ఆర్టీసీ ఆస్తుల అప్పగింతలు 

డిపోలు ప్రైవేటుపరం బెజవాడ నుంచి మొదలు

 ముందుగా విద్యాధరపురం డిపో కూల్చివేత 

మరో 11 డిపోల కూల్చివేతల పనులు వేగవంతం 

తొలిదశలో రూ.6 వేల కోట్ల ఆస్తులు ధారాదత్తం 

మలి దశలోమరిన్ని ఆస్తులు అన్యాక్రాంతం 

ఉద్యోగ సంఘాల ఆందోళన బేఖాతర్‌ 

ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కారు కుట్రలు 

అమరావతి: విజయవాడలోని విద్యాధ­రపురం ఆర్టీసీ డిపో భూమి ఇది..! దశాబ్దాల­పాటు ఆర్టీసీ వైభవానికి ప్రతీకగా నిలిచిన విద్యాధరపురం డిపో ప్రస్తుతం ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రకు పదును పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం వేసిన తొలి వేటు ఇది! అత్యంత విలువైన ఈ భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు  ప్రభుత్వం ఇలా మార్చేసింది. 

ప్రగతి రథ చక్రం ఆర్టీసీని చావుదెబ్బ తీస్తూ అత్యంత విలువైన సంస్థ ఆస్తులను అస్మదీయ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఆర్టీసీని పరిరక్షించాలన్న 50 వేలమంది ఉద్యోగుల డిమాండ్‌ను నిర్ద్వందంగా తోసిపు­చ్చింది. తొలిదశలో రూ.6 వేల కోట్ల విలువైన 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది.

విద్యాధరపురం డిపో నేలమట్టంతో కుట్రకు శ్రీకారం
ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న కుట్రను విజయవాడ విద్యాధ­రపురం డిపో నుంచి కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీక­రించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం మొదటి దశలో 12 డిపోలను ఎంపిక చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ 12 డిపోలను కూల్చివేసి భూమిని చదును చేసే పనులు ము­మ్మరం చేసింది.

విద్యాధరపురం ఆర్డీసీ డిపోను పూర్తిగా కూల్చివేసి...­శిథిలాలను కూడా తొలగించింది. స్థలాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు వీలుగా సిద్ధం చేసింది. ఇక మిగిలిన 11 డిపోల కూల్చివేత పనులను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. ఆగస్టు నాటికి 12 డిపోలను పూర్తిగా కూల్చివేసి ప్రైవేటు  సంస్థలకు అప్పగించేందుకు వీలుగా సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.

రూ.6 వేల కోట్ల భూములు అన్యాక్రాంతం
రాష్ట్రవ్యాప్తంగా బస్‌ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నుముక. ఆ వెన్నుముకను చంద్రబాబు ప్రభుత్వం విరిచేస్తోంది. రాష్ట్రంలో వేలకోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు పక్కా పన్నాగంతో పావులు కదుపుతోంది. విద్యుత్‌ బస్సు (ఈ–బస్సు)లను ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను అందుకే తిరస్కరించింది. ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల ద్వారానే వాటిని ప్రవేశపెడతామని తేల్చి చెప్పింది. 

అంతేకాదు ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఈ – బస్సులకు చార్జింగ్‌ కేంద్రాలు, గ్యారేజీలు, బస్సులు నిలుపుదల చేసే ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ఆస్తులను కట్టబెట్టాలని నిర్ణయించింది.  అందుకోసం ఆర్టీసీ డిపోలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు గతేడాది డిసెంబరు 29న నిర్వహించిన సమావేశంలో ఆమోదముద్ర వేసింది. మొదటి దశలో రాష్ట్రంలోని 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు వీలుగా ఆ 12 డిపోలను ఫిబ్రవరి నెలాఖరుకే ఖాళీ చేయించింది. ఆ డిపోలను కూల్చివేసి పనులు మొదలు పెట్టింది. 

ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్‌ విలువ రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ రూ.50 కోట్లు చొప్పున లెక్క వేసుకున్నా.. ఆ 12 డిపోల మార్కెట్‌ విలువ ఏకంగా రూ.6,000 కోట్లు...! అంత విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది. రెండో దశలో మరిన్ని డిపోలతోపాటు ఆర్టీసీ బస్‌ స్టేషన్లను కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేస్తోంది.

Back to Top