విజయవాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజాస్వామ్య విలువలు కాలరాయబడుతున్నాయని విజయవాడలోని ఓ హోటల్ లో "పోలీస్ వ్యవస్థ పనితీరు, దిగజారిన శాంతిభద్రతలు" అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఏకగ్రీవంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయవాదులు, సామాజిక విశ్లేషకులు పాల్గొన్నారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలకుల రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యల కోసం పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. పౌరుల జీవించే హక్కును కాలరాస్తూ, రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని లాకప్ డెత్‌ల రూపంలో ప్రాణాలు తీసే స్థాయికి దిగజారిందని చెప్పారు. సాక్షాత్తు హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాల్లోనే మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వైఫల్యాన్ని దాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు లాకప్‌లో జరిగిన సాయికృష్ణ మృతిని దాచడానికి పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజీలు మాయం చేయడం వెనుక కమిషనర్ నుండి డీజీపీ వరకు వ్యవస్థాగత కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఇటీవల విజయవాడలో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్, పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య వంటి ఘోరాలపై రాష్ట్ర పోలీసుల విచారణ నమ్మదగినదిగా లేదని, తక్షణమే వీటన్నింటిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే... ● సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ చేయాలి - అంబటి రాంబాబు, మాజీ మంత్రి దెందులూరులో చింతమనేని ప్రభాకర్ లాయర్ ఇంటిపై దాడి చేస్తే అతనిపై కేసు పెట్టకుండా, బాధితుడైన అడ్వకేట్ శ్రీనివాస్ పైనే రివర్స్‌గా కేసు పెట్టడాన్ని పోలీసులు ఎలా సమర్థించుకుంటారు? మొన్న పెనుమాకలో మాపై రాళ్లు, కోడిగుడ్లు వేసి కార్లు పగలగొట్టిన ఘటనలో బందోబస్తులో ఉన్న ఒక కానిస్టేబుల్ తల పగిలి ఏడు కుట్లు పడినా, నేటికీ టిడిపి గుండాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయలేనంత దయనీయంగా ఉన్నారు. సాయికృష్ణ విషయంలో జూన్ 2న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేస్తే, జూన్ 4న విచారణలో మేము వెతుకుతున్నామని కోర్టును తప్పుదోవ పట్టించారు. కానీ అప్పటికే జూన్ 23-24 తేదీలలోనే అతన్ని చంపేసి దహనం చేసేశారు. ఒక సీఐ నాగరాజు మాత్రమే ఇంతటి పెద్ద కుట్ర చేయడం సాధ్యం కాదు. సీసీ ఫుటేజ్ మాయం చేయడం వెనుక కమిషనర్ నుండి డీజీపీ వరకు మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ పెద్దల హస్తం, అనుమతి ఖచ్చితంగా ఉన్నాయి. కస్టడీ డెత్ జరిగితే రాష్ట్ర పోలీసులు ఆ కేసును విచారించకూడదనే సుప్రీంకోర్టు తీర్పులున్నా పట్టించుకోవడం లేదు. సాయికృష్ణ లాకప్ డెత్, పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఉదంతంపై తక్షణమే సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేస్తున్నాను. ● ఏపీలో బీహార్‌ని మించిన దారుణమైన పాలన - కాకుమాను రాజశేఖర్, వైయస్ఆర్‌సీపీ ప్రచారం విభాగం అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్‌లో బీహార్‌ను మించిన దుర్మార్గమైన పరిపాలన, దాడులు, హత్యలు, దమనాకాండలు సాగుతున్నాయి. సామాన్య ప్రజలు కనీసం బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. విజయవాడ నగరంలో జరిగిన గాదె సాయికృష్ణ ఉదంతంలో పోలీసులు లాకప్ డెత్ చేసి, శవాన్ని మాయం చేసి, కనీసం తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేసుకోవడానికి బూడిద కూడా ఇవ్వకపోవడం అత్యంత కర్కశత్వం. పేరుపోగు క్రాంతి కుమార్‌ను మానసికంగా వేధింపులకు గురిచేయడం వల్లే అతను విషం తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. స్వయంగా హోంమంత్రి అనిత నియోజకవర్గంలో మహిళలపై మానభంగాలు, దాడులు జరుగుతున్నా, డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో బాలికపై అత్యాచారం జరిగినా ప్రభుత్వంలో కదలిక లేదు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఉంటే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ ఒక్కరూ ముందుకు రారు. దీనివల్ల నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. ● ప్రభుత్వ దారుణాలపై చార్జిషీట్ తయారు చేయాలి - మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేసింది. పోలీసులు కేవలం అధికార పార్టీకి కొమ్ముకాసే కీలుబొమ్మలుగా మారిపోయారు. ప్రతిపక్ష నేతలు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లాల పర్యటనలకు వెళ్తుంటే ముందే పర్మిషన్లు క్యాన్సిల్ చేయడం, రైతులు, బాధితుల పక్షాన వెళ్లిన వారిపై రివర్స్‌గా తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గం. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక వ్యక్తిని 40 రోజుల పాటు చిత్రహింసలు గురిచేసి, చంపేసి, సీసీ ఫుటేజీలు మాయం చేసి బస్టాండ్‌లో అనాథ శవంగా మార్చి శ్మశానంలో కాల్చేసినా హోంశాఖ మౌనంగానే ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐఏెస్, ఐపీఎస్ అధికారులుగా పనిచేసిన 12 మందిపై నిర్దాక్షిణ్యంగా నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. భార్యాభర్తల తగాదాల్లో కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడించాల్సిన పోలీసులు, కైకలూరులో నవీన్ కుమార్ అనే వ్యక్తి విషయంలో ఏకపక్షంగా వ్యవహరించి అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, ప్రతిపక్షాల పర్యటనలు, అక్రమ కేసులు, బాధితులపైనే ఎస్సీ అట్రాసిటీ, 307 కేసులు బనాయించడం లాంటి దారుణాలపై ఈ ప్రభుత్వంపై ఒక ఖచ్చితమైన 'చార్జ్ షీట్' తయారు చేయాలి. ● రాష్ట్రంలో సామాజిక అసమానతలు రెచ్చగొడుతున్నారు - మేరుగు నాగార్జున, మాజీ మంత్రి రాజ్యాంగానికి లోబడి ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలన చేయాలి. కానీ మున్నెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక అసమానతలు రెచ్చగొడుతూ హత్యలు, దాడులు జరుగుతున్నాయి. ప్రత్యర్థి వర్గాలపై దాడులు చేయించాలనే తృష్ణ చంద్రబాబు నాయుడి రాజకీయాల్లోనే ఇమిడి ఉంది. శ్రీకాకుళంలో కోన రవికుమార్ అనే టీడీపీ శాసనసభ్యుడు దళిత ప్రిన్సిపాల్‌ను వేధిస్తే ఈరోజుకీ కేసు పెట్టలేదు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలోను, కాకినాడలో పంతం నానాజీ అనే ఎమ్మెల్యే డాక్టర్ ఉమామహేశ్వర రావుపై దాడి చేసినా, రాజమండ్రిలో వ్రతం సాగర్ అనే ఎస్సీ అబ్బాయి బట్టలూడదీసి స్టేషన్‌లో పెట్టినా కేసులు లేవు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే స్పందించి చివరకు తప్పు చేసిన పోలీసుల మీద కూడా కేసులు పెట్టించిన చరిత్ర మాది. బాపట్లలో ఒక దళితుడు టీడీపీ వాళ్లు తన భూమి లాక్కున్నారని వీడియో పెట్టి పురుగుల మందు తాగి చనిపోయాడన్నా, అనంతపురంలో పరిటాల సునీత నియోజకవర్గంలో బాలికపై 14 మంది అఘాయిత్యం చేసినా నేటికీ బాధితులకు న్యాయం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అఘాయిత్యాలపై చర్చ జరగాలి, చార్జ్ షీట్ విడుదల చేయాలి. ఒక పక్క దళిత స్త్రీ హోంమంత్రిగా, దళిత అధికారి ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా ఉండి కూడా నోరు మెదపకపోవడం సిగ్గుచేటు. ● నేరాల్లో బీహార్‌ని మించిపోయిన ఏపీ - విజయకుమార్, మాజీ ఐఏఎస్ ప్రభుత్వం శాంతిభద్రతలు మెరుగయ్యాయని, 6 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని ఎన్సీఆర్‌బీ డేటా చూపిస్తోంది. కానీ ఐపీసీని బిఎన్ఎస్ గా మార్చే క్రమంలో కొన్ని కాగ్నిజబుల్ అఫెన్సెస్‌ను నాన్-కాగ్నిజబుల్ కిందకు మార్చడం వల్లే పేపర్ మీద ఆ లెక్క తగ్గింది తప్ప వాస్తవంగా క్రైమ్స్ తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్ క్యాపిటా క్రైమ్ రేట్ ర్యాంకింగ్స్ ప్రకారం... బీహార్‌లో లక్ష మందికి 302 క్రైమ్స్ రికార్డ్ అవుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 377.5 క్రైమ్స్ రికార్డ్ అవుతున్నాయి. అంటే శాంతిభద్రతలలో ఏపీ బీహార్ కన్నా హీనమైన పరిస్థితిలో ఉంది. ఇటీవల ఇవాంజలిస్ట్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో రోడ్డు పక్కన శవంగా మారితే, దాని వెనుక ఉన్న కుట్రను బయటకు తీయకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెటకారంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు తెలిసే కొన్ని సెటిల్మెంట్స్ జరుగుతాయి. అందుకోసమే రౌడీ షీటర్లను వాడుకుని, పని ముగిశాక వారి ప్రాణాలు పోయినా మాకు సంబంధం లేదన్నట్లు వదిలేస్తున్నారు. పేరుపోగు క్రాంతి కుమార్ చనిపోతూ ఇచ్చిన మరణ వాంగ్మూలంలో... తాను టిడిపి గెలుపు కోసమే డప్పు కొట్టి పని చేశానని, కానీ సిఐ నాగరాజు చేసిన టార్చర్ భరించలేక విషం తాగి చనిపోతున్నానని స్పష్టంగా పేర్కొన్నాడు. ఇంతకన్నా బలమైన సాక్ష్యం చట్టంలో ఏముంది? కసబ్ లాంటి కరుడుగట్టిన టెర్రరిస్ట్‌ను పట్టుకున్నప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా కోర్టు ముందు ప్రవేశపెట్టి ట్రయల్ నిర్వహించి శిక్ష వేశారు. కానీ సాయికృష్ణ విషయంలో చట్టాన్ని చేతిలోకి తీసుకుని చంపేసి, శవం కూడా లేకుండా చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు? ● పోలీస్ డిపార్టుమెంట్‌లో కులాల ప్రకారం పోస్టింగులు - జల్లా రాజేశ్వర్ రెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ నా 34 ఏళ్ల పోలీస్ సర్వీస్‌లో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా 2014 నుండే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కులాల ప్రకారం పోస్టింగులు ఇవ్వడం, వ్యవస్థపై కన్నా కులంపై భక్తి పెంచడం వంటి దరిద్రమైన వ్యవహారాలు మొదలయ్యాయి. 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుండే రాష్ట్రంలో అరాచక పాలన ప్రారంభమై, ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం మొదట డెమోక్రసీపై అటాక్ చేస్తూ, తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసుల బలంతో టీడీపీ గుండాల ద్వారా ఓట్లు వేయించుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు చేసి, పెట్రోల్ బాంబులు వేస్తున్నా కనీసం ఆయా ఏరియా ఎస్సై లేదా ఇన్స్పెక్టర్‌లను కూడా సస్పెండ్ చేయకుండా ప్రభుత్వం వారిని ఎంకరేజ్ చేస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వెళ్లి సాయికృష్ణను ఎందుకు తెచ్చారు? ఎందుకు హింసించి చంపారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కనీసం శవాన్ని, బూడిదను కూడా తల్లికి ఇవ్వకపోవడం దేశంలోనే ఎక్కడా చూడని ఘోరం. ఐపీఎస్ అధికారులు తమ టోపీలను, పవర్స్‌ను రాజకీయ నాయకుల బూట్ల దగ్గర పెట్టేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. డీజీ స్థాయి అధికారులు ఐదారుగురు గట్టి నిర్ణయం తీసుకుంటే ఒక్క వారంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు సెట్ అవుతాయి. ● జీవించే హక్కును ప్రభుత్వం కాలరాస్తోంది - వసుంధర, సామాజిక ఉద్యమకారిణి గత 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు సమాజంలో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గాదె సాయికృష్ణ లాకప్ డెత్ దేశంలోనే అత్యంత హేయమైన చర్చకు దారితీసింది. ప్రధాన మీడియా ఛానళ్లు సాయికృష్ణ క్రిమినాలిటీని చూపిస్తూ చర్చలను పక్కదారి పట్టిస్తున్నాయి తప్ప, చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒక హత్యకు కారణమైన పోలీసులపై చర్చించడం లేదు. అరెస్ట్ చేసిన 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలనే ఆర్టికల్ 22 నిబంధనను తొంగలో తొక్కి, ఒక జీవించే హక్కును కాలరాసి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతోంది. బిడ్డను పోగొట్టుకున్న తల్లి న్యాయం కోసం కాదు, కనీసం కర్మక్రియలు చేసుకోవడానికి తన బిడ్డ బూడిద ఇవ్వమని పోరాడుతుంటే, ప్రభుత్వం ఆమెపై ఒత్తిడి తెస్తూ లాయర్లను మార్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. పేరుపోగు క్రాంతి కుమార్‌ను కూడా మానసికంగా హింసించి ఆత్మహత్యకు ప్రేరేపించడం నా దృష్టిలో ఖచ్చితంగా హత్య కిందే లెక్క. మాల గంగమ్మ విషయంలో కూడా ఇలాంటి అన్యాయమే జరిగింది. ఒక సామాజిక కార్యకర్తగా మాకు ఎలాంటి రాజకీయ అనుబంధాలు లేవు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న లాకప్ డెత్‌లు, శవాల మాయం వంటి అక్రమాలకు వ్యతిరేకంగా పౌర సమాజం ధైర్యంగా గొంతెత్తాలి. ● లాకప్ డెత్‌లకు ఎక్కువగా బలవుతున్నది దళితులు, బీసీలే - ప్రొఫెసర్ రామచంద్రయ్య ప్రాణానికి, ఆస్తికి రక్షణ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేది కాదు. కోర్టులలో కేసులు దశాబ్దాల తరబడి కొనసాగడం వల్ల ప్రజల్లో 'ఇన్‌స్టెంట్ జస్టిస్' (సత్వర న్యాయం) కావాలనే మానసిక స్థితి పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని పోలీసులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. సత్వర న్యాయం పేరిట జరిగే పోలీస్ ప్రతాపంలో బలైపోతున్నది 91 శాతం మంది పేదవాళ్లు, దళితులు, మైనారిటీలు, ఓబీసీ వర్గాలకు చెందినవారేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని దశాబ్దాలుగా జరిగిన లాకప్ డెత్‌ల చరిత్రను చూస్తే అందులో అత్యధికంగా దళిత సామాజిక వర్గాల వారే పోలీసు దాస్టీకానికి బలైపోతున్నారు. ఇక్కడ న్యాయం జరగాలన్నా, అసలు ముద్దాయిల పేర్లు, ఈ ఘటనల వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ బయటకు రావాలన్నా ఈ కేసులపై కేవలం సీబీఐ విచారణ మాత్రమే జరగాలి. సిట్లు, కమిటీలు కేసును నీరుగార్చడానికే పనికివస్తాయి. ఒక సామాజిక మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి చెందిన మహిళ హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు దళితులకు, సామాన్యులకు రక్షణ కల్పించలేనప్పుడు, కనీసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ధైర్యం లేనప్పుడు అనితకి హోంమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కోల్పోయినట్టే. ఆమె వెంటనే రాజీనామా చేయాలి. ● మాజీ మంత్రులపై దాడులు చేసినా కేసు పెట్టలేదే? - కేవీఎం రజని, హైకోర్టు అడ్వకేట్ లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటివ్‌లు కలిసిపోయినప్పటికీ న్యాయవ్యవస్థ బతికి ఉంది కాబట్టే ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతోంది. ప్రతి ప్రమోషన్, ప్రతి ట్రాన్స్ఫర్ ఒక ఎమ్మెల్యేతో కూడుకున్న విషయం కావడం వల్ల చట్టాన్ని రక్షించాల్సిన ఎంఆర్ఓ, డీఎస్పీ స్థాయి అధికారులు ఎమ్మెల్యేల గేట్ల వద్ద చేతులు కట్టుకుని నిలబడే దౌర్భాగ్య స్థితికి వ్యవస్థ చేరింది. పెనుమాకలో రైతులను ఆపడం, నిర్బంధించడం తప్పని అక్కడ డ్యూటీ చేస్తున్న ప్రతి పోలీస్ ఆఫీసర్‌కు తెలుసు. కానీ పొలిటికల్ ప్రెజర్ వల్ల వారు చట్టవిరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కంచెలు తెంచుకుని వచ్చి గట్టిగా ఉద్యమించినప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి అతని రైట్ టు స్పీచ్, రైట్ టు మూవ్‌మెంట్ హక్కులను హరించలేదు. కానీ నేటి కూటమి ప్రభుత్వంలో వయసు రీత్యా పెద్దవారైన మాజీ మంత్రులు రోడ్డు మీదకు వస్తే కోడిగుడ్లు వేయిస్తూ, బండరాళ్లతో కార్లు పగలగొడుతున్నా విజువల్స్ చూస్తూ కూడా కేసులు పెట్టడం లేదు. పోలీసు డిపార్ట్‌మెంట్‌ను కూడా ఎలక్షన్ బాడీ, జుడీషియరీ తరహాలోనే ఒక ఇండిపెండెంట్ బాడీ చేయాలి. ఐదారుగురు డీజీపీలు అనుకుంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు.