ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర కీలకం

హాలహర్వీలో వైయ‌స్ఆర్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం

హాలహర్వీ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి సూచించారు.

ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వీ మండలం టీ.చాకిబండ, శ్రీధర్ హాల్, బేవినహాల్ గ్రామాల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన వైయ‌స్ఆర్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బీఎల్‌ఏలతో సమావేశమై ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై పలు సూచనలు చేశారు.

బుసినే విరూపాక్షి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీకి బలమైన నిర్మాణం ఉండాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం మమేకమై బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ప్రజా సమస్యల రూపంలో వెలుగులోకి తీసుకురావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, ఓటరు జాబితాలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యంగా వైయ‌స్ఆర్‌సీపీ అనుకూల ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఆలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని, ప్రతి గ్రామంలో పార్టీ కార్యకలాపాలు చురుకుగా కొనసాగించాలని బుసినే విరూపాక్షి తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ మండల కన్వీనర్, కో-కన్వీనర్లు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
 

Back to Top