తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో తెలుగు అకాడమీ అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ..ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు అకాడమీని కూటమి నాయకులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలను తుంగలో తొక్కి, గత ప్రభుత్వ హయాంలో తిరస్కరించిన బ్లాక్‌లిస్ట్ సంస్థలకు టెండర్లను కట్టబెట్టడం వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హస్తం ఉందని ఆమె మండిపడ్డారు. సిలబస్ పీడీఎఫ్‌ల లీకేజీ నుండి ఔట్ సోర్సింగ్ నియామకాల వరకు అకాడమీలో జరుగుతున్న దారుణమైన అవకతవకలను ఆమె ఎండగట్టారు. అలుక్కున్న ఇంటిని పందికొక్కులు పాడుచేసినట్లు, తాము ఎంతో కష్టపడి నిలబెట్టిన తెలుగు అకాడమీని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ కలిసి నాశనం చేస్తున్నారని, ఈ అక్రమాలపై తాను నిరంతరం పోరాడుతూనే ఉంటానని నందమూరి లక్ష్మీపార్వతి హెచ్చరించారు. ఆమె ఇంకా ఏం మాట్లాడారంటే.. - వైయస్ఆర్‌సీపీ హయాంలో తెలుగు అకాడమీ పునరుద్ధరణ గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి జరిగింది. 2014-19 మధ్య చంద్రబాబు అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేస్తే, 2019లో వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అకాడమీని పునరుద్ధరించి, నన్ను చైర్‌పర్సన్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా 16-06-2020న జీవో నంబర్ 21 ద్వారా అకాడమీని రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా, ఉమ్మడి ఆస్తుల విభజనలో ఏపీకి రావలసిన నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి నాటి జగన్ ప్రభుత్వం గట్టిగా పోరాడింది. తద్వారా దాదాపు రూ. 150 కోట్ల నిధులను సాధించి, తిరుపతి ప్రధాన కేంద్రంగా అకాడమీని లాభాల బాట పట్టించాం. మా హయాంలో మూలధనాన్ని ఒక్క రూపాయి కూడా తాకకుండా 30 నుండి 60 కోట్ల రూపాయల విలువైన పుస్తకాలను అత్యంత పారదర్శకంగా ముద్రించి విద్యార్థులకు అందించాం. - కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడి అవకతవకలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగు అకాడమీని పూర్తిగా భ్రష్టు పట్టించారు. గత ప్రభుత్వ హయాంలో అర్హతల్లేక మూడుసార్లు రిజెక్ట్ అయిన వీజీఎస్, విక్రమ్ వంటి వివాదాస్పద సంస్థలతో మంత్రి నారా లోకేష్ కుమ్మక్కై నిబంధనలు మార్చి మరీ టెండర్లు కట్టబెట్టారు. గతంలో విద్యార్థుల ప్రయోజనాల కోసం పేజీ ముద్రణ ధరను 20 పైసలుగా నిర్ణయిస్తే, ప్రస్తుత పాలకులు దాన్ని 30 పైసలకు పెంచి అక్రమ దోపిడీకి తెరలేపారు. ఇంటర్మీడియట్ సెకండియర్ కొత్త సిలబస్ పీడీఎఫ్ ఫైళ్లను అకాడమీ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కళాశాలలకు రూ. 10 కోట్లకు అమ్ముకుని భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. దీనిపై అకాడమీ కేసు పెట్టినా, మంత్రి లోకేష్ ఒత్తిడితో పోలీసులు కేసును క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ప్రస్తుత చైర్మన్ విల్సన్, డైరెక్టర్లు తమ బంధువులను, స్నేహితులను ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో నియమించుకుని లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు. 'వర్చువల్ అకాడమీ', 'యూట్యూబ్ ఛానల్స్' పేరిట, చివరకు చైర్మన్ ప్రైవేట్ సన్మానాల కోసం కూడా అకాడమీ సొంత నిధులను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణ భారాన్ని అకాడమీపై వేసి, దానికి రావాల్సిన రూ. 50 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం పైసా కూడా చెల్లించకుండా ఎగ్గొట్టింది. దీనివల్ల అకాడమీ పాత ఫండ్స్ కరిగిపోయి దివాలా తీసే స్థితికి చేరుకుందని నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు.