తాడేపల్లి: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి జేబులు నింపుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నైజమని వైయస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మండిపడ్డారు. రూ. 1 లక్ష కోట్ల విలువైన ఆర్టీసీ డిపోలు, భవనాలు, మౌలిక సదుపాయాలను ఎలక్ట్రిక్ బస్సుల (EV) నిర్వహణ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆధారాలతో సహా ఆరోపించారు. వైయస్.జగన్ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆదుకుంటే.. చంద్రబాబు మాత్రం సంస్థను దివాళా తీయించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ లీజు ప్రక్రియను విరమించుకోకపోతే రానున్న సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. విద్యాసంస్థలతో పాటు మిగిలిన వ్యవస్థలను ప్రైవేటుపరం చేసే దిశగా అడుగులు వేస్తున్న చంద్రబాబు, పేదవాడి జీవన చక్రంగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)ని కూడా ప్రైవేటీకరణ చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. తాము ఈ ఆరోపణలు ఊరికే చేయడం లేదని, అన్ని రకాల ఆధారాలతోనే మాట్లాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. ఉద్యోగులు, బస్సుల సంఖ్య తగ్గింపు.. ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్టీసీని ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం ఆ పని చేయకుండా పూర్తిగా చేతులెత్తేసింది.( చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్న తీరు గణాంకాలతో సహా వివరించిన గౌతం రెడ్డి). ఉద్యోగుల తగ్గింపు: ఆర్టీసీలో 59,300 మంది కార్మికులు గతంలో పనిచేస్తుంటే, నేడు ఆ సంఖ్య 42,000కు పడిపోయింది. అంటే దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలు తగ్గిపోయాయి. కొత్త ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? పాతవారితోనే ఎందుకు వెట్టిచాకిరీ చేయిస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో 12,500 బస్సులు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 10,700 కి తగ్గింది. దాదాపు 1800 బస్సులు తగ్గిపోయినా కొత్త బస్సులు కొనుగోలు చేయడం లేదు. 15 సంవత్సరాలు దాటిన సుమారు 600 బస్సులు స్క్రాప్‌కు వెళ్లకుండా ఇంకా రోడ్లపైనే నడుస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. 2027 నాటికి మరో 2 వేల బస్సులకు కాలం చెల్లిపోతుంది. అంటే వచ్చే ఏడాది నాటికి ఆర్టీసీలో కేవలం 8 వేల బస్సులు మాత్రమే మిగులుతాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. జగన్ హయాంలో ఆర్టీసీ వైభవం.. కూటమి నేతల క్రెడిట్ చోరీ. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వైయస్.జగన్ హయాంలో ఆర్టీసీని ఏరోజూ నిర్లక్ష్యం చేయలేదు. 2023లో దాదాపు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి వారి జీవితాల్లో జగన్ వెలుగులు నింపారు. రూ.700 కోట్ల వ్యయంతో 1459 కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల అనంతరం ఆ బస్సులు డిపోలకు వస్తే.. వాటిని తామే తెప్పించామంటూ కూటమి నేతలు "క్రెడిట్ చోరీ"కి పాల్పడుతున్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంతో పాటు ఆర్టీసీకి ఉన్న రూ.2500 కోట్ల పాత బకాయిలను జగన్ ప్రభుత్వమే చెల్లించింది. 'స్త్రీశక్తి' భారం ఆర్టీసీపైనే.. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న 'స్త్రీశక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. 25 లక్షల మంది మహిళలు వాడుకుంటున్న ఈ స్కీమ్‌కు రూ.250 కోట్లు ఖర్చవుతుంటే, ప్రభుత్వం కేవలం రూ.160 కోట్లు మాత్రమే ఇస్తూ.. మిగిలిన భారాన్ని ఆర్టీసీపైనే నెట్టేసి సంస్థను దివాళా తీయించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈవీ మిషన్ల పేరిట డిపోల లీజు.. కాలుష్య నివారణ పేరిట ఎలక్ట్రిక్ బస్సులు (EV) తీసుకువచ్చే నెపంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు రూ. 1 లక్ష కోట్ల విలువైన ఆర్టీసీ డిపోల స్థలాలు, భవనాలు, మౌలిక సదుపాయాలను ప్రైవేటు వ్యక్తులకు 99 ఏళ్ల లీజుకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. విజయవాడ విద్యాధరపురం బస్ డిపోను ఇప్పటికే ఖాళీ చేసి ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా ఈవీ మిషన్లు, ల్యాండ్, కరెంట్ వసతులు కల్పించడమే దీనికి నిదర్శనం. ఈవీ మిషన్ల కోసం ప్రభుత్వం రూ.80 కోట్లు ఇస్తే, ఆర్టీసీ నుంచి మరో రూ.9 కోట్లు పెట్టాల్సి వస్తోందని, ఆ నిధులు లేవనే సాకుతో మొత్తానికే ప్రైవేటీకరణకు పూనుకున్నారు. దీని వెనుక ఉన్న లబ్ధిదారుల పేర్లతో సహా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి, ఏ మంత్రితోనైనా చర్చకు సిద్ధం. చంద్రబాబు పాత నాటకం.. ఎండీ, చైర్మన్ ల గూడుపుఠాణీ.. ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబు ఆడుతున్న నాటకాలు కొత్తవేమీ కాదు. 1999-2004 మధ్య కాలంలో హైదరాబాద్, విజయవాడ ప్రధాన రహదారులను ప్రైవేటీకరణ చేశారు. 2014-2019 మధ్య కాలంలో అద్దె బస్సుల విధానాన్ని తెచ్చారు. ఇప్పుడు పీపీపీ (PPP) విధానం పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను తెస్తూ డిపోలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ కుట్రలకు అనుకూలంగా టీడీపీ అనుబంధ కార్మిక పరిషత్ సంస్థకు చెందిన ఎస్.వి. శేషగిరిరావు, వై. శ్రీనివాసరావులను కన్వీనర్, కో-కన్వీనర్లుగా వేసి జేఏసీ (JAC) ఏర్పాటుకు డ్రామాలు ఆడుతున్నారు. ఈ విషయాలపై వైయస్సార్ ట్రేడ్ యూనియన్ తరపున ఆర్టీసీ ఎండీ, చైర్మన్‌లను కలిసి నిరసన తెలపగా.. చైర్మన్ నేరుగా సమాధానం చెప్పకుండా 'పరిశీలించి చెబుతాం' అనడం చూస్తుంటే ప్రభుత్వం ఏదో పెద్ద గూడుపుఠాణీ చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. వైయస్సార్సీపీ ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదు, 8 వేల బస్సులు వచ్చినా స్వాగతిస్తాం, కానీ ఆ నెపంతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వైయస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు? "నాడు ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇవాళ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తుంటే, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదు?".ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ మేల్కొని ఎన్డీయే పెద్దలతో మాట్లాడి ఆర్టీసీ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి. రాబోయే సోమవారమే డెడ్‌లైన్: ప్రత్యక్ష పోరాటానికి పిలుపు ఈ నేపధ్యంలో ఆర్టీసీ ఆస్తులను 99 ఏళ్ల లీజుకు ఇచ్చే ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలి. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 11 వేల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. రాబోయే సోమవారం లోగా ప్రభుత్వం నుంచి దీనిపై సరైన ప్రకటన రాకపోతే.. ట్రేడ్ యూనియన్ తరఫున ప్రతి జిల్లాలో కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అప్పటికీ స్పందన లేకుంటే మిగిలిన కార్మిక సంఘాల (Trade Unions) సహకారంతో ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం ఖాయమని పూనూరు గౌతంరెడ్డి హెచ్చరించారు.