సంక్షోభంలో వ్యవసాయం.. రైతులను ఆదుకునేది ఎప్పుడు?

ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా బకాయిలతో రైతులు తీవ్ర ఇబ్బందులు

రైతు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవు: అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం:  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ  అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, నాణ్యమైన విత్తనాలు, సాగునీరు వంటి కనీస అవసరాలు కూడా అందించడం లేదని మండిపడ్డారు. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రెండేళ్లుగా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా అందలేదు

వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ఎప్పటికప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా అందించగా, ప్రస్తుతం రెండేళ్లుగా రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలోనే వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన రూ.120 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రైతులతో బీమా ప్రీమియం చెల్లింపులు చేయించుకుని కూడా పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించి వారికి మానసిక ధైర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఖరీఫ్‌లో బీడుగా 7.10 లక్షల ఎకరాలు.. రైతుల ఆత్మహత్యలు పెరిగాయి

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటినా జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంలో అత్యల్పంగా మాత్రమే సాగు జరిగిందని, అధికారిక లెక్కల ప్రకారమే 7.10 లక్షల ఎకరాలు ఇంకా బీడుగానే ఉన్నాయని తెలిపారు. నాసిరకం విత్తనాలు, ఎరువుల ధరల పెరుగుదల, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం జిల్లాలో 75 మంది రైతులు, ఉమ్మడి జిల్లాలో 160 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఒక్క రైతు కుటుంబానికీ ప్రకటించిన రూ.7 లక్షల ఆర్థిక సాయం అందలేదని విమర్శించారు.

హంద్రీనీవా నీళ్లు ఎక్కడ?.. తాగునీటికీ కష్టాలు తప్పవు

హంద్రీనీవా ద్వారా 52 టీఎంసీల నీరు తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నా, ఒక్క ఎకరాకైనా సాగునీరు అందించారా అని అనంత వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు. నీటి వినియోగంపై ప్రభుత్వం కనీస సమీక్ష కూడా నిర్వహించడం లేదని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో సాగునీటితో పాటు తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, కరువు పరిస్థితులను ఎదుర్కొనే కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు, రైతు కూలీలు, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.
 

Back to Top