కూటమి ప్రభుత్వంలో అదుపుతప్పిన శాంతిభద్రతలు

అమరావతి పేరుతో భారీ దోపిడీ: 

అమరావతి పర్యటనపై టీడీపీ శ్రేణుల దాడి - రాష్ట్రంలో ఆటవిక పాలన

శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తీవ్ర ధ్వజం.

విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి పర్యటనలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై టీడీపీ శ్రేణుల దాడి  ఘర్హనీయం

రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతిభద్రతలకు ఇదే నిదర్శనం

అమరావతిలో జరుగుతుంది అభివృద్ది కాదు అక్రమాలు 

అభివృద్ధి జరిగితే ప్రతిపక్షాల పర్యటనకు అడ్డంకులు ఎందుకు ?

సూటిగా నిలదీసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ.

టీడీపీ శ్రేణుల దాడికి గురైన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు

తిరిగి వారిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం దారుణం.

పంటలకు కనీస మద్దతు ధర కల్పనలో విఫలైమన కూటమి ప్రభుత్వం 

రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచుతున్న చంద్రబాబు 

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. 

విశాఖపట్నం: అమరావతిలో పర్యటించిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులపై టీడీపీ శ్రేణులు జరిపిన దాడిని శాసనమండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఆటవిక పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న భారీ అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ రకమైన అక్రమ దాడులకు, కక్షసాధింపు కేసులకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలో విఫలమై, సంపద సృష్టి పేరిట బీచ్‌లలో బార్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ  సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..  

వైయ‌స్ఆర్‌సీపీ నేతల దాడి ఆటవిక పాలనకు నిదర్శనం...

అమరావతి ప్రాంతంలో తాము పడుతున్న ఇబ్బందులను, అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా చూడాలని అక్కడి రైతులు ఆహ్వానించడంతోనే వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు కొండవీడు ప్రాంతానికి వెళ్లారు. అయితే మార్గమధ్యంలో టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని రాళ్లతో దాడికి దిగారు. కార్లను ధ్వంసం చేయడమే కాకుండా, నాయకులపై హత్యా ప్రయత్నం చేశారు. రక్షణగా ఉన్న పోలీసులపై సైతం దాడులు చేయడం రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతిభద్రతలకు సజీవ నిదర్శనం. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం కాకుండా ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

నిజాలు బయటపడతాయనే చంద్రబాబు బెరుకు, భయం..

సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా అమరావతిలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజంగానే అక్కడ అంతా సక్రమంగా జరిగితే, ప్రతిపక్షాలు వెళ్లి చూడటానికి వస్తే ఎందుకు భయపడుతున్నారు? అక్కడ జరుగుతున్న దోపిడీ బయటపడుతుందనే ఈ బెరుకు. దేశంలో ఎక్కడైనా చదరపు అడుగు నిర్మాణానికి రూ. 7-8 వేలు ఖర్చయితే, అమరావతిలో మాత్రం ఏకంగా రూ. 15-20 వేలు ఖర్చు చూపిస్తున్నారు. కేవలం అద్దాల కోసమే రూ. 2,500 ఖర్చు చేయడం ముమ్మాటికీ ప్రజాధనం దోపిడీయే. రాజకీయ వ్యాఖ్యలు ఉంటే రాజకీయంగానే సమాధానం చెప్పాలి తప్ప, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం ప్రభుత్వ విధానమా?

బాధితులపైనే అక్రమ కేసులు - రాజ్యాంగ ఉల్లంఘన..

దాడికి గురైన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ అక్రమ కేసులు బనాయించడం దారుణం. ప్రభుత్వం చేతుల్లో ఉందని ఈ రకమైన వేధింపులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. కేవలం కూటమి ప్రభుత్వ సొంత రాజ్యాంగం, సొంత కార్యాచరణ నడుస్తోంది. ఈ అక్రమ పాలన ఎల్లకాలం సాగదు, త్వరలోనే ప్రజల నుండి తిరుగుబాటు రావడం ఖాయం.

రైతాంగాన్ని నిలువునా ముంచుతున్న ప్రభుత్వం..

చంద్రబాబు దృష్టిలో "వ్యవసాయం దండగ" అనే నానుడిని ఆయన మరోసారి సార్ధకం చేసుకుంటున్నారు. ఆయన ఎప్పుడు సీఎం అయినా మొదట నష్టపోయేది రైతాంగమే. పక్క రాష్ట్రంలో కేంద్ర సబ్సిడీతో కలిపి ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) ఇచ్చి పంటలు కొనుగోలు చేస్తుంటే, మన రాష్ట్రంలో అలాంటి ఊసే లేదు. మామిడి, జొన్న, కందులు లాంటి ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. ఓటేసిన పాపానికి రైతులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు ధర్మం?

సంపద సృష్టి పేరిట సంస్కృతికి విఘాతం - విశాఖ భూముల దోపిడీ.

కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తామంటూ మన అలవాట్లు, సంస్కృతి, ఆచారాలకు విరుద్ధంగా ప్రజలు తిరిగే బీచ్‌లలో బార్ల ఏర్పాటుకు తెరతీసింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సంస్కృతి వేరు, కానీ డొమెస్టిక్ ఎయిర్ పోర్టులు, బీచ్ లలో బార్లు పెట్టడమే సంపద సృష్ఠా? విశాఖపట్నంలో విలువైన భూములను పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. ఎక్కడెక్కడో ఎత్తేసిన కంపెనీలను తెచ్చి దోచిపెడుతున్నారే తప్ప, యువతకు ఉపాధి కల్పన లేదు.

మా హయాంలో అన్ని అనుమతులు ఇచ్చి, భూసేకరణ పూర్తి చేసి శంకుస్థాపన చేసిన భోగాపురం ఎయిర్‌పోర్టులో ఇప్పుడు తాగడానికి నీరు లేదు, వెళ్లడానికి దారి లేదు కానీ బార్ మాత్రం పెడతామంటున్నారు. పైగా యూజర్ ఛార్జీల పేరుతో సామాన్యుడిపై రూ.1,000 అదనపు భారం వేసి దోపిడీ చేస్తున్నారు.

ప్రజా వ్యతిరేక పాలన - పెరిగిన ధరల భారం..

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గాయని మంత్రి చెప్పడం హాస్యాస్పదం. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. నేడు పేదవాడి ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి లేదు. గ్రామాల్లోకి వెళ్తే వాస్తవ పరిస్థితులు, ప్రజల ఆగ్రహం ఏంటో అర్థమవుతుంది. ప్రతిపక్షాలపై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు:
అమరావతి రైతులపై మాకు ఎప్పుడూ ప్రేమ ఉంది. భూములు దౌర్జన్యంగా తీసుకుంటున్నారని, తమ గ్రామాల్లోకి రావాలని రైతులు పిలిస్తేనే మా నాయకులు వెళ్లారు. కూటమి పాలనలోనే అమరావతి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమరావతిని అవినీతి రహితంగా నిర్మిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ అభివృద్ధి పేరుతో దోపిడీ చేస్తే బాధ్యతగల ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోం.

రాష్ట్రపతి వసతిపై అభ్యంతరం: 
భారత రాష్ట్రపతి గారు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి వస్తున్న సందర్భంలో, విశాఖలో ప్రభుత్వ అతిథి గృహాలు ఉన్నప్పటికీ ప్రైవేటు అతిథి గృహంలో వసతి కల్పించడం దేశ ప్రతిష్టకు తలవంపులు తెచ్చే చర్య. పరోక్షంగా ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చడానికే ఇలా చేస్తున్నారు.

దాడిపై నిష్పాక్షిక విచారణ - సీబీఐ డిమాండ్: 
వైయస్సార్పీ నేతల పర్యటనలో ఎవరు రాళ్లు వేశారు, ఎవరు మోసుకొచ్చారో వీడియోలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దాడిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. అలాగే ఇటీవల విజయవాడలో  జరిగిన లాకప్ డెత్ అత్యంత ఘోరమైన చర్య. దీని వెనుక ఎంతటి పెద్దస్థాయి వ్యక్తులున్నా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనలపై నిష్పాక్షికమైన సీబీఐ విచారణ జరపాలని గవర్నర్ గారిని కోరాం.

పర్యాటకం & బార్ల సంస్కృతి:
మేము పర్యాటక రంగానికి వ్యతిరేకం కాదు. కానీ మాట్లాడితే గోవా సంస్కృతిని ఉదహరిస్తున్నారు. గోవాలో ఆ కల్చర్ స్వాతంత్య్రానికి పూర్వం నుండే ఉంది. మన సంస్కృతిని నాశనం చేస్తూ, బీచ్‌లలో బార్లు పెట్టడాన్ని వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Back to Top