ఆక్వాలోనూ అదే ‘నాటకం’ 

మరోసారి బయటపడ్డ చంద్రబాబు బండారం

 ఆక్వా ఫీడ్‌ టన్నుకు రూ.4 వేలు తగ్గించినట్లు గురువారం ప్రకటన 

అదంతా వట్టిదేనని శుక్రవారం తేల్చిన కంపెనీలు 

టన్నుకు రూ.2 వేలకు మించి తగ్గించలేమని తేల్చి చెప్పిన అవంతి ఫీడ్స్‌.. ఇదే బాటలో మిగిలిన కంపెనీలు 

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ఆక్వా రైతులు

పెంచిన ధరలు పూర్తిగా తగ్గించాల్సిందేనని స్పష్టీ కరణ

 

అమరావతి: రైతుల పట్ల సీఎం చంద్రబాబు నాటకం, బూటకపు మాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. రొయ్యల ఫీడ్‌ ధరల విషయంలో బుధవారం చంద్రబాబు చెప్పిన మాటలు ఉత్త డొల్లేనని తేలిపోయింది. చంద్రబాబు సమక్షంలో గురువారం జరిగిన సమావేశంలో ఆక్వా ఫీడ్‌ ధరలు టన్నుకు రూ.4 వేలు తగ్గించాలని కంపెనీలను సీఎం ఆదేశించగా, అందుకు కంపెనీలు అంగీకరించాయని ప్రకటించారు. 

ఇదంతా వట్టిదేనని శుక్రవారం ఆక్వా ఫీడ్‌ కంపెనీలు తేల్చిపారేశాయి. టన్నుకు రూ.4 వేలు తగ్గించే ప్రసక్తే లేదని, రూ.2 వేలకు మించి తగ్గించడంలేదని ఫీడ్‌ మార్కెట్లో 50 శాతానికి పైగా వాటా కలిగిన అవంతి ఫీడ్స్‌ కంపెనీతో పాటు ఐఫీడ్‌ కంపెనీ కూడా అధికారికంగా ప్రకటన జారీ చేశాయి. మిగిలిన కంపెనీలు కూడా టన్నుకు రూ.2 వేలకు మించి తగ్గించలేమని చెబుతున్నాయి. దీంతో ప్రభుత్వ ప్రకటన వట్టి బూటకమేనని తేలిపోయింది. ఆక్వా రైతులను మరోసారి నిరాశలో ముంచారు.  

నిన్నటి మాట వట్టిదే.. 
ఆక్వా రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతోంది. వనామీ రొయ్యల ఉత్పత్తికి టన్నుకు టన్నున్నర, టైగర్‌ రొయ్యలకు రెండున్నర టన్నుల చొప్పున మేత అవసరం. ఒక్క ఏపీలోనే ఏటా 23 లక్షల టన్నుల మేతను రొయ్య రైతులు కొంటారు. ఈ రంగంలో ఏటా రూ.21 వేల కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. దీంట్లో 50 శాతానికి పైగా వాటా అవంతి ఫీడ్స్‌దే. ఆ తర్వాత 20 శాతం దేవీ ఫీడ్స్‌ది కాగా, మిగిలిన వాటా బీఎంఆర్‌ (బీద మస్తాన్‌రావు), సంధ్య, సీపీ, ఫెడోరో, ఫాల్కన్‌ వంటి ఇతర సంస్థలది. వీటిలో మెజార్టీ సంస్థలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవే. 

ఈ కారణంగానే చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) చట్టాన్ని ధిక్కరిస్తూ ఏకపక్షంగా మేత ధరలను పెంచేస్తున్నాయి. ఫిబ్రవరిలో ఏకపక్షంగా రూ.4 వేలు పెంచిన కంపెనీలు తాజాగా ముడిసరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో టన్నుకు వనామీ ఫీడ్‌పై రూ.12 వేలు, టైగర్‌ ఫీడ్‌పై రూ.14 వేలు పెంచుకునేందుకు కమిషనర్‌ను అనుమతి కోరాయి. అప్సడా అనుమతి లేకుండా గత నెల 11న వనామీ ఫీడ్‌పై రూ.8,430, టైగర్‌ ఫీడ్‌పై రూ.10,520 చొప్పున పెంపునకు సిద్ధమయ్యాయి. 

ఆక్వా రైతుల ఆందోళనలతో పెంపు అమలును వాయిదా వేశాయి. ఆ తర్వాత పలుమార్లు సమావేశమైనప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. అయినప్పటికీ ఈ నెల 13న వనామీ ఫీడ్‌పై రూ.10వేలు, టైగర్‌ ఫీడ్‌పై రూ.12 వేలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. కాగా గురువారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఫీడ్‌ తయారీదారులు, ప్రభుత్వ, ఫీడ్‌ కంపెనీల అనుకూల రైతు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కంపెనీలు టన్నుకు ఎమ్మార్పీపై రూ.4 వేల చొప్పున తగ్గించేందుకు అంగీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. 

ఈ లెక్కన వనామీ ఫీడ్‌పై టన్నుకు రూ.6 వేలు, టైగర్‌ ఫీడ్‌పై రూ.8వేలు భారం పడుతుందని, ఈ పెంపును కూడా అంగీకరించబోమని, తక్షణమే పెంచిన ఫీడ్‌ ధరలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేశారు. కానీ, అసలు విషయాన్ని ఫీడ్‌ కంపెనీలు శుక్రవారం వెల్లడించాయి. కిలోకు రూ.2 (టన్నుకు రూ.2 వేలు) మాత్రమే తగ్గిస్తామని అవంతి ఫీడ్స్, ఐఫీడ్‌ కంపెనీ స్పష్టంగా చెప్పేశాయి. మిగిలిన కంపెనీలూ ఇదే మాట చెబుతున్నాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వ బూటకం మరోసారి బయటపడిందని ఆక్వా రైతులు మండిపడుతున్నారు. 

2019–24 మధ్యలో కంపెనీలు మూడు సార్లు ఫీడ్‌ ధరలు పెంచినప్పటికీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ కృషి ఫలితంగా వెనక్కి తీసుకున్నాయని గుర్తు చేస్తున్నారు. రైతులపై టన్నుకు రూ.8,600కు పైగా భారం పడకుండా వైఎస్‌ జగన్‌ అడ్డుకొన్నారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు పెంచిన ధరలను పూర్తి స్థాయిలో రోల్‌బ్యాక్‌ చేయకపోతే క్రాప్‌ హాలిడేకు వెళ్లడం తప్ప గత్యంతరం లేదని తేల్చిచెబుతున్నారు.

Back to Top