కూటమి పాలనలో మామిడి రైతులకు ఎందుకీ అన్యాయం?

క‌ర్ణాటకకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్‌కు మరో న్యాయమా?

వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్) ఎంవీయస్ నాగిరెడ్డి మండిపాటు

తాడేప‌ల్లి: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం PDP (Price Deficiency Payment) పథకం కింద తోతాపురి మామిడి రైతులకు క్వింటాలుకు రూ.1,750 చొప్పున చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో అక్కడి మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించి కొంత ఊరట దక్కుతోంది. అయితే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటకు సరైన ధర లేక, కొనుగోళ్లలో స్పష్టత లేక, రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటక రైతులకు చూపిన చొరవను ఆంధ్రప్రదేశ్ రైతుల విషయంలో ఎందుకు చూపడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్) ఎంవీయస్ నాగిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక సహాయం కోరాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయ‌న ప్ర‌శ్నించారు. కర్ణాటకలో అమలైన విధంగానే ఆంధ్రప్రదేశ్ మామిడి రైతులకు కూడా PDP పథకం వర్తింపజేసి తక్షణ ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంద‌న్నారు. రైతుల కష్టాలను రాజకీయాలకు అతీతంగా గుర్తించి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాల‌ని, లేదంటే వేలాది మంది మామిడి రైతులు మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని యం.వి.ఎస్. నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
 

Back to Top