కూటమి పాలనలో దేవాలయాల్లో వరుస దోపిడీలు.. 

దేవాదాయ శాఖలో గోల్‌మాల్ 

వైయస్‌ఆర్‌సీపీ నేతల మండిపాటు

రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న హుండీ చోరీలు, దేవాదాయ శాఖలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై విజయవాడ నగరంలోని గొల్లపూడిలో ఎండోమెంట్ కమిషనర్‌కు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

దేవాదాయ శాఖ అక్రమాలపై ఎండోమెంట్ కమిషనర్‌కు రెండు ఫిర్యాదులు అందజేశాం

హుండీ చోరీలు జరుగుతున్నా సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు స్పందించడం లేదు?

భక్తుల రాక పెరిగినా హుండీ ఆదాయం తగ్గడంపై అనుమానాలు.

దేవాదాయ భూముల పరిరక్షణకు వైయ‌స్ఆర్‌సీపీ న్యాయపోరాటం కొనసాగుతుంది.

అర్చకులు, వేద పండితులకు రక్షణ కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

చర్యలు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీ పోరాటం.

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్ప‌ష్టీక‌ర‌ణ‌

విజ‌య‌వాడ‌:  రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న హుండీ చోరీలు, హుండీ ఆదాయం తగ్గుదల, దేవాదాయ శాఖలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మంగళవారం విజయవాడ నగరంలోని గొల్లపూడిలో ఎండోమెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల భద్రత, దేవాదాయ శాఖ పరిపాలనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
మీడియాతో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఏమ‌న్నారంటే..

  - సీఎం, డిప్యూటీ సీఎం మౌన‌మేలా? : మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు 
పరకామణి ఘటనపై గతంలో తీవ్రంగా స్పందించిన చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వరుస చోరీలు జరుగుతున్నా ఎందుకు మౌనం పాటిస్తున్నారు? సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ ప్రక్షాళన దీక్షలు, హిందూ డిక్లరేషన్‌ గురించి మాట్లాడిన పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు దేవాదాయ శాఖలో జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదు? దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై కూడా అదే స్థాయిలో స్పందించాలి. దేవాదాయ శాఖ భూములను అక్రమంగా కేటాయిస్తున్నారు. కొన్ని భూములను కోర్టుల ద్వారా కాపాడగలిగాం. మిగిలిన దేవాదాయ భూముల పరిరక్షణ కోసం కూడా వైయస్‌ఆర్‌సీపీ న్యాయపోరాటం కొనసాగిస్తుంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అపచారాలను ప్రభుత్వం వెంటనే ఖండించి, దేవాలయాల భద్రతను బలోపేతం చేయాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.  

- దేవాలయాల్లో హుండీల గోల్‌మాల్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 
దేవాదాయ శాఖలో జరుగుతున్న అక్రమాలపై ఇవాళ‌ ఎండోమెంట్ కమిషనర్‌కు రెండు వినతిపత్రాలు అందజేశాం. అమ్మవారి దేవస్థానంలో అర్చకులు, వేద పండితుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశాం. ఫిర్యాదులు ఉన్నా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. అర్చకులు, వేద పండితులను అవమానించిన ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి.

ఇది పరిపాలనా వైఫల్యమా? లేక హుండీల వ్యవహారంలో గోల్‌మాల్ జరుగుతోందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి.  అమ్మవారి దేవస్థానంలో టికెట్ రీసైక్లింగ్, హుండీల భద్రత లోపాలు, వరుస చోరీలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దేవాలయాల్లో జరిగిన బంగారం చోరీలు, హుండీ దోపిడీలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో హుండీ చోరీలు, బంగారం మాయమైన ఘటనలు, దేవాదాయ భూముల ఆక్రమణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అమరావతి సహా పలు ప్రాంతాల్లో దేవాదాయ భూములను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైంది. దేవాలయాల ఆస్తులను పరిరక్షించి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

తిరుమలలో వేద పారాయణ పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలి. బ్రాహ్మణ కార్పొరేషన్‌, గరుడా స్కీమ్‌లను నిర్లక్ష్యం చేయకుండా అమలు చేయాలి. హుండీ ఆదాయం తగ్గడానికి గల కారణాలు, దేవాదాయ శాఖలో వెలుగుచూస్తున్న అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే వైయస్‌ఆర్‌సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది.

Back to Top