తాడేపల్లి: ఆక్వా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం, కూటమి ప్రభుత్వంపై వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైయస్ జగన్ గారు పర్యటించనున్నారని పశ్చిమ గోదావరి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వెల్లడించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ఆక్వా రైతులతో వైయస్ జగన్ గారు ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడి, క్షేత్రస్థాయిలో వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటారని చెప్పారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఫీడ్ రేట్లు విపరీతంగా పెరిగి, రొయ్యల ధరలు పూర్తిగా పడిపోవడంతో ఆక్వారంగం పూర్తిగా నిర్వీర్యమై, రైతులు దిక్కుతోచని స్థితిలోకి నెట్టబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ ధరలు రూ. 14 పెంచి, కేవలం రూ. 2 మాత్రమే తగ్గించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని, ఆదుకోవాల్సిన ప్రభుత్వమే సిండికేట్ యాజమాన్యాలకు, దళారులకు కొమ్ము కాస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులతో ముఖాముఖి అనంతరం రైతు సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని, ఆక్వా రైతులకు న్యాయం జరిగే వరకు వైయస్ జగన్ గారి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఆక్వా రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని ముదునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. భీమవరంలో ఆక్వా రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత రెండేళ్లుగా కుదేలైన ఆక్వా రంగాన్ని, తీవ్ర నష్టాల్లో ఉన్న చేపలు, రొయ్యల రైతాంగాన్ని ఆదుకోవడమే ధ్యేయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం... వారికి అండగా నిలబడేందుకు, ప్రభుత్వంపై వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు ఈ నెల 15న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైయస్ జగన్ గారు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆక్వా రైతులతో ఆయన ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు. ఆ తర్వాత రైతు సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆక్వా రైతులకు న్యాయం జరిగే వరకు వైయస్ జగన్ గారి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఆక్వా రైతుల పక్షాన నిలబడతాం. కూటమి పాలనలో కుదేలైన ఆక్వారంగం గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఆక్వా రంగానికి అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తే... ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్వా రైతులను పూర్తిగా పక్కన పెట్టేసింది. సిండికేట్‌గా ఏర్పడిన ఆక్వా ఫీడ్ యాజమాన్యాలకి, ఎక్స్ పోర్టర్లకు ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. ఫీడ్ రేట్లు విపరీతంగా పెరగడం, మరోపక్క మార్కెట్‌లో రొయ్యల ధరలు పూర్తిగా పడిపోవడంతో ఆక్వా రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు తమ సమస్యలు చెప్పుకొన్నా వినకపోవడంతో... గతంలోనే ఆక్వా రైతులు, రైతు సంఘాల నాయకులు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. ఆ రోజున రైతుల బాధలు విన్న వైయస్ జగన్ గారు స్పందిస్తూ... ఫీడ్ రేట్లను ప్రభుత్వం కల్పించుకుని తగ్గించాల్సిన బాధ్యత ఉందని, రొయ్యల ధరల్లో అప్ అండ్ డౌన్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. "జూలై 1 నాటికి పెంచిన ఫీడ్ రేట్లను తగ్గించకపోతే వైయస్ఆర్‌సీపీ తరఫున రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాడుతాం" అని ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కానీ, ఈ కూటమి ప్రభుత్వం ఆ అల్టిమేటాన్ని పూర్తిగా పెడచెవిన పెట్టి, ఆక్వా రైతుల జీవితాలతో ఆటలాడుతోంది. చంద్రబాబు వెన్నుపోటు, క్రాప్ హాలిడే దిశగా రైతులు వైయస్ జగన్ గారిని రైతులు కలవడంతోటే ఉలిక్కిపడిన చంద్రబాబు... మొట్టమొదటిసారి ఒక మీటింగ్ పెట్టి మేత రేట్లు రూ.4 లు తగ్గిస్తున్నామని చేత చెప్పించారు. కానీ నాలుగు రోజులకే మాట మార్చి, కేవలం రెండు రూపాయలే తగ్గిస్తున్నామని ఆక్వా రైతులకు వెన్నుపోటు పొడిచారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెరిగిన రూ. 14 - రూ. 16 భారంలో కేవలం రెండు రూపాయలు తగ్గించి క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌లతో సంబంధం లేకుండా ప్రతి ఎకరాకి కరెంట్ సబ్సిడీ పూర్తిగా ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పటివరకు ఒక్క కొత్త సబ్సిడీ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. దీనివల్ల వేసవికాలంలో పవర్ కట్స్‌తో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒకపక్క ఫీడ్ రేట్లు పెరగడం, మరోపక్క గిట్టుబాటు ధర రాక నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులు ఇవాళ 'క్రాప్ హాలిడే' ప్రకటించే దిశగా ఆలోచన చేస్తున్నారు. అందుకే గత నెల 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ రొయ్యలను పట్టకుండా, ఫీడ్ షాపులు మూసివేసి నిరసన తెలిపారు. ఆక్వారంగ చరిత్రలో చేపల, రొయ్యల రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఇస్తున్న ఆక్వా రంగాన్ని కాపాడాల్సింది పోయి, చంద్రబాబు తన బంధువుల కోసం, వారి పార్టీ నాయకుల సిండికేట్ కోసం ఆక్వా రైతు నడ్డి విరుస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగాన్ని కాపాడాలని ముదునూరి ప్రసాదరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.