తాడేపల్లి : వైయస్ఆర్‌సీపీలో మాజీ సైనికుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాజీ సైనికులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలను పార్టీ నాయకత్వంతో పంచుకున్నారు. సమావేశానికి వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, దేశానికి సేవలందించిన మాజీ సైనికులు ఇప్పుడు సమాజ సేవ కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు. వారి అనుభవం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను సమాజాభివృద్ధికి వినియోగించాలనే ఉద్దేశంతో వైయస్ఆర్‌సీపీలో ప్రత్యేక మాజీ సైనికోద్యోగుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాజకీయాలను ప్రజల సంక్షేమం, అభ్యుదయానికి సాధనంగా మాత్రమే భావించే నాయకుడు వైయస్ జగన్ గారు అని పేర్కొంటూ, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యమని అన్నారు. మాజీ సైనికుల సేవలను పార్టీ నిర్మాణంలో ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవాలన్న దానిపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఒక అడ్‌హక్ కమిటీ ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాజీ సైనికులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ వేదికపైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మంచి సమాజ నిర్మాణంలో మాజీ సైనికుల పాత్ర కీలకమని, వారి సహకారంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నదే పార్టీ ఆలోచన అని తెలిపారు. రెండు నుంచి మూడు నెలల్లో మరోసారి సమావేశం నిర్వహించి, సంస్థాగత బలోపేతం, ప్రజా కార్యక్రమాలపై సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు. మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: లేళ్ల అప్పిరెడ్డి మాజీ సైనికుల సేవలను పార్టీ నిర్మాణంలో భాగం చేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు లక్షా పదివేల మంది మాజీ సైనికులు ఉన్నారని, వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి అనుభవం, నాయకత్వ సామర్థ్యాలను సమాజాభివృద్ధికి వినియోగించాలన్నదే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురవేయాలన్న సంకల్పంతో పనిచేయాలని, అందులో మాజీ సైనికులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాజీ సైనికులు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సమస్యలు, విధానాలను ప్రజల దృష్టికి తీసుకురావడంలో ముందుండాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ సైనికోద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ సైనికుల సంక్షేమం, ఉపాధి, పునరావాసం తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. పార్టీ అనుబంధ విభాగాల మాదిరిగానే మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, పార్లమెంట్, నియోజకవర్గ స్థాయిల వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాజీ సైనికోద్యోగులందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి వారి సామర్థ్యాలను ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించే దిశగా ముందుకు సాగుదామని పిలుపునిస్తూ, పార్టీ బలోపేతంలో ప్రతి మాజీ సైనికుడు భాగస్వామి కావాలని లేళ్ల అప్పిరెడ్డి కోరారు.