పొగాకుకి రూ. 320లు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాలి

రూ. వెయ్యి కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేయాలి

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ నాయ‌కులు, రైతు సంఘాలు 

వెయ్యి ట్రాక్ట‌ర్ల‌తో రైతుల భారీ ర్యాలీ అనంత‌రం జంగారెడ్డిగూడెంలో బ‌హిరంగ స‌భ  

జంగారెడ్డిగూడెం: పొగాకు పంట‌కు గిట్టుబాటు ధ‌ర రూ. 320 లు చెల్లించాల‌ని, వెయ్యి కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు పంట‌ను కొనుగోలు చేయాల‌ని వైఎస్సార్సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో నిర్వ‌హించిన పొగారు రైతుల మ‌హాధ‌ర్నాలో వైఎస్సార్సీపీ నాయ‌కులు పాల్గొని రైతుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న అన్యాయంపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు సీఎం అయిన ప్ర‌తిసారీ రైతుల‌కు వెన్నుపోటు పొడవ‌డం రివాజుగా మారింద‌ని మండిప‌డ్డారు. ఎన్నిక‌ల్లో మోస‌పు హామీలు గుప్పించ‌డం, గెలిచాక వెన్నుపోటు పొడవ‌డ‌మే త‌న నైజమ‌ని రెండేళ్ల పాల‌న ద్వారా చంద్ర‌బాబు మ‌రోసారి రుజువు చేసుకున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తేడాది రూ. 460లు ప‌లికిన కేజీ పొగాకు ఇప్పుడు రూ.260ల‌కు మించి ప‌ల‌క‌డం లేద‌ని, కేజీకి ఏకంగా రూ. 200లు న‌ష్ట‌పోతున్నార‌ని వివ‌రించారు. ఇలాగైతే రైతులు వ్య‌వ‌సాయం ఎలా చేస్తార‌ని బ‌హిరంగ స‌భ‌లో నాయ‌కులు ప్ర‌శ్నించారు. 2025-26 పొగాకు సీజన్ ప్రారంభమై సుమారు 100 రోజులు దాటినా నేటికీ గరిష్ట ధర రూ. 265 లకు మించి ప‌ల‌క‌డం లేద‌ని చెప్పారు. రైతులు తెచ్చిన పొగాకు బేళ్ల‌లో 40శాతం వెన‌క్కి వెళ్తుండ‌టంతో రైతాంగం తీవ్రమైన నిరాశలో కూరుకుపోయింద‌ని అన్నారు. ముఖ్యం గా J స్టైల్, lemon, 5, 6 క్వాలిటీ పొగాకును కూడా కొనకుండా అనేక సాకులు చెబుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సీజన్ లో స‌గ‌టున రూ. 320 ల‌కు కొనుగోలు చేసినా బేర‌న్‌కి రూ. 5 లక్షలు నష్ట పోయే ప‌రిస్ధితి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అంత‌కుముందు సుమారు వెయ్యి ట్రాక్ట‌ర్ల‌తో రైతులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్సార్సీపీ నాయ‌కుల‌తోపాటు క‌మ్యూనిస్ట్ పార్టీల నాయ‌కులు, రైతు సంఘాల నాయ‌కులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

కార్య‌క్ర‌మంలో తూర్పు గోదావ‌రి జిల్లా వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, మాజీ ఎమ్మెల్యేలు గువ్వ‌ల బాల‌రాజు, జ‌క్కంపూడి రాజా, దూలం నాగేశ్వ‌ర‌రావు, చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇన్‌చార్జి కంభం విజ‌య‌రాజు, ఏలూరు అసెంబ్లీ స‌మ‌న్వ‌య‌క‌ర్త మామిళ్లప‌ల్లి జ‌య‌ప్ర‌కాశ్ (జెపి), రైతు సంఘం నాయ‌కుడు రామారావు (బాబి), వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, త‌దిత‌రుల‌తోపాటు క‌మ్యూనిస్ట్ పార్టీల‌కు చెందిన‌ నాయ‌కులు, రైతు సంఘాల నాయ‌కులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా వారు ఏం మాట్లాడారంటే...   

రైతుల‌ను వేధిస్తున్న ప్ర‌భుత్వానికి పుట్ట‌గ‌తులుండ‌వు
- జ‌క్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే 

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక పొగాకు రైతు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఏటా పొగాకు ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా దాదాపు రూ. ల‌క్ష కోట్లు లాభాలు వ‌స్తున్నా, దాన్ని పండిస్తున్న రైతుల బాధ‌ల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు రాక రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నా విజ‌న‌రీన‌ని చెప్పుకునే చంద్ర‌బాబుకి చీమ‌కుట్టిన‌ట్ట‌యినా లేదు. వ్య‌వ‌సాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏనాడూ రైతుల స‌మ‌స్య‌ల‌పై స్పందించిన పాపాన పోలేదు. రైతుల ప‌క్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుంటే అక్ర‌మ కేసులు పెట్టి జైళ్ల‌కు పంపించ‌డం, కోర్టుల చుట్టూ తిప్పాల‌నే ఆలోచ‌న త‌ప్ప‌, ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌డం లేదు. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డ‌మే పాప‌మైపోయింది. ఎన్నిక‌ల‌కు ముందు నోటికొచ్చిన హ‌మీలు గుప్పించి, అధికారంలోకి వ‌చ్చాక వాటి గురించి ప్ర‌శ్నిస్తుంటే గొంతునొక్కుతున్నారు. రైతుల‌ను వేధిస్తున్న ప్ర‌భుత్వానికి పుట్ట‌గ‌తులుండ‌వ‌నే విష‌యం చంద్రబాబు గుర్తుంచుకోవాలి.  

క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ. 300 చెల్లించాలి
- చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, మాజీ మంత్రి 

వైఎస్సార్ ఆశ‌యాల‌తో ఏర్పడిన పార్టీ వైఎస్సార్సీపీ. రైతుల‌కు క‌ష్టం వ‌స్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతులను ఆదుకోవ‌డం చేత‌కాక వ‌రి పంట‌లే పండిచొద్ద‌ని చెబుతున్నారు. రైతుల పొలాలు లాక్కుని ప్రైవేట్ కంపెనీల‌కు ధారాద‌త్తం చేసే కుట్ర జ‌రుగుతోంది. అందులో భాగంగానే పచ్చ‌ని పంట‌లు పండే భూముల‌ను బీళ్లుగా మార్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. గ‌త వైఎస్సార్సీపీ హ‌యాంలో కేజీ పొగాకు ధ‌ర రూ. 460 లు ఉండగా ఇప్పుడు కనీసం స‌రాస‌రి ధ‌ర రూ. 260లు కూడా ఉండ‌టం లేదు. రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని చెప్పి 2014 చెప్పి మోసం చేసిన చంద్ర‌బాబు, 2024లోనూ మోస‌పు వాగ్ధానాల‌తో అదికారంలోకి వ‌చ్చి ఇప్పుడు కూడా అలాగే వెన్నుపోటు పొడుస్తున్నాడు. పొగాకు పంట‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ. 320లు కేటాయించాలి. 

రెండేళ్లుగా పొగాకు రైతు న‌ష్ట‌పోతూనే ఉన్నాడు
- దూలం నాగేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి రెండేళ్లుగా పొగాకు రైతులు న‌ష్ట‌పోతూనే ఉన్నారు. పెట్టుబ‌డి ఖ‌ర్చులు తడిసి మోపెడైన ప‌రిస్థితులు ఒక ప‌క్క, పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు రాని దుర‌వ‌స్థ‌లు మ‌రోవైపు క‌లిసి.. రైతును కుంగ‌దీస్తున్నాయి. రైతులు   వ్య‌వ‌సాయం చేయ‌లేని దుస్థితి నెల‌కొంది. పొగాకు రైతుల‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర రూ.320లు చెల్లిస్తే త‌ప్ప రైతులు న‌ష్టాల బారి నుంచి బ‌య‌ట ప‌డ‌లేరు. 

చంద్ర‌బాబు, క‌రువు క‌వ‌ల పిల్ల‌లు
- తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే   

మెట్ట ప్రాంతంలో రైతులు మూడు పూటలా అన్నం తింటున్నారంటే పొగాకు సాగు వల్లనే. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రూ. 250 కోట్లు ఇచ్చి పొగాకు రైతులను ఆదుకున్నారు. వైఎస్సార్ వ్యవసాయాన్ని పండుగ చేస్తే చంద్రబాబు దండగ చేశాడు. చంద్రబాబు ముఖ్య‌మంత్రి కావ‌డం రైతుల‌కు శాపంగా ఉంది. క‌రువు, చంద్ర‌బాబు క‌వ‌ల పిల్ల‌లు. చంద్రబాబు ముఖ్య‌మంత్రి అయిన ప్ర‌తిసారీ క‌ర‌వు విల‌య‌తాండం చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా వ‌ర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. రెండేళ్లుగా రైతులకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. ఈరోజు రైతులకి ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఏదీ లేదు. రైతు చేత కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వమైనా తుడిచి పెట్టుకుపోవ‌డం ఖాయం. 

వ్య‌వ‌సాయాన్ని తుద‌ముట్టించే కుట్ర 
- కంభం విజ‌య‌రాజ్‌, చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త  

వ్య‌వ‌సాయాన్ని పూర్తిగా తుద‌ముట్టించే యోచ‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఉంది. రైతుల‌కు క‌నీసం యూరియా కూడా అందించ‌డం లేదు. యూరియా పంపిణీకి వారు తీసుకొచ్చిన యాప్ కార‌ణంగా నిజంగా వ్య‌వ‌సాయం చేసే రైతుల‌కు ఎరువులు అంద‌డం లేదు. త‌క్ష‌ణ‌మే యాప్ ద్వారా యూరియా పంపిణీని ఆపేయాలి. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. కనీసం పెట్టుబ‌డి ఖర్చులు కూడా రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో రైతులు ఉన్నారు. చంద్రబాబు రైతులని పూర్తిగా గాలికి వదిలేశారు. మార్క్ ఫెడ్ ద్వారా రూ. వెయ్యి  కోట్లు కేటాయించి రైతులను ఆదుకోవాలి. 

గ‌తేడాది క‌న్నా కేజీకి రూ.200లు న‌ష్టం 
- వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు 

- కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక వ్యవసాయం దండగ అనే మాట రైతుల‌తోనే అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు. అడుగడుగునా కొనుగోలుదారులు పొగాకు రైతులని మోసం చేస్తున్నారు. గతేడాది రూ.460 ఉంటే ఈ సంవత్సరం రూ.260 ఉంది. కిలోకి రూ.200 నష్టం. వైఎస్ జ‌గ‌న్ గారు సీఎంగా ఉంటే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇచ్చేవారని రైతులు భావిస్తున్నారు. కానీ సీనియ‌ర్‌ని అని చెప్పుకునే చంద్ర‌బాబు రైతు జీవితాలతో ఆడుకుంటున్నాడు. పొగాకు రైతుల కారణంగానే జంగారెడ్డిగూడెం మేజర్ పంచాయతీ నుండి జిల్లాలో పెద్ద మున్సిపాలిటీ గా అభివృద్ధి చెందింది. రైతులు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. 
పొగాకు రైతుల సమస్యలను మాజీ ముఖ్య మంత్రి జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి పోరాటం మరింత ఉధృతం చేస్తాం.

Back to Top