తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలకు ఎదురు నిలిచి రెండేళ్లుగా రజకులు వైయస్ఆర్‌సీపీకి అండగా నిలిచారని వైయస్ఆర్‌సీపీబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ అన్నారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రజకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరగాలంటే మళ్లీ వైయస్ జగన్ గారు సీఎం కావాలని, అందుకోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కూటమి ప్రభుత్వ మోసాలు, దుష్ప్రచారంపై వైయస్ఆర్‌సీపీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, రెండేళ్లుగా చేసిన ద్రోహాన్ని లెక్కలతో సహా ప్రజలకు వివరించడానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో చేసిన మంచిని, రెండేళ్లుగా సాగుతున్న చీకటి పాలనపై ఆధారాలతో సహా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏమేం మేలు చేయాలో తెలుసుకోవడంలో భాగంగానే ఆయా సామాజికవర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్నట్టు చెప్పారు. రాబోయే ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం బాధ్యతాయుతంగా పనిచేసే ప్రతి కార్యకర్తకీ గుర్తింపు దక్కుతుందని భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు కోసం కిరాయి సైన్యంలా పనిచేస్తున్న పోలీసులను ఎదుర్కొవడానికి సంసిద్ధంగా ఉండాలని అన్నారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని, అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. వైయస్ జగన్ గారి మాటలకు ప్రజల్లో భరోసా ఉందని, అందుకే ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దగ్గరకి కాకుండా జగన్ గారి భరోసా కోసం వస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైయస్ఆర్‌సీపీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్ గౌడ్, వైయస్ఆర్‌సీపీ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... కూటమి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - సజ్జల రామకృష్ణారెడ్డి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏమేం మేలు చేయాలో తెలుసుకునేందుకు ఆయా సామాజికవర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటున్నాం. అందులో భాగంగానే రజకులతో సమావేశం నిర్వహిస్తున్నాం. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని రాబోయే రోజుల్లో ముందుకెళ్లడం జరుగుతోంది. రాబోయే ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. అందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నాం. పార్టీ కోసం బాధ్యతాయుతంగా పనిచేసే కార్యకర్తల వివరాలు పార్టీ దగ్గర ఉన్నాయి. పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇస్తాం. గత ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీపాలనలో జరిగిన మంచితోపాటు రెండేళ్లుగా కూటమి చీకటి పాలనలో జరుగుతున్న దారుణాలను ప్రజలకు వివరించాలి. పేదలకు మేలు చేసి ధనిక పేద మధ్య తారతమ్యాలను తగ్గించాలన్న తాపత్రయంతో పాటు అందుకోసం కష్టపడే మనస్తత్వం కలిగిన నాయకుడు వైయస్ జగన్ గారు. జనం కోసం మనం ఆలోచించినంత కాలం దేవుడి ఆశీస్సులుంటాయని నమ్మి పార్టీని నడిపిస్తున్నాడు కాబట్టే జైలు గోడలు కూడా ఆయన్ను ఆపలేకపోయాయి. గెలుపోటములను ఒకేరకంగా స్వీకరించే ధైర్యం ఉన్న గొప్ప నాయకుడు వైయస్ జగన్ గారు. నిత్యం ప్రజల్లో ఉంటూ రెండేళ్లలో ఆయన చేసిన పోరాటాలే దీనికి సాక్ష్యం. విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడు కాబట్టే ఆయన బయటకొస్తే వేలల్లో లక్షల్లో జనం ఆయన కోసం వస్తున్నారు. సీట్లు ఇవ్వకపోయినా ఆయన స్పందిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు నమ్ముతున్నారు. ఆయన మాట మీదనే భరోసా ఉంచుతున్నారు. పోలీసులను తన కోసం పనిచేసే కిరాయి సైన్యంలా చంద్రబాబు వాడుకుంటున్నాడు కాబట్టే రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. చేసింది చెప్పుకుని ఎన్నికల్లో గెలవలేక పోలీసులతో దౌర్జన్యాలు చేయించి రాజంపేట, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార కూటమిని ప్రతిఘటించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదు. బాండ్ల మీద సంతకాలు చేసి మరీ అన్నివర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. తన మోసాలను ప్రజలు మర్చిపోతారనే ధీమాతో ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చాక చేసే పనులకు పొంతనే ఉండదు. అవన్నీ తట్టుకుని నిలబడుతున్నామంటే వైయస్ జగన్ గారి గొప్పతనమే. ప్రశ్నించే గొంతులు నొక్కడానికి ఏకంగా ఫేస్‌బుక్ ఆఫీసులకే పోలీసులతో ఫిర్యాదులు చేయించి అకౌంట్లు బ్లాక్ చేయిస్తున్నాడు. రెండేళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప పాలన సాగడం లేదు. అబద్ధపు వాంగ్మూలాలతో అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందించరు, ఆరోపణలకు సమాధానం చెప్పరు. వారు చేసేదల్లా వైయస్ జగన్ గారి కుటుంబాన్ని తిట్టి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడమే. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలి. కూటమి ప్రభుత్వ మోసాలను లెక్కలతో తిప్పికొట్టడానికి వీలుగా ప్రతిఒక్కరూ సన్నద్ధం కావాలి. ఎస్ఐఆర్ విషయంలో వార్డు స్థాయి నుంచి అప్రమత్తంగా పనిచేయాలి. జగనన్నతోనే బీసీలకు న్యాయం - రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ బీసీలకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచింది. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు కులాలుగానే చూస్తున్నాడు. చంద్రబాబు బీసీ కులాను బ్యాక్ వర్డ్ క్యాస్టులుగా చూస్తే వైయస్ జగన్ గారు బ్యాక్ బోన్ క్లాస్‌లుగా చూశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా వర్గాల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపించారు. జగన్ గారి పక్షాన పోరాడుతున్నారనే కారణంతో వైయస్ఆర్‌సీపీలో ఉన్న బీసీ నాయకుడైన మాజీ మంత్రి జోగి రమేష్ ని నకిలీ మద్యం కేసులో జైలుకు పంపారు. అంతేకాకుండా ఆయన ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. కారుమూరి సునీల్ యాదవ్‌ని అక్రమ లిక్కర్ కేసు సృష్టించి జైలుకు పంపారు. మళ్లీ బీసీలకు న్యాయం జరగాలంటే వైయస్ జగన్ గారు సీఎం కావాలి. వైయస్ఆర్‌సీపీకి అండగా నిలిచింది రజకులే - లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ దివంగత వైయస్సార్ గారి తర్వాత బీసీలకు న్యాయం చేసిన నాయకుడు వైయస్ జగన్ గారు మాత్రమే. అంతేకాకుండా బీసీలను రాజకీయంగా ప్రోత్సహించారు. బీసీ కులాల్లో రజకులు వైయస్ఆర్‌సీపీకి అండగా నిలిచారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్న యువతకి వైయస్ఆర్‌సీపీలో కొదవేలేదు. రెండేళ్ల పాలనతోనే చంద్రబాబు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయాడు. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్ సహా పథకాలన్నింటికీ మంగళం పాడేశాడు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసగించాడు. ఆయనకు అమరావతి తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలు కనిపించడం లేదు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే యువతను తమ అవసరాల కోసం వాడుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. వైయస్ జగన్ గారు సీఎం అయితేనే మళ్లీ వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు కారణంగా సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అరాచకాలు అనే మురికిని శుద్ది చేస్తున్న వైయస్ జగన్‌కి రజకులు అండగా నిలబడాలి.