సాయికృష్ణ కేసులో విజయవాడ సీపీని సస్పెండ్‌ చేయాల్సిందే

మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

సీఐ నాగరాజును అరెస్టు చేయకపోవడం దారుణం

దీనిపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి

సీబీఐ దర్యాప్తుతోనే నిజానిజాలు నిగ్గు తేలుతాయి

విజయవాడ సీపీ పాత్రపై అడుగడుగునా అనుమానాలు

పోలీస్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేస్తేనే విచారణ ముందుకు

తేల్చి చెప్పిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

లోపభూయిష్టంగా సీఐ నాగరాజుపై ఎఫ్‌ఐఆర్‌

సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చింది టాస్క్‌ ఫోర్స్‌

ఎవరి టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఆ పని చేశారు?

ఎన్‌బీడబ్ల్యూ ఉంటే కోర్టులో ఎందుకు హాజరుపర్చలేదు?

ప్రెస్‌మీట్‌లో నిలదీసిన అంబటి రాంబాబు 

తాడేపల్లి: విజయవాడ పోలీసుల చేతిలో చనిపోయిన గాదె సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబును సస్పెండ్‌ చేయాలని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చే«శారు. అసలు సాయికృష్ణను తీసుకురావాలని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులను మార్కాపురం పంపింది ఎవరో తేల్చాలని ఆయన కోరారు. ఈ కేసులో నాగరాజుతో పాటు చాలా మంది పెద్దల పాత్ర ఉందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు అన్నారు.
ప్రెస్‌ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే..:

- సాయికృష్ణ కేసులో పోలీసుల మౌనం వెనుక?:
    

విజయవాడలో గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్, అలాగే పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రక్షించాల్సిన పోలీసు స్టేషన్‌లోనే నేరస్తులుగా ముద్ర వేసి భక్షించే కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరం. చిత్రమేమిటంటే.. కొట్టారు, చంపేశారు. ఇక్కడ ఉద్దేశం ఏంటనేది దర్యాప్తులో తేలాలి. సాక్ష్యాధారాలు లేకుండా డెడ్‌ బాడీని బూడిద చేశారనే ఆరోపణ. ఇలా బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదనేది నా అభిప్రాయం. మన రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన జరుగుతుందా లేక భీతావహ పాలన జరుగుతుందా అనే అనుమానం కలుగుతోంది. 
    రాష్ట్ర రాజధాని విజయవాడలో నడిబొడ్డున ఇంత దారుణమైన ఘటన జరిగితే 45 రోజుల వరకూ ఎవరూ మాట్లాడింది లేదు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చాక మే 23న చనిపోతే, 24న దహనం చేశారనే సమాచారం ఉంది. ఇందులో వాస్తవం ఏమిటన్నది చెప్పాల్సింది పోలీసులే. కానీ, కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకూ అందరూ నోటికి ప్లాస్టర్‌ వేసుకున్నారు. 

- నాగరాజును కాపాడేలా పోలీసుల చర్యలు:
    
కృష్ణలంక సీఐ నాగరాజుపై కేసు నమోదు చేశారు. కానీ, ఆ ఎఫ్‌ఐఆర్‌ చూస్తే ఆయనకు సహాయం చేసేందుకే లోపభూయిష్టంగా తయారు చేసినట్లు కనిపిస్తోంది. సాయికృష్ణను మార్కాపురం వెళ్లి తీసుకొచ్చింది టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు. అక్కడ నాగరాజు పాత్ర లేదు. టాస్క్‌ఫోర్స్‌ నేరుగా కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్‌ ఆదేశాలు లేకుండా టాస్క్‌ ఫోర్స్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. కమిషనర్‌ ఆదేశాలు లేకుండా, సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తీసుకొస్తే వాళ్లు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినట్లే. అంటే కమిషనర్‌ ప్రమేయంతోనే సాయికృష్ణను తీసుకొచ్చారు.
    కొత్తగా ఏదైనా నేరారోపణ అతనిపై ఉందా లేక నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఉందా? అతనిపై కేవలం 2 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  కాబట్టి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇచ్చారంటున్నారు. అప్పుడు సాయికృష్ణను తీసుకొచ్చిన 24 గంటల్లో కోర్టులో హాజరుపర్చాలి. అసలు అరెస్టు మెమో ఏమైనా ఉందా? కుటుంబానికి సమాచారం ఇచ్చారా? వైద్య పరీక్షలు చేయించారా? కోర్టు ముందు హాజరు పర్చారా?. అంటే  ఏమీ లేదు. అసలు సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మార్కాపురం నుంచి ఎందుకు తీసుకొచ్చారు? కృష్ణలంక పోలీసులకు ఎందుకు అప్పగించారు? ఆ తర్వాత ఏం జరిగింది? వీటన్నింటికీ విజయవాడ సిటీ కమిషనర్‌ (సీపీ) బదులివ్వాలి. కానీ, ఆయన నోరు విప్పకుండా ఇష్టారాజ్యంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

- టాస్క్‌ ఫోర్స్‌ చర్యలకు కమిషనర్‌దే బాధ్యత:

    మాకున్న సమాచారం మేరకు సాయికృష్ణ ఘటనకు బాధ్యత వహించాల్సింది విజయవాడ పోలీసు కమిషనరే. నాగరాజుపై ఆరోపణలు ఆ తర్వాత. నాగరాజు ఒక్కడే కాదు, అనేక మంది ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నాగరాజును తప్పించే ప్రయత్నం జరుగుతోంది. నాగరాజుపై కానీ, కమిషనర్‌ పైనా మాకు ఎలాంటి కోపం లేదు. ఓ వ్యక్తిని చంపి మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇందులో వాస్తవాలు నిగ్గు తేలకపోతే వ్యవస్థలు ప్రమాదంలో పడతాయి. 
    అసలు సాయికృష్ణ బతికే ఉన్నాడా? లేక చనిపోయాడా? అనేది ఇప్పటివరకూ పోలీసులు ఎందుకు బయటపెట్టరు. అన్ని విషయాలూ మేమే చెప్పాల్సి వస్తోంది. పోలీసులు ఇప్పటివరకూ నోరు విప్పకపోవడం వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. కుటుంబ సభ్యుల్ని పిలిపించుకుని ప్రభుత్వ పెద్దలు ఓదారుస్తున్నారు. 
    మృతుడి తల్లి 19వ తేదీన ఫిర్యాదు చేసింది. జగన్‌గారు 18న వెళ్లి ఆమెను పరామర్శించి, ఇది అన్యాయం, అక్రమం అని చెప్పిన తర్వాత 19న ఆమెను పిలిపించుకుని, ఫిర్యాదు తీసుకుని విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ నేరం పోలీసులు చేశారా, టాస్క్‌ ఫోర్స్‌ చేస్తే తిరిగి అదే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంటే దొంగ చేతికి తాళం ఇస్తున్నట్లే. కేసు దర్యాప్తులో ఇన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టే, సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

- కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాల్సిందే:

    పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే సీఐ నాగరాజును ఇప్పటివరకూ ఎందుకు అరెస్టు చేయలేదు, ఆయనేమీ విదేశాలకు వెళ్లిపోలేదు కదా. ఆయన్ను అరెస్టు చేసి విచారిస్తే పెద్ద పెద్ద వాళ్ల పేర్లు బయటికి వస్తాయని భయపడుతున్నారు. అసలు ఆయన్ను అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కొందరు ఆందోళనలు చేస్తున్నారు. ఆయన నిజాయితీ పరుడు కాబట్టి తప్పు చేసినా ఫర్వాలేదు, అరెస్టు చేయొద్దంటున్నారు. అంటే ఇది పోలీసులు ఆడిస్తున్న డ్రామా అనే కదా. ఇది సమాజానికి ప్రమాదకర ఘటన. అతన్ని అరెస్టు చేయాల్సిందే, విచారించాల్సిందే. రాష్ట్రంలో రాజకీయ నాయకుల్ని, నేరస్తుల్ని ఎన్నోసార్లు అరెస్టు చేస్తున్నారు, కస్టడీలోకి తీసుకుంటున్నారు. నాగరాజును మాత్రం ఎందుకు అరెస్టు చేయరు, మీరే విచారిస్తున్నారు కాబట్టి పోలీసులకు చట్టాలు వర్తించవని అనుకుంటున్నారు.
    అలాగే క్రాంతికుమార్‌ మే 21న ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు అనుమానాస్పద మృతి అని కేసు పెట్టారు. ఆ తర్వాత వీడియో బయటికి వచ్చిన తర్వాత తండ్రి ఫిర్యాదు చేసినా కేసులో ఎందుకు మార్పులు చేయలేదు. అందుకే ఈ కేసులోనూ సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే. ఈ బాధ్యతల నుంచి ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినా తప్పించుకోలేరు.
    విజయవాడ పోలీసు స్టేషన్లో చట్టాలు అమలు కాకుండా వ్యక్తుల్ని భక్షించే కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి మార్కాపురం నుంచి సాయికృష్ణను తెచ్చిన టాస్క్‌ ఫోర్స్‌ సిబ్బంది ఎవరో బయటపెట్టాలి. కమిషనర్‌ ను వెంటనే సస్పెండ్‌ చేయాలి. ఆయన ప్రోద్భలంతోనే టాస్క్‌ ఫోర్స్‌ మార్కాపురం వెళ్లి తెచ్చింది కాబట్టి, ఆయన్ను సస్పెండ్‌ చేసి విచారిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు.

- పవన్‌ వైఖరి దురదృష్టకరం:
    
మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు ఈ కేసుల మీద ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు?. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించుకుని న్యాయం చేస్తామని హామీ ఇస్తారు. మరోవైపు పవన్‌కళ్యాణ్‌ మాత్రం, సాయికృష్ణ క్రిమినల్‌ అని, అతను చనిపోతే స్పందించాలా? అని అంటున్నారు. అంటే, సీఎం, డిప్యూటీ సీఎం మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఏర్పడిందా? లేక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఏదేమైనా పవన్‌కళ్యాణ్‌ వైఖరి చాలా దురదృష్టకరమని అంబటి రాంబాబు అన్నారు.
 

Back to Top