తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు అత్యంత అధ్వానంగా మారాయని, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఘోరంగా విఫలమయ్యారని మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సొంత విద్యాశాఖను గాలికొదిలేసి మిగతా అన్ని శాఖల్లో వేలుపెడుతూ, దేశ విదేశాల్లో ప్రచారానికే పరిమితమవుతున్నారని ఆయన మండిపడ్డారు. హాస్టళ్లలో కనీసం బాత్రూమ్‌లకు నీళ్లిచ్చే దిక్కులేక, మౌలిక వసతులు కరువై దాదాపు 100 మంది అమాయక విద్యార్థులు మృత్యువాత పడ్డారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... బాత్రూమ్ కూ నీళ్లివ్వలేని దౌర్భాగ్యస్ధితి... రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ పరిశ్రమలు తెస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు కానీ, ఇక్కడ విద్యాశాఖలో ముక్కుపచ్చలారని పేద పిల్లల ప్రాణాలు పోతున్నాయి. గత కొద్ది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 మంది విద్యార్థులు మరణించారు. చనిపోయిన వారిలో 8 నుంచి 13 సంవత్సరాల లోపు వయసున్న పేద పిల్లలే ఎక్కువగా ఉన్నారు. నేను రాజకీయాల కోసం మాట్లాడటం లేదు, అమాయక విద్యార్థుల ప్రాణాలు పోతున్న ఒక మానవీయ కోణంలో మాట్లాడుతున్నాను. విద్యామంత్రి 4 నిమిషాలు ఈ బాత్ రూమ్ ల వద్ద ఉండగలరా? సెట్టూరు మండలం జెడ్పీ హైస్కూల్‌లో బాత్రూమ్‌లు సరిగ్గా లేక పక్కన ఉన్న గోడ చాటుకు కాలకృత్యాల కోసం వెళ్లిన తేజా హర్షవర్ధన్ అనే ఎస్సీ విద్యార్థిపై గోడ కూలి అక్కడికక్కడే చనిపోయాడు. అక్షయ్ అనే మరో బాలుడికి కాలు విరిగింది. అలాగే రాయలప్పదొడ్డిలో కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు పామ్ పాండ్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. కనీసం బాత్రూమ్‌లకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ స్థితిలో ఈ విద్యాశాఖ ఉంది. కనేకల్లు హాస్టల్‌లో 650 మంది పిల్లలు ఉంటే నీళ్లు లేక దుర్గంధం మధ్య గడుపుతున్నారు. విద్యాశాఖ మంత్రికి సవాల్ విసురుతున్నా.. కనేకల్లు హాస్టల్ బాత్‌రూమ్‌ల వద్ద కనీసం 4 నిమిషాలు నిలబడే ధైర్యం ఉందా?. రూ. లక్షన్నర పెట్టి బోర్ వేసే గతి లేదా?.. ఒక హాస్టల్‌లో 650 మంది పిల్లలుంటే రూ. లక్షన్నర పెట్టి ఒక బోర్ వేయించడానికి ఎమ్మెల్యేకు తీరిక లేదు, కలెక్టర్‌కు పట్టదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కుమారుడు చూసే శాఖ కాబట్టి ఎవరూ మాట్లాడకూడదా? గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్. జగన్ 'గోరుముద్ద' ఒక్క పథకానికే రూ. 7,245 కోట్లు ఖర్చు చేశారు. కానీ నేడు కూటమి పాలనలో హాస్టళ్లలో పురుగులు పడ్డ ఆహారం పెడుతున్నారు. నరసన్నపేట బసివలసలో 8 ఏళ్ల రష్మిక, 12 ఏళ్ల కల్పన అనారోగ్యంతో చనిపోయారు. కేజీబీవీలు, గురుకులాల్లో సరైన వసతులు లేక పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది.. ఇసుక, మద్యంపై ఉన్న శ్రద్ధ.. విద్యార్థులపై లేదా? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 372 అక్రమ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. రోజూ రూ. 20 నుంచి 25 లక్షల అక్రమ సంపాదన వస్తోంది. ఇసుక, కంకర, మద్యం, విండ్ పవర్ కాంట్రాక్టులు, దోపిడీలపై ఉన్న శ్రద్ధ.. హాస్టళ్లకు వెళ్లి పిల్లలకు కనీస వసతులు కల్పించడంలో ఎందుకు లేదు? ప్రజావేదికల వద్ద ఎమ్మెల్యే బంధువుల చుట్టూ తిరిగే కొద్దిమంది ఉపాధ్యాయులు బడులు, హాస్టళ్ల సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? జన్మదిన వేడుకలకు ఇచ్చే ప్రాధాన్యత పాఠశాలల నిర్వహణపై ఎందుకు పెట్టడం లేదు?. విద్యార్ధుల మృతిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలి.. రూ. కోటి పరిహారం ఇవ్వాలి! విద్యార్ధి చనిపోయిన తర్వాత రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని మాజీ ఎంపీ తలారి రంగ్య మండిపడ్డారు. బెల్ట్ షాపుల ద్వారా రోజూ లక్షలు దండుకుంటున్న ఎమ్మెల్యే తన సొంతంగా రూ. 50 లక్షలు, ప్రభుత్వం తరపున మరో రూ. 50 లక్షలు.. మొత్తం కోటి రూపాయల పరిహారం మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ఇవ్వడంతో పాటు... కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు పాలన చేతకాకపోతే తప్పుకోవాలని తేల్చి చెప్పారు.