సాయికృష్ణ లాకప్ డెత్‌కు నిరసనగా అనంతపురంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ 

అనంతపురం: రాష్ట్రంలో "రెడ్ బుక్ రాజ్యాంగం" పేరుతో ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై దాడులు, వేధింపులు, అక్రమ కేసులు పెరిగిపోతున్నాయని ఎస్సీ, ఎస్టీ, గిరిజనుల ప్రజా సంక్షేమ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ అనంతపురంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ మృతికి నిరసనగా నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కూడా ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటించాయి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఆందోళనకర స్థాయికి చేరాయని అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ అత్యంత బాధాకరమైన ఘటన అని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీ గిరిజనుల ప్రజాసంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, గిరిజనులపై అన్యాయాలు పెరిగాయని ఆరోపించారు. సాయికృష్ణ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా పాలన సాగుతోందని విమర్శించారు. బలహీన వర్గాల హక్కులను కాపాడేందుకు సంఘాలన్నీ ఏకమై పోరాటం చేస్తాయని తెలిపారు.

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చమలూరు రాజగోపాల్ మాట్లాడుతూ, సాయికృష్ణ మృతి ఘటనపై సీబీఐ విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంఘాలు మరియు వైయ‌స్ఆర్‌సీపీ కలిసి పోరాటం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి గోకుల్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంఘాల నాయకులు, వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
 

Back to Top