నంద్యాల: రైతుల సంక్షేమం కోసం కేటాయించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ స్థలంలో అధికార టీడీపీ కార్యాలయ నిర్మాణం చేపట్టడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రశ్నించారు. నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు చెందిన రెండు ఎకరాల స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మార్కెట్ యార్డ్‌కు మొత్తం 11 ఎకరాల స్థలం ఉండగా, అందులో రెండు ఎకరాలను ఎకరాకు నెలకు కేవలం రూ.83 చొప్పున 33 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని నామమాత్రపు లీజుతో రాజకీయ పార్టీకి కట్టబెట్టడం ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టడమేనన్నారు. రైతుల అవసరాలకు ఉపయోగపడాల్సిన స్థలం భవిష్యత్తులో మార్కెట్ యార్డ్ విస్తరణ, రైతులకు అవసరమైన మౌలిక వసతులు, వ్యవసాయ అనుబంధ సదుపాయాల కల్పనకు ఈ స్థలం ఎంతో అవసరమవుతుందని శిల్పా రవి పేర్కొన్నారు. రైతుల కోసం ఉపయోగించాల్సిన విలువైన స్థలాన్ని రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీకి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే అందుకోసం రైతులకు చెందిన మార్కెట్ యార్డ్ స్థలాన్ని వినియోగించడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయాన్ని పునఃపరిశీలించి రెండు ఎకరాల కేటాయింపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల హక్కులు, మార్కెట్ యార్డ్ స్థల పరిరక్షణ కోసం న్యాయపోరాటానికి సిద్ధమవుతామని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హెచ్చరించారు.