వైయ‌స్ఆర్‌సీపీ బృందంపై టీడీపీ గూండాల దాడి 

ఉండల్లిలో రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు 

రైతు పరిరక్షణ కమిటీ వాహనాలు ధ్వంసం.. పోలీసులకు సైతం గాయాలు 

గుంటూరు: గుంటూరు జిల్లా  ఉండ‌వ‌ల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతులు, రైతు పరిరక్షణ కమిటీ నేతలు, వైయ‌స్ఆర్‌సీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తలు రైతు పరిరక్షణ కమిటీ నేతల కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పచ్చ గూండాల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో, అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం.  రాజధాని పేరుతో భూములు ఇవ్వని రైతులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, సీఆర్డీయే రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డాయి.

కొన్నిరోజులుగా తమ భూముల చుట్టూ మట్టి తవ్వేసి వ్యవసాయం చేయనివ్వకుండా అధికారులు వేధిస్తున్నారని, భూములు ఇవ్వలేదనే కారణంతో ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకుందని పెనుమాక రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల ఆహ్వానం మేరకు వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ బృందం, రైతు పరిరక్షణ కమిటీ నేతలు శనివారం అక్కడికి చేరుకున్నారు. అయితే ఉండల్లి గ్రామంలోకి చేరుకున్న వెంటనే టీడీపీ కార్యకర్తలు గుంపులుగా చేరుకుని రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడులకు పాల్పడ్డారు. రైతు పరిరక్షణ కమిటీ నేతల వాహనాలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పలువాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. సంఘటన స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

పోలీసుల సమక్షంలోనే టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడినా వారిని అడ్డుకునేందుకు సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడులను అడ్డుకునే ప్రయత్నంలో కొందరు పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. ఇటీవల భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీటిని అధికారులు మళ్లించారని, రైతుల సాగును దెబ్బతీసే చర్యలు చేపట్టారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితులను పరిశీలించేందుకే పరిరక్షణ కమిటీ నేతలు వెళ్లగా, వారిపై ప్రణాళికాబద్ధంగా దాడి జరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. రైతుల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది.
 

Back to Top