయం చేయాల్సిన పోలీసులు రాజకీయ నాయకుల్లా వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. 

- దాడి చేసింది టీడీపీ నాయకులే
మాపై దాడి చేసింది రైతులు కాదు, టీడీపీ నాయకులే. నా కారుపై రాయి విసిరింది టీడీపీ యువజన అధ్యక్షుడు రాయపాటి కిరణ్‌, భౌతిక దాడికి పాల్పడింది టీడీపీ మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ. అమరావతికి మేమెప్పుడూ వ్యతిరేకం కాదు. అక్కడ జరుగుతున్న అవినీతికే వ్యతిరేకం. దాడిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా సీఐ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారు. మా ఫిర్యాదును స్వీకరించకపోతే ప్రైవేట్ కేసు వేయడానికైనా వెనుకాడం.

ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం
ఈ దాడి ఘటనను ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే ఈ సీఐని కూడా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుపరుస్తాం. మానవ హక్కుల కమిషన్‌తో పాటు ఎస్సీ కమిషన్‌ను కూడా ఆశ్రయిస్తాం. నేను ప్రజాప్రతినిధిని, రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తిని. రాజధానికి వెళ్లే హక్కు నాకు లేదా? మీరు రావద్దని చెప్పినా వచ్చారని సీఐ మాట్లాడటం విడ్డూరంగా ఉంది" అని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ అన్నారు.

Back to Top