శ్రీశైలంలో నీరు ఉన్నా రాయలసీమకు ఎందుకు విడుదల చేయడం లేదు.. 

పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్తే అడ్డుకోవడం దారుణం

మాజీ మంత్రి శైలజానాథ్ ఫైర్‌

నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ రాయలసీమకు సాగునీరు విడుదల చేయకపోవడం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి తీవ్రంగా స్పందించారు. రాయలసీమ రైతుల సాగునీటి ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారు కోరారు.

రైతుల గోడు చంద్రబాబుకు పట్టడం లేదు: శైలజానాథ్

“పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం దారుణం. పోతిరెడ్డిపాడు నుంచి దిగువకు 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకెళ్లే అవకాశం ఉన్నా కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. రైతుల గోడు చంద్రబాబుకు పట్టడం లేదు. శ్రీశైలంలో నీరు ఉన్నప్పుడు కిందికి నీరు ఎందుకు విడుదల చేయడం లేదు?

తెలంగాణలో కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, డిండి వద్ద లిఫ్ట్‌ల సామర్థ్యం పెంచితే ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదు? గురు-శిష్యుల మధ్య చీకటి ఒప్పందంతో రాయలసీమను తాకట్టు పెట్టారు. నెల్లూరు, కోస్తా, చెన్నై ప్రాంతాలకు నీరు పోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. రైతు పక్షాన చంద్రబాబు ఎప్పుడైనా నిలబడ్డారా? రెండు కళ్ల సిద్ధాంతంతో రాయలసీమను సర్వనాశనం చేశారు.

రాయలసీమ లిఫ్ట్ వల్ల చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి? తెలంగాణలో 750 అడుగుల వద్దే నీటిని ఎత్తిపోస్తుంటే, రాయలసీమ ప్రజల కోసం పోతిరెడ్డిపాడు వద్ద 875 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు నీటిని ఎందుకు ఇవ్వడం లేదు? రాయలసీమ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారు” అని శైలజానాథ్ అన్నారు.

- పోతిరెడ్డిపాడు చూడటానికి కూడా అడ్డుకుంటారా?: కాటసాని రాంభూపాల్‌రెడ్డి

“పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును చూడటానికి వెళ్తే పోలీసులు అడ్డుకుంటారా? నా రాజకీయ చరిత్రలో ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. శ్రీశైలంలో నీరు ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే ఎలా?

గోరుకల్లు, అవుకు, గండికోట, వెలుగోడు రిజర్వాయర్లకు నీరు ఎప్పుడు వస్తుంది? రిజర్వాయర్లు నింపాలని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వాయర్లను పూర్తిగా గాలికి వదిలేశారు. రైతులకు ఇంకా ఎప్పుడు నీరు ఇస్తారు? రైతుల సాగునీటి అవసరాలను ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలి” అని కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు.

- ఇదేనా ప్రజాస్వామ్యం?: శిల్పా చక్రపాణిరెడ్డి

“పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి? ఇదేనా ప్రజాస్వామ్యం? నీళ్ల కోసం వెళ్తే కూడా అడ్డుకుంటారా? నీరు లేక జలాశయాలు ఎండిపోయాయి. రైతుల సమస్యలను పట్టించుకోని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు రైతుల పక్షాన పోరాడిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆయన చరిత్రలో హీనుడిగా మిగిలిపోతారు. రాయలసీమ లిఫ్ట్‌ను తెలంగాణ వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారు. తెలంగాణ ప్రజలపై ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై చంద్రబాబుకు లేదు” అని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం, రాయలసీమ సాగునీటి అంశంపై నేతలు చేసిన వ్యాఖ్యలు నంద్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. రాయలసీమ రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు కోరుతున్నారు.
 

Back to Top